Oct 20,2020 07:16

కమ్యూనిస్టు ఉత్తమ విలువలతో విప్లవ జీవితం గడిపిన డాక్టర్‌ పోలవరపు జశ్వంతరావు ఆగస్టు 27న హైదరాబాద్‌లో కరోనా వ్యాధితో 73 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు. సిపిఐ ఎంఎల్‌ పార్టీ కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యునిగా, 'జనశక్తి’ తెలుగు పత్రికకు, 'క్లాస్‌ స్ట్రగుల్‌' ఇంగ్లీషు పత్రికకు సంపాదకునిగా, తరిమెల నాగిరెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ కార్యదర్శిగా వ్యవహరించారు. జశ్వంత్‌ ది కృష్ణాజిల్లా గుడివాడ దగ్గర గల తమిరిస గ్రామం. 1965-66లో కాకినాడ రంగరాయ మెడికల్‌ కాలేజీలో జస్వంత్‌ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. జస్వంత్‌ మెడికల్‌ విద్యార్థుల బృందం కాలేజీ ప్రిన్సిపాల్‌ కులతత్వ అహంభావ ధోరణులకు వ్యతిరేకంగా ఆందోళన ప్రారంభించింది. ఈ సమస్యపై జస్వంత్‌ ను కాలేజీ నుంచి బహిష్కరించినా రాజీ పడకుండా నిలబడటంతో తిరిగి కాలేజీలో చేర్చుకొన్నారు. ఆ తరువాత విద్యార్థి ఫెడరేషన్‌ నాయకత్వాన అనేక సమస్యలపై నిరంతరం ఆందోళన సాగిస్తూ విద్యార్థులను సంఘటితం చేసేవారు. 1970 ఏప్రిల్‌ 22న కాకినాడలో జరిగిన లెనిన్‌ జయంతి సభ విజయవంతం కావడంలో జశ్వంత్‌ బృందం ప్రధాన పాత్ర పోషించింది. 1973-75 కాలంలో యువ సాహితీ సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేశారు. రాజమండ్రిలో తరిమెల నాగిరెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయటంలో ఈ బృందం కృషి ప్రధానమైనది. ఆ క్రమంలోనే విప్లవ పార్టీ రాజకీయాలను సొంతం చేసుకున్నారు.


ఎమర్జెన్సీ కాలంలో జస్వంత్‌పై పోలీసులు తూర్పు గోదావరి కుట్ర కేసును బనాయించారు. కేసు పెట్టక ముందు పోలీసులు ఆయనను చిత్రహింసలకు గురి చేసినా ఏ మాత్రం బెదరలేదు. కుట్ర కేసు ఫలితంగా జస్వంత్‌ రాజమండ్రి సెంట్రల్‌ జైలులో 18 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. 1980లో కుట్ర కేసును కొట్టివేశారు.


1978 లో జశ్వంత్‌ ప్రముఖ వామపక్ష నాటక రచయిత సుంకర సత్యనారాయణ గారి కుమార్తె శేషమ్మతో దండల పెళ్లి విజయవాడలో జరిగింది. శేషమ్మ వామపక్ష కుటుంబానికి చెందినవారు కావడంతో జస్వంత్‌ కు అన్నివిధాలా జీవిత భాగస్వామిగా సహాయ సహకారాలు అందించారు.


కాకినాడలో ఉండగానే 'జనశక్తి'కి ఆర్థిక అంశాలపై వ్యాసాలు పంపించడంతో ప్రారంభమై 'జనశక్తి' సంపాదక బాధ్యతలు తీసుకునే స్థాయికి ఎదిగారు. 40 సంవత్సరాల పాటు 'జనశక్తి' పత్రిక ఎడిటర్‌గా కృషి చేయడం చరిత్రలో నిలిచిపోయే విషయం. పార్టీ కేంద్ర కమిటీ నాయకులు అయిన తర్వాత ముందుగా 'వ్యాన్‌ గార్డ్‌' తర్వాత 'ముక్తిగామి', ముంబై నుండి 'జనశక్తి' ఇంగ్లీషు పత్రికలకు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. నక్సల్‌బరి ఉద్యమ నిర్మాతగానూ సన్యాల్‌ నేతృత్వంలో 2005లో ప్రారంభమైన 'క్లాస్‌ స్ట్రగుల్‌'కు ఆఖరి క్షణాల వరకు ఎడిటర్‌గా బాధ్యత వహించారు. పార్టీ పత్రికలను ఆర్గనైజర్లుగా రూపొందించటంలో జశ్వంత్‌ అన్ని శక్తులను ఒడ్డి నిర్విరామంగా కృషి చేశారు.


నాగిరెడ్డి 'తాకట్టులో భారతదేశం'లో పేర్కొన్న విశ్లేషణలు ఈ నాటికీ ఏవిధంగా సరిగ్గా ఉన్నాయో ప్రతి చాప్టర్లో తాజా గణాంకాలను జోడించి నేటి పరిణామాలను వివరించే బృహత్తర కర్తవ్యాన్ని జస్వంత్‌ చేపట్టి పూర్తి చేశారు. ఆ విధంగా 'తాకట్టులో భారత దేశా'న్ని సుసంపన్నం చేసే బాధ్యతను విజయవంతంగా నిర్వహించారు.


తరిమెల నాగిరెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ కార్యదర్శిగా, మార్క్సిస్టు మహోపాధ్యాయ రచనలను ప్రచురించటం తోపాటు కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించిన చారిత్రక పత్రాలను టీంవర్క్‌తో తీసుకు రావటం గొప్ప విషయం. సమకాలీన రాజకీయ సమస్యలపై రాష్ట్ర స్థాయిలో ట్రస్ట్‌ సదస్సులు నిర్వహించి చెప్పుకోదగిన కృషి చేసింది.


విప్లవోద్యమానికి 50 సంవత్సరాల పాటు తన జీవితాన్ని అంకితం చేయటం ఎనలేని విషయం. ఈ మొత్తం కాలంలో కమ్యూనిస్ట్‌ విప్లవోద్యమంలో సైద్ధాంతిక పోరాటం చేసినవాడు జస్వంత్‌. నిరంతరం ప్రజా ఉద్యమాల నుంచి నేర్చుకుంటూ తన సైద్ధాంతిక పునాదిని పదును పెట్టుకున్న మార్క్సిస్టు మేధావి. జస్వంత్‌ నిలబెట్టిన కమ్యూనిస్టు విలువలను, త్యాగపూరిత జీవితాన్ని పుణికిపుచ్చుకుందాం. జస్వంత్‌ కొనసాగించిన ఆశయాల సాధన కోసం బోల్షివిక్‌ దీక్షను పూనుదాం.
(అమరుడు జశ్వంతరావు సంస్మరణ సభ నేడు విజయవాడ మాకినేని బసవపున్నయ్య భవన్‌లో జరుగుతున్న సందర్భంగా)

- ముప్పాళ్ళ భార్గవ శ్రీ,
సిపిఐ ఎంఎల్‌ రాష్ట్ర నాయకులు,

సెల్‌ : 9848120105