ప్రజాశక్తి - అజిత్‌సింగ్‌నగర్ : దళిత రక్షణ యాత్రలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో వాల్ పోస్టరు ఆవిష్కరించారు. అనంతరం గొల్లపూడి నల్లకుంట రాయలపాడు గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ దళితుల సమస్యల్ని తెలుసుకుంటూ సంతకాల సేకరణ చేస్తూ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్ మాట్లాడుతూ విజయవాడ పట్టణానికి కూతవేటు దూరములో ఉన్న విజయవాడ రూరల్ మండలంలోని గ్రామాలకు స్మశాన వాటికలు దగ్గర్లో లేవని ఉన్న స్మశాన భూములు కూడా నిండాయని ప్రత్యామ్నాయంగా రెండు ఎకరాలు ప్రభుత్వం కొనుగోలు చేసి స్మశాన భూములు ఇవ్వాలని ఆయన అన్నారు. దళితవాడలు నివాస ప్రాంతాలు మురికి కాలువ లాగా తయారయ్యాయని ఊరి మధ్యలో నుంచి వచ్చే వరదంతా దళితవాడలను ముంచి వేస్తున్నాయని దళితవాడల్లో డ్రైనేజీ పారిశుధ్యం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐలు నాయకులు ఆవుల.వెంకట్రావు, జి.సుబ్బారావు సుధీర్, పాపారావు పూర్ణచంద్రరావు సిఐటియు నాయకులు తాళ్లూరి నరసింహారావు, హరీష్, ,సుగుణేశ్వరరావు పాల్గొన్నారు.










