Aug 28,2020 08:54

'సరసం విరసమైతే అన్నీ ద్రోహాలే!' అన్నాడు పేపరు చదువుతూ సుబ్బారావు.
ఇంతకీ ఏమైంది సుబ్బారావు గారూ... అన్నా....
ఎన్‌టిఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి పాతికేళ్లయిందంట! ఎన్‌టిఆర్‌ చంద్రబాబును బహిష్కరించిన రోజును బిజెపి నేత సునీల్‌ దేవర గుర్తు చేస్తున్నారు...
అవునా... దొంగలు పడిన ఆర్నెల్లకు ఏవో మొరిగినట్టు ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా? ఈ పాతికేళ్లలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని, పదేళ్లు కాపరం చేసినప్పుడు, రాష్ట్రంలో మంత్రి పదవులు పొందినప్పుడు, కేంద్రంలో ఆ పార్టీ వాళ్లకి మంత్రి పదవులిచ్చినప్పుడు గుర్తుకురాలేదా? అన్నా...
అంతా బాగుంటే... మా బాబు బంగారం అంటారు... లేకపోతే నమ్మక ద్రోహానికి పేటెంట్‌ బాబుదే అంటారు.. కాషాయ పార్టీ వాళ్ల మాటల వెనకాల వాళ్లు తీయబోయే గోతుల ప్రణాళికలుంటాయి అన్నారు సుబ్బారావు..
ద్రోహం గురించి అంతగా మాట్లాడుతున్నారు.. మరి మన రాష్ట్రానికి మోడీ, బిజెపి చేసిన ద్రోహం సంగతేంటి? ప్రత్యేక హోదా... హస్తినను తలదన్నే రాజధాని... విశాఖకు రైల్వే జోన్‌ వగైరా హామీలన్నీ ఏమయ్యాయి? పిడికెడు మట్టి... చెంబుడు నీళ్లు పోసి... తెలుగువాడి ఆశలపై నీళ్లు పోసిన వాళ్లు... ఎన్ని ఆందోళనలు చేసినా దున్నపోతు మీద వానపడ్డట్టు... కదలికలేని వాళ్లేనా ఆ మాటంది? అన్నా...
ఆంధ్రాలో ప్రతిపక్ష స్థానం మాదే అంటూ ఈ మధ్య కాషాయ పార్టీ నేత రామ్‌మాధవ్‌ చెప్పాడు కదా... అందుకే ఇప్పుడు సునీల్‌ దేవర ప్రతిపక్షంపై మాటల యుద్ధం చేస్తున్నాడు. ఎన్నికల ముందు ధర్మ పోరాట దీక్షలు, మోడీపై యుద్ధం అంటూ గొంతెత్తిన చంద్రబాబు ఓటమి తరువాత కుక్కిన పేనులా అయిపోయాడు. ఎన్‌ఆర్‌సి, సిఎఎ వివాదం, కరోనా లాక్‌డౌన్‌ లో ప్రజలు, ముఖ్యంగా వలస కార్మికుల కష్టాలు, తాజాగా నూతన విద్యా విధానం... ఇలాంటి ఏ అంశాల పైనా మాట్లాడకుండా తేలు కుట్టిన దొంగలా ఉండిపోయాడు. ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు బిజెపి తీర్థం పుచ్చుకున్నా మాట్లాడలేని స్థితి లోకి వెళ్లిపోయాడు. ఇదంతా ఎందుకో అర్థం కావడం లేదు అన్నా..
ఓ నవ్వు నవ్వి... దీన్నే నక్కాశ అంటారు. పెద్ద జంతువులు వేటాడుతుంటే వెనక నక్కినక్కి ఉండి, అవి తినగా వదిలేసిన భాగం కోసం నక్కలు తాపత్రయ పడతాయి. ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు పరిస్థితీ అలాగే ఉంది. ఘోర పరాజయం పాలైన తరువాత బిజెపిని తిట్టడం తప్పయిపోయిందంటూ పశ్చాత్తాప ప్రకటన చేసింది ఎందుకనుకుంటున్నావు? వైసిపిని ఒంటరిగా ఎదుర్కోవడం ఇప్పుడున్న పరిస్థితిలో కష్టం కనుక కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అండతో బలపడాలని అనుకుంటున్నాడు. అందుకోసమే లొంగుబాటు రాజకీయాలు చేస్తూ... సాగిలబడిపోయాడు. దుమ్మెత్తిపోస్తున్నా నోరు పెగలడం లేదు. చాప కింద నీటిలా చొరబడి చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను కాషాయ పార్టీ కబళించిన అనుభవాలను గుర్తు చేసుకుంటే మంచిది. లేకపోతే బలి కావడానికి తమ పార్టీని సిద్ధం చేస్తున్నట్టే... ఇక అధికార వైసిపి పరిస్థితి కూడా దాదాపు అంతే. ఏం మాట్లాడితే మోడీకి కోపం వస్తుందో అన్నట్టు వినతులతో నెట్టుకురావాలనుకుంటున్నారు.
అందుకే కాబోసు 'జీతమూ భత్యమూ లేకుండా తోడేలు మేకలు కాస్తానన్నట్టు' మన రాష్ట్రంలోనూ చక్రం తిప్పాలని బిజెపి కలలుగంటోంది. ఎన్నికల్లో ఓటమితో ప్లేటు ఫిరాయించిన కల్యాణ బాబుతో కలిసి దేశం తమ్ముళ్లను బుట్టలో వేసుకుని వచ్చే ఎన్నికల నాటికి ఏదో సేసెయ్యాలని తలపోస్తుంది. లోగుట్టు ప్రజల కెరుక అన్నట్టు... బిజెపి రాష్ట్రానికి చేసిన ద్రోహం... వాళ్ల కులాల, మతాల భ్రష్టు రాజకీయాలు అందరికీ అర్థమవుతున్నాయి... కరోనా కష్టకాలంలో జనానికి అండగా నిలిచి దేశానికి మార్గదర్శకంగా నిలిచిన ఎర్రజెండా పాలనలోని కేరళకూ.. జనాన్ని గాలికొదిలేసిన మోడీ, కాషాయ పార్టీల పాలనలోని రాష్ట్రాలకూ ఉన్న తేడాను జనం గమనిస్తున్నారు. వాళ్లు ఎన్ని రంగుల జెండాలు కలుపుకుని వచ్చినా... బంగాళాఖాతంలో కలిపేసేందుకు ఆంధ్రాజనం సిద్ధంగానే ఉంటారన్నా....
- మోహన సిద్ధార్థ్‌