Dec 01,2021 06:41

భేతాళ కథలలో విక్రమార్కుడు కూడా జవాబు చెప్పలేని ప్రశ్న ఏదైనా వుందంటే అది డీఎస్సీ వుంటుందా వుండదా అన్నదే. 2019లో జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక త్వరలో మెగా డీఎస్సీ ఉంటుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పలుసార్లు ప్రకటించారు. ఎన్నికల ప్రచార సభలలో తమ పార్టీ అధికారంలోకి వస్తే పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ కూడా హామీ ఇచ్చారు. ఆయన అభీష్టం నెరవేరింది. జగన్‌ ప్రభుత్వం ఏర్పడి విలువైన సగ భాగం గడిచిపోయింది. కానీ జగన్‌ వాగ్దానం చేసిన ఉపాధ్యాయ ఖాళీల భర్తీ హామీ మరుగున పడింది. ఆ మధ్య డీఎస్సీకి ముందు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ నిర్వహిస్తామని సిలబస్‌ ను కూడా ప్రభుత్వం ప్రకటించింది. నెలలు గడిచిపోతున్నా కనీసం టెట్‌ షెడ్యూలు కూడా ఇవ్వలేదు. జగన్‌ ప్రభుత్వ వైఖరి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులలో తీవ్ర అసంతృప్తిని కలగజేస్తోంది.


ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు జగన్‌ ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించింది. ప్రభుత్వ పాఠశాలలలో నూతన విద్యార్థుల చేరిక బాగా పెరిగింది. కానీ ఏం లాభం? అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని చందంగా జగన్‌ ప్రభుత్వం పాఠశాల విద్యపై చేసిన కృషి మొత్తం బూడిదలో పోసిన పన్నీరే అవుతోంది. విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా పాఠాలు బోధించడానికి ఉపాధ్యాయులు లేకపోవడంతో ఇటు విద్యార్థుల లోనూ అటు తల్లిదండ్రులలోనూ నిట్టూర్పులు మొదలవుతున్నాయి. విద్యార్థుల సంఖ్యకు తగినంతగా ఉపాధ్యాయులు లేక ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న టీచర్లు అన్ని తరగతులకు పాఠాలు చెబుతూ లెక్కలేనన్ని యాప్‌ల భారాన్ని మోయాల్సి రావటంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన కుంటుపడింది. 2018లో చివరిసారిగా డీఎస్సీని 7500 పోస్టులతో చంద్రబాబు నాయుడు నిర్వహించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద సంఖ్యలో దాదాపు 20 వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మరి ఎన్నికల సభలలో హామీ ఇచ్చినట్లు జగన్‌ ప్రభుత్వం మెగా డీఎస్సీ ఎందుకు నిర్వహించలేదు? రుణం కోసం ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకోవడం వల్ల బ్యాంకు షరతులలో ఉపాధ్యాయ నియా మకాలపై నిషేధం ముఖ్యమైనదని, అందువల్లే డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపలేదని మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారమే నిజమైతే మనుషులను ఎంతగానో ప్రేమిస్తాను అని చెప్పే జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులను మోసం చేసినట్లే. మాట ఇస్తే అమలు చేస్తాడు అనే విశ్వసనీయత ఉన్న జగన్‌ ప్రభుత్వాన్ని నమ్మి ఎందరో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ప్రైవేటు పాఠశాలల్లో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి కోచింగ్‌ లకు వెళ్లారు. ప్రస్తుతం వదులుకున్న ఉద్యోగాలు మళ్లీ దొరకకపోవడం, డీఎస్సీ నోటిఫికేషన్‌పై సంశయం వుండటం వల్ల వాళ్ళు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వం మౌనం వీడాలి. డీఎస్సీ నిర్వహణపై ప్రభుత్వ నిర్ణయం ఏదో చెప్పాలి. చివరగా ప్రపంచబ్యాంకును నమ్ముకున్న నాయకుల గతి ఏమైందో జగన్‌ మోహన్‌ రెడ్డి మననం చేసుకోవాలి.
 

- రత్నకుమారి,
సెల్‌ : 9398122089