Jul 15,2023 20:20
  • కీలక ఘట్టాన్ని అధిగమించిన చంద్రయాన్‌ 3
  • పనితీరు భేషుగ్గా ఉందంటూ శాస్త్రవేత్తల హర్షాతిరేకాలు

బెంగళూరు / తిరువనంతపురం : జాబిల్లి దిశగా చంద్రయాన్‌ 3 దూసుకెళ్తోంది. వచ్చే ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై సజావుగా ల్యాండయ్యేలా వ్యోమనౌక దిగ్విజయంగా గమ్యం వైపు పయనిస్తోందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహుంగా ప్రయోగించిన చంద్రయాన్‌ 3 పనితీరు భేషుగ్గా ఉందని పేర్కొన్నారు. మలి ఘట్టంలో వ్యోమనౌకలోని థ్రస్టర్లను బెంగళూరులోని ఇస్రో నుంచి మండించారు. అన్ని సజావుగా సాగితే 41 రోజులు ప్రయాణం అనంతరం ఆగస్టు 23న చంద్రుడిపై రోవర్‌ ప్రజ్ఞాస్‌ పరుగులు తీయనుంది. చంద్రయాన్‌ 3 వ్యోమనౌక పనితీరు 'మహాద్భుతం'గా ఉందని విక్రమ్‌ సారాబాయి అంతరిక్ష కేంద్రం (విఎస్‌ఎస్‌ఎస్‌) డైరెక్టర్‌ ఎస్‌ ఉన్నికృష్ణన్‌ నాయర్‌ చెప్పారు. తిరువనంతపురంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ చంద్రయాన్‌ 3కి అవసరమైన ముందుస్త ఏర్పాట్లనీు 'అత్యంత కచ్చితత్వం'తో సమకూర్చారని తెలిపారు. 'నేడు (శనివారం) థ్రస్టర్లను మండించాం. చంద్రయాన్‌ 3 దిగ్విజయంగానే ముందుకు సాగుతోంది. ఆగస్టు 23న చంద్రుడిపై సజావుగానే దిగుతుంది' అని నాయర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 14న మధ్యాహుం 2.35 గంటలకు తిరుపతి జిల్లా సతీష్‌ దావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి దూసుకెళ్లిన ఎల్‌విఎం3 - ఎం4 వ్యోమనౌక చంద్రయాన్‌-3ని 17 నిమిషాల్లోనే లక్షిత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.