నవంబర్ 1వ తేదీన 'సాక్షి' సంపాదకీయ పేజీలో దింటకుర్తి వీర రాఘవ ఉదయ కుమార్ వ్యాసం (చిరస్మరణీయుడు పొట్టి శ్రీరాములు) వచ్చింది. ఇందులో కీలకమైన చారిత్రక విషయాలను విస్మరించారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ జరగటానికి ఆ కాలంలో కమ్యూనిస్టు పార్టీ చేసిన కృషిని...విద్యార్థి, యువజనులను, ప్రజలను పెద్ద ఎత్తున కదిలించిన నాయకుల గురించి ఈ వ్యాసంలో ప్రస్తావించలేదు. ఏ భాష మాట్లాడే ప్రజలకు ఆ రాష్ట్రం ఏర్పడాలని భాషా ప్రయుక్త రాష్ట్ర విభజన సమంజసమైనదని, సరైనదని...కమ్యూనిస్టు పార్టీ నాయకులు చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య తదితరులు ఎలుగెత్తి చాటారు. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్షకు పూర్తి అండదండలందించారు. ఏ భాష మాట్లాడేవారికి ఆ రాష్ట్రం అనే ప్రచారం భాషాప్రయుక్త రాష్ట్రాలకు నాందీ వాచకం పలికింది. మిగతా రాష్ట్రాలు కూడా ఈ ప్రాతిపదికనే ఏర్పడ్డాయి. చారిత్రక విషయాలను రాసేటప్పుడు, చెప్పేటప్పుడు ప్రజా దృష్టిని పాటించాలి.
ఆ పత్రికలో అదే రోజున వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి వ్యాసం (భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రతీక నవంబర్ 1) వచ్చింది. అందులో...'కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రమహాసభ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ రాష్ట్రాన్ని కలిపి విశాలాంధ్ర ఏర్పడాలని, భాషా ప్రయుక్త రాష్ట్రాలు దేశవ్యాపితంగా ఏర్పడాలని ఉద్యమించారు. స్వాతంత్య్రం అనంతరం 1948లో నాటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభారు పటేల్ నేతృత్వంలో జరిగిన సైనిక చర్యతో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడింద'ని రాశారు. ఆంధ్ర మహాసభ ఎందుకేర్పడిందనేది కూడా ప్రస్తావించాల్సి వుంది. భాగ్యనగరం హైదరాబాద్ ఆ చుట్టు పక్కల ప్రాంతాలలో భూహక్కులు లేకుండా వెట్టిచాకిరీతో అలమటిస్తున్న ప్రజల బాధలు వర్ణనాతీతం. అటువంటి పరిస్థితులలో విసునూరు దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి కాఠిన్యంతో వ్యవహరిస్తూ కర్కశంగా అణచివేస్తున్నపుడు దొడ్డి కొమరయ్య హత్య జరిగింది. దాంతో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ నుండి విముక్తి కోసం రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దూం మొహియుద్దీన్ పిలుపుతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమై దాదాపు నాలుగు సంవత్సరాల పాటు సాగింది. ఈ పోరాటంలో నాలుగు వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి తదితర మహిళా నేతలు సైతం తుపాకులు చేపట్టి ఉద్యమించారు. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, దేవులపల్లి రామానుజరావులు కీలకంగా వున్నారు. వ్యాసకర్త సామాజికోన్నతికి కృషి చేసే సంఘానికి బాధ్యులుగా వుండి కూడా చారిత్రక విషయాలను విస్మరించటం తగదు.
- ఎస్.సూర్యకుమార్,
సెల్ : 70362 83023,
చింతలపూడి, పశ్చిమ గోదావరి జిల్లా.










