''భారత దేశం మురికి దేశం'', ''భారత దేశ గాలి మురికి గాలి''.....అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా గత శుక్రవారం నాడు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దేశం మీద చేసిన అహంకార పూరిత వ్యాఖ్యలు ఇవి. ఈ వ్యాఖ్యలే ఇంకో దేశాధిపతో లేక ఇంకో దేశానికి చెందిన వ్యక్తో చేస్తే మన దేశంలోని జాతీయవాద కాషాయ మూకలకు ''దేశ భక్తి'' ఉబికి పైకి వచ్చి అతనిపై విరుచుకు పడేవారు. భారత దేశం పట్ల అక్కసుతో అలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని గగ్గోలు పెట్టే వారు. మన దేశంలో ఎవరైనా ఈ మాట అని ఉంటే ఈ సరికే ''దేశ ద్రోహ నేరం'' కింద జైల్లో ఉండేవారు. కానీ ఆ వ్యాఖ్యలు చేసింది మనం ''నమస్తే ట్రంప్'' అని ఇటీవలెనే దండిపమాణం చేసిన వ్యక్తి గదా, మన ప్రధాన మంత్రి మోడీగారు అమెరికా వెళ్లి హూస్టన్‌లో పెద్ద సభ పెట్టి ''ఈసారీ ట్రంప్ సర్కారే'' రావాలి అంటూ దౌత్య మర్యాదలు కూడా పక్కన పెట్టి నెత్తినెక్కించుకున్న వ్యక్తి కదా అందుకని సంఫ్‌ు పరివారం అధికారికంగాగానీ, అనధికారికంగా గానీ ఆ దురహంకా రపూరిత వ్యాఖ్యలపై ఒక్క మాటంటే ఒక్క మాట అనడం లేదు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ట్రంప్, జో బిడెన్‌లు శుక్రవారం నాడు అనేక అంశాలపై తుది దఫా ఎదురుబొదురు చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చలోకి వాతావరణ కాలుష్యం అంశం వచ్చినప్పుడు ట్రంప్ మాట్లాడుతూ ''చైనాను చూడు ఎంత మురికిగా ఉందో. రష్యాను చూడు. ఇండియాను చూడు ఎంత మురికిగా ఉందో, దాని గాలి మురికి మయం'' అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ట్రంప్ ప్రత్యర్థి డెమొ.క్రటిక్ పార్టీ అభ్యర్ధి బిడెన్ ట్విట్టర్‌లో స్పందిస్తూ ''అధ్యక్షుడు ట్రంప్ ఇండియాను ''మురికిది'' అన్నారు. స్నేహితుల గురించి ఇలా మాట్లాడకూడదు. వాతావరణ మార్పులు వంటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనే పద్ధతి ఇది కాదు'' అని పేర్కొన్నారు.
విశేషమేమంటే కనీసం బిడెన్ స్పందించినంతగానైనా మన దేశ ప్రధాని గానీ, విదేశాంగ మంత్రిగానీ, లేక ఏ అధికారిగానీ స్పందించలేదు. ట్విట్టర్‌లో మాత్రం ఈ వ్యాఖ్యలపై బోల్డంత చర్చ జరిగిపోతోంది. అందులో కొందరు కాషాయ భక్తులు - తద్వారా ట్రంప్ భక్తులు- ఆయన వ్యాఖ్యలను వెనకేసుకు రావడం ప్రారంభించారు... అవును ట్రంప్ అన్న దాంట్లో తప్పే మున్నది. మన గాలి మురికిగా ఉంది కదా. ఉన్నదే ఆయన అన్నాడు.. అంటూ ట్వీట్లు చేస్తున్నారు. మన నగరాల్లో గాలి శుభ్రం చేసుకోవాలి కదా అని కర్తవ్య బోధ చేస్తున్నారు. నిజమే మన గాలిలో కాలుష్యం ఉంది. అదే కాదు మన దేశంలో చాలా చాలా సమస్యలున్నాయి. కానీ ఒక దేశాధినేత దౌత్య మర్యాదలు మరిచిపోయి మన దేశంలోని గాలినే కాదు మన దేశాన్నే ''మురికి'' దేశం అంటే నోరుమూసుకు కూర్చున్న వారినీ, పైగా సమర్ధనకు దిగిన వారినీ ఏమనాలి? మిత్ర దేశాన్ని అలా అనకూడదు అని బిడెన్ అంటున్నారు. అంటే శత్రు దేశం అయితే అలా అనవచ్చా? ఒక దేశం విధానాలను విమర్శించడం వేరు, కానీ ఆ దేశం మొత్తా న్ని ''మురికి దేశం'' అంటే అది దురహంకారం కాక మరేమిటి?
