Sep 24,2020 08:01

'ప్రజల అభిప్రాయాలను, వారి అలవాట్లను ఒక పద్ధతిలో చాలా తెలివిగా ఏమార్చడమనేది ప్రజాస్వామ్య సమాజంలో అతి ముఖ్యమైన అంశం. సమాజంలో కంటికి కనిపించని ఈ యంత్రాంగాన్ని ఎవరైతే నిర్దేశించగలరో వారే మన కంటికి గోచరం కాని ప్రభుత్వం. అదే మన దేశాన్ని నిజంగా పాలించే శక్తి' అని ఎడ్వర్డ్‌ ఎల్‌. బెర్నాస్‌ వ్యాఖ్యానించారు.
20వ శతాబ్దపు తొలినాళ్ళకు చెందిన ప్రచురణకర్త, జర్నలిస్టు, ప్రజా సంబంధాల సిద్ధాంత ఆవిష్కర్త, ఆధునిక ప్రచారానికి ఆద్యుడిగా పరిగణించే బెర్నాస్‌ తన పుస్తకంలో పై వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రియాలో జన్మించిన ఆయన ప్రముఖ మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌కు మేనల్లుడు. 'ది సైన్స్‌ ఆఫ్‌ మానిప్యులేటింగ్‌ ది మాసెస్‌''కు తన అంకుల్‌ సిద్ధాంతాలు, ఆవిష్కరణల్లో చాలా వాటిని వర్తింపచేశారు. అమెరికా పెట్టుబడ ిదారీవాద చిహ్నాలను, ప్రతిష్టను ఒక పద్ధతి ప్రకారం నిర్మించిన అత్యంత ముఖ్యమైన సాధనాల్లో ఈ సైన్స్‌ ఒకటని ఆయన పేర్కొన్నారు. కమ్యూనికేషన్స్‌ రంగంలో సాంకేతికత పురోగమిస్తున్న కొద్దీ సమాచార ప్రపంచం, ఇంటర్‌నెట్‌ ఇలా ఈ విజ్ఞాన రంగమంతా చాలా అత్యాధునికంగా మారిపోయింది. దాని ప్రభావం ఎలా వుందన్నది అంచనా వేయడం కూడా చాలా కష్టమని బెర్నాస్‌ అన్నారు.
గుర్తు తెలియని వ్యక్తుల రాజకీయ ప్రాధాన్యతలు, వారి లైంగిక వైఖరులు, తమతో పరిచయం వున్న వారిని వారు ఎంతలా విశ్వసిస్తారు, వారి సంబంధాలు ఎంత పటిష్టంగా వున్నాయి వంటి అంశాలన్నీ ఊహించగల సామర్ధ్యమున్న పలు నమూనాలను విశ్లేషకులు రూపొందించారు. వీటన్నింటికీ కారణమైన, వెబ్‌సైట్లలో తమంతట తాము ఈ సమాచారాన్ని పోస్ట్‌ చేసిన వారికి ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మనకు ఇ-మెయిళ్లు, ట్వీట్లు, ఆన్‌లైన్‌ ప్రెజంటేషన్లు, ఫేస్‌బుక్‌ లైక్‌లు, ఇలా చాలా డేటా మనకు ప్రతి రోజూ ఆన్‌లైన్‌లో ఉత్పత్తి అవుతూ వుంటుంది. మన భూగోళంపై మనుష్యుల కన్నా సెల్‌ఫోన్లు చాలా ఎక్కువగా వున్నాయి. వీటి వాడకం రోజు రోజుకూ పెరుగుతూనే వుంది. దాంతో ఇలా మనకు ఆన్‌లైన్‌లో అందే సమాచారం కూడా పెరిగి పోతూనే వుంది. మానవ వ్యవహార శైలి, ప్రవర్తనాతీరుపై పెద్ద ఎత్తున డేటా నమోదవుతోంది. దీన్ని స్టోర్‌ చేసి ప్రాసెస్‌ చేస్తున్నారు. మనం ప్రతి రోజూ ఉపయోగించే అప్లికేషన్లు ఇటువంటి చాలా సమాచారాన్ని ఇస్తాయి.
