Sep 16,2022 22:59

ప్రజాశక్తి-విజయవాడ
హాకర్స్‌ అండ్‌ తోపుడు బండ్లు చిరు వ్యాపారుల సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గమని సిఐటియు రాష్ట్ర మాజీ నాయకులు చిగురుపాటి బాబూరావు అన్నారు. విజయవాడ హాకర్స్‌ అండ్‌ తోపుడు బండ్ల యూనియన్‌ (సిఐటియు) నగర 8వ మహాసభ అత్యంత ఉత్సాహ పూరిత వాతావరణంలో శుక్రవారం జరిగింది. ముందుగా యూనియన్‌ జెండాను నగర అధ్యక్షులు బి వెంకటేశ్వరరావు (భూలోకం) ఆవిష్కరిం చారు. యూనియన్‌ నగర అధ్యక్షులు బి వెంకటేశ్వరరావు (భూలోకం) అధ్యక్షతన జరిగిన మహాసభనుద్దేశించి బాబూరావు మాట్లాడుతూ హాకర్స్‌ అండ్‌ తోపుడుబండ్ల చిరువ్యాపారులకు అత్యంత కీలకంగా ఉన్న గుర్తింపు కార్డులు ఇచ్చేంత వరకు ఆందోళనను విరమించేది లేదని, ఈ ఆందోళనకు సిఐటియు సంపూర్ణ మద్దతుని స్తుదన్నారు. గుర్తింపు కార్డులు మంజూరు చేస్తామని నగరపాలక సంస్థ అధికారులు మాటలకు, కాగితాలకే పరిమితం అవుతున్నారు తప్పా...నగరంలోని చిరు వ్యాపారులకు కార్డులు మంజూరు చేయడంలో పూర్తిగా విస్మరిస్తున్నారని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ధరలు పెంచేసి, చిరు వ్యాపారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, చివరకు పెరుగు, పాలు, బియ్యం వంటి నిత్యావసర సరుకులపై కూడా జిఎస్‌టి విధించడం కారణంగా కేజి బియ్యానికి ఈరెండు మాసాల కాలంలో రూ. ఐదు నుంచి పది వరకు ధర