నిజానికి ప్రపంచాన్ని కాలుష్యంలో నింపుతున్నది, వాతారవణ కాలుష్యానికి కారణమవుతున్నది అమెరికా, యూరప్ దేశాలే. ప్రపంచ జనాభాలో 4 శాతం ఉన్న అమెరికా ప్రపంచ ఇంధనంలో 25 శాతం వాడుతున్నది. ప్రపంచ వాతారణ కాలుష్యంలో 25 శాతం అమెరికానుండే వస్తున్నది. ఈ రోజు గ్లోబల్ వార్మింగ్‌కు కారణమవుతున్న కాలుష్యాలు ఈ రోజు వాతావరణంలోకి విడుదలవుతున్న వాయువులవల్లనే ఏర్పడలేదు. నాలుగు వందల ఏళ్ల క్రితమే పారిశ్రామిక విప్లవంతో అభివృద్ధి సాధించిన పెట్టుబడిదారీ చేశాలు ఈ నాలుగు వందల ఏళ్లుగా విడుదల చేసిన వాయువులు భూమి చుట్టూ చేరి గ్లోబల్ వార్మింగ్‌కు కారణమవుతున్నాయి. గాలిలో సరిహద్దులు ఉండవు కనుక అమెరికా, యూరప్ దేశాలు విడుదల చేసిన కర్బన ఉద్గారాలు భూగోళమంతా వ్యాపించాయి. భారత్, చైనాలు ఇటీవలి కాలంలో పారిశ్రామిక వంతం అయ్యాయి. అందువల్ల నాలుగువందలేళ్ల పాపాలను నెత్తిన పెట్టుకుని ట్రంప్ వంటి వారు భారత్, చైనాలను నిందించడం అక్రమం. తమ దేశాల్లోని కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను, పారిశ్రామిక మిగులు చెత్తనంతా వర్థమాన దేశాలకు పంపించి వాటిని మురికి కూపాలుగా మారుస్తున్నది ధనిక దేశాలే. ఆ పాపాలను కప్పిపు చ్చుకుని, వర్థమాన దేశాలను మురికి దేశాలుగా వర్ణించడం దుర్మార్గం. ఇది అగ్రరాజ్య దురహంకారమే కాదు జాత్యాహంకారం కూడా. స్వదేశంలో నల్లజాతీయులపై జాత్యాహంకార దాడులకు వత్తాసు పలుకుతున్న ట్రంప్ ఆసియాకు చెందిన రెండు ప్రధాన దేశాలైన, ప్రాచీన సంస్కృతిగల రెండు దేశాలపై జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయం కాగా అటువంటి ''మురికి'' వ్యాఖ్యలపై మోడీ గానీ, బిజెపి ప్రభుత్వం గానీ మౌనం వహించడం సిగ్గుచేటైన విషయం.