ఇటువంటి వేలాది రెట్ల సమాచారాన్ని బిగ్‌ డేటా కార్పొరేషన్లు ఉపయోగించుకుంటూ వుంటాయి. ఎన్నికల ప్రచారాలకు లేదా రాజకీయ ప్రచారాలకు వాడుకోగల, విధ్వంసకర చర్యలకు కూడా ఉపయోగించుకోగల సామాజిక, భౌగోళిక సమాచారాన్ని ఈ బిగ్‌ డేటా ఇస్తోంది. దీంతో గెలుపోటములు, ప్రభుత్వాల ఏర్పాటు, కూల్చివేతలు కూడా నిర్దేశితమవుతున్నాయి.
అర్జెంటైనా అధ్యక్ష పదవికి పోటీ చేసినపుడు మారిసియో మాక్రి ఎన్నికల ప్రచారం సందర్భంగా... ఆయన బృందం చాలా పెద్ద ఎత్తున ఈ సామాజిక, ఆర్థిక డేటాను ఉపయోగించుకుంది. బారక్‌ ఒబామా, ఫ్రాంకోయిస్‌ హాలాండ్‌, డొనాల్డ్‌ ట్రంప్‌, జైర్‌ బోల్సనారో ఇలా అందరూ కూడా ఈ బిగ్‌ డేటాను ఉపయోగించుకున్నవారే. బొలీవియాలో కుట్రదారులు, వెనిజులా, క్యూబాల్లో విధ్వంసకర చర్యలకు పాల్పడేవారు అందరూ కూడా తమ విష ప్రచారాల్లో బిగ్‌ డేటాను ఉపయోగించుకున్నవారే.
బ్రెగ్జిట్‌ ఉపసంహరణ ప్రచారాన్ని నిర్వహించిన కేంబ్రిడ్జి అనలిటికా కుంభకోణం మనకు తెలుసు. అలాగే డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ప్రచారకర్తలు, పలువురు యురోపియన్‌ ప్రభుత్వ నేతలు కూడా దీన్ని ఉపయోగించుకున్నవారే. ఫేస్‌బుక్‌ వినియోగదారుల నుండి డేటాను చౌర్యం చేయడంపై అనలిటికా కంపెనీ తీరును బాగా నిరసించారు. అయితే ఈ పద్ధతులు ఆచరించింది ఆ ఒక్క కంపెనీనే కాదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మందికి పైగా ప్రజల నుండి సమాచారాన్ని సేకరించిన దాన్ని గంప గుత్తగా అమ్మివేసిన కార్పొరేషన్లు వున్నాయి.
2017 జూన్‌ 16న ట్రంప్‌ జారీ చేసిన అధ్యక్ష ఉత్తర్వులకు అనుగుణంగా విదేశాంగ శాఖలో క్యూబా ఇంటర్‌నెట్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ అంతర్గత వ్యవస్థకు విఘాతం కలిగించడానికి అమెరికా ప్రభుత్వం సృష్టించిన ఇంటర్‌ నెట్‌ విధ్వంసకర కార్యకలాపాల గ్రూపుగా తెలుసు. మోసపూరితమైన ప్రయోజనాల తోనే యువ జర్నలిస్టులకు స్కాలర్‌షిప్‌లు, పర్యటనలు పెడతారు. విప్లవాన్ని సమర్ధించిన ఎవరినైనా ఆన్‌లైన్‌లో నిరంతరంగా వేధించేందుకు సైబర్‌ మెర్సి నరీలకు చాలా ఉదారంగా డబ్బు చెల్లిస్తారు. ఇవన్నీ కూడా ఈ ఎత్తుగడలను అమలు చేయడంలో భాగమే. వీటికి అమెరికా ఆర్థిక సాయం అందిస్తుంది. గత 60 ఏళ్ళుగా ప్రతి అమెరికా ప్రభుత్వం క్యూబాకు వ్యతిరేకంగా...ముసుగులో సాగిస్తూ వచ్చిన ప్రతి చర్య కూడా...ఇటువంటి డబ్బులు చెల్లించిన మీడియా కార్యకలాపాల ద్వారానే సాగుతోంది.
('గ్రాన్మా' సౌజన్యంతో)