ప్రజాశక్తి-కర్నూల్ : రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం సిఎం క్యాంప్ ఆఫీస్ ను విశాఖకు తరలిస్తున్నదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. తరలింపు వలన రాష్ట్ర ప్రయోజనాలు ఏమీ లేవని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి, సమీక్ష పేరిట విశాఖకు సిఎం క్యాంప్ ఆఫీస్ తో పాటు ప్రభుత్వ శాఖల తరలింపుపై కర్నూల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని సమీక్ష చేసేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రజలను సిఎం జగన్ మోసగిస్తున్నారని వి శ్రీనివాసరావు విమర్శించారు. మూడు రాజధానులు అని మాట్లాడుతున్న సిఎం జగన్ కర్నూల్ లో సిఎం క్యాంప్ ఆఫీస్, ప్రభుత్వ శాఖలను ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. గత నాలుగేళ్లుగా అమరావతిని అభివృద్ధి నిర్లక్ష్యం చేస్తూ ఆ ప్రాంత రైతులకిచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. మరోవైపు ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయకుండా ఇటువంటి మోసపు మాటలను ప్రజలు విశ్వసించరని హెచ్చరించారు.