భారత్, చైనాలకు వ్యతిరేకంగా ట్రంప్ వ్యాఖ్యానించడం ఇదే ప్రధమం కాదు. తొలి అధ్యక్ష చర్చలో కూడా ట్రంప్ భారత, చైనా, రష్యాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు. భారత్, చైనా, రష్యాలు ప్రకటిస్తున్న కరోనా మృతుల సంఖ్యలు నమ్మదగినవి కావని అన్నారు. అంతే కాదు ఈ దేశాలు నిరంతరం గాలిలోకి కాలుష్యాలు వదులుతున్నాయని అన్నారు. గత మే నెలలో బ్రిటన్‌కు చెందిన ఐటివి కి ట్రంప్ ఇంటర్వ్యూ ఇస్తూ ''భారత దేశంలో మంచి గాలి లేదు. మరీ మంచి నీరు లేదు. అక్కడ గాలి పీల్చుకోవడం కూడా కష్టమే'' అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మన దేశంలో కరోనా వ్యాప్తిని కూడా లెక్క చేయకుండా ప్రధాని మోడీ గుజరాత్‌లో వేలాదిమందిని పోగుచేసి ''నమస్తే ట్రంప్'' కార్యక్రమం నిర్వహించిన కొద్ది మాసాలకే ట్రంప్ నోటివెంట వచ్చిన మాటలు ఇవి. 2018 అక్టోబర్1న అమెరికా అధ్యక్షభ వనంలో జరిగిన పత్రికా గోష్టిలో భారత దేశం ''పన్నుల రాజు'' (టారిఫ్ కింగ్) అని ట్రంప్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అయితే అది అమెరికాను సంతోషపెట్టడం కోసం ఒక వాణిజ్య ఒప్పం దంపై చర్చిస్తోంది అని పేర్కొన్నారు. రష్యా నుండి మన దేశం ఎస్-400 క్షిపణులు దిగుమతి చేసుకోవడంపై అదే నెలలో వ్యాఖ్యానిస్తూ త్వరలోనే మేం ఏం చేస్తామో ''భారత దేశం చూస్తుంది. అవునా కాదా?'' అని వ్యాఖ్యానించారు. ట్రంప్ అధికా రంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన మొదటి మంత్రి వర్గ సమావేశంలోనే మన దేశంపై దురహంకార పూరిత వ్యాఖ్యలు చేశారు: ఆయన (మోడీ) ''ఆఫ్ఘనిస్తాన్‌లో ఒక లైబ్రరీ నిర్మించానని నాకు పదేపదే చెబుతున్నారు'', ''అదేంటో మీకు తెలుసా? అది మనం అయిదు గంటలు చేసే ఖర్చుతో సమానం... అయితే దానికి మనం 'లైబ్రరీ నిర్మించినందుకు కృతజ్ఞతలు' అని చెప్పా ల్సిందే. కానీ దాన్ని ఆఫ్ఘనిస్తాన్‌లో ఎవరు ఉపయోగించు కుంటారు?'' అన్నాడు. నిజానికి భారత దేశం ఆఫ్ఘనిస్తాన్‌లో లైబ్రరీ కట్టలేదు, అక్కడి పార్లమెంటు భవనాన్ని నిర్మించింది. బహుశా గందరగోళంతో ట్రంప్ ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని అధికారులు తరువాత వివరణ ఇచ్చారు. 2019 జూన్ 11న ట్రంప్ భారత దేశ వాణిజ్య సంకాలపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. ''ఆయనకు (మోడీకి) ఒక్క ఫోన్ కాల్ చేయ డంతో దిగివచ్చి 50 శాతం సుంకాలు తగ్గించాడు... అయినా ఇంకా సరిపోదు'' అని అన్నాడు. వీటితోబాటు కాశ్మీర్ విష యంలో తను జోక్యం చేసుకుంటానని రెండు సార్లు చెప్పారు.
భారత దేశానికి వ్యతిరేకంగా, లేక దేశాన్ని ఇరకాటంలో పెట్టే పద్ధతిలో ట్రంప్ వ్యాఖ్యానించిన ప్రతిసారీ మన అధికారులు వాటి తీవ్రతను తక్కువ చేసి మాట్లాడ్డమో, లేక మౌనం వహించడమో చేస్తూ వస్తున్నారు. సరికొత్తగా ఆయన చేసిన జాత్యహంకార పూరిత వ్యాఖ్యల విషయంలో కూడా వారు నోరుమెదపకుండా కూర్చున్నారు. అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం పేరుతో దాని వలలో మన దేశం పడిన ఫలితమిది. ఆసియాలో చైనాకు వ్యతిరేకంగా అమెరికా పన్నిన దీర్ఘకాలిక యుద్ధ వ్యూహంలో భారత దేశాన్ని జూనియర్ భాగస్వామిగా మార్చివేసినందున అమెరికా మన దేశానికి వ్యతిరేకంగా చేసే వ్యాఖ్యలను కూడా ఖండించలేనంతగా మన పాలక వర్గాలు స్వతంత్రతను కోల్పోయాయి.
ఎస్. వెంకట్రావు










