Jul 22,2021 16:32

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద మీడియా గ్రూపులలో ఒకటైన దైనిక్‌ భాస్కర్‌ గ్రూప్‌ సంస్థలపై ఐటి సోదాలు నిర్వహిస్తోంది. దైనిక్‌ భాస్కర్‌ మీడియా గ్రూపు ఇటీవల బిజెపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ప్రధానంగా మహమ్మారి సమయంలో కోవిడ్‌ మరణాలను ఎత్తిచూపుతూ.. ఉత్తరప్రదేశ్‌లో గంగానదిలో కరోనా మృతదేహాలు తేలియాడడంపై అధికారిక ప్రభుత్వం చేస్తున్న వాదనలను ఈ మీడియా సంస్థ విమర్శనాత్మకంగా ఎత్తిచూపింది. దీంతో ప్రభుత్వాన్ని విమర్శినందుకుగానూ... ఆ మీడియా సంస్థలపై పన్ను ఎగవేత కారణాన్ని ఎత్తి చూపి ప్రభుత్వం ఐటి దాడులు నిర్వహిస్తోంది. దైనిక్‌ భాస్కర్‌ గ్రూప్‌ ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలోనూ, నివాసంలోనూ, సోదాలు జరుగుతున్నాయి. భోపాల్‌, రారుపూర్‌, జైపూర్‌, అహ్మదాబాద్‌, భోపాల్‌, మహారాష్ట్రలోని కొన్ని ప్రదేశాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయని ఐటి విభాగం వర్గాలు తెలిపాయి. దైనిక్‌ భాస్కర్‌ గ్రూప్‌ దేశంలోనే అతిపెద్ద మీడియా గ్రూపులలో ఒకటి. 12 రాష్ట్రాల్లో 60 ఎడిషన్లతో.. బహుళ బాషల్లో పనిచేస్తున్నాయి.

కాగా, దైనిక్‌ భాస్కర్‌లో పనిచేస్తున్న చాలా మంది ఇళ్లపై కూడా ఐటీ బందం సోదాలు చేసింది. కార్యాలయాల్లో ఉన్న ఉద్యోగుల మొబైల్స్‌ను సైతం జప్తు చేసింది. వారు బయటకు వెళ్ళడానికి కూడా అనుమతించడం లేదు. నైట్‌ షిఫ్ట్‌ కార్మికులను సైతం కార్యాలయం నుండి బయటకు వెళ్ళకుండా నిరోధించారు. అయితే, ఈ సోదాల్లో పాల్గొన్న అధికారులు.. ఇదంతా తమ ప్రక్రియలో భాగమేనని, పంచనామ పూర్తయిన తర్వాత వారిని విడిచిపెడతామని చెప్పారు. ఈ క్రమంలో డిజిటల్‌ నైట్‌ డ్యూటీ టీమ్‌ను మధ్యాహ్నం 12:30 గంటలకు వదిలిపెట్టారు. డిజిటల్‌ విభాగంలో చాలా మంది మహిళా ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ చర్యపై ఇప్పటివరకు ఉన్నతాధికారులు ఎటువంటి కారణం స్పష్టం చేయలేదు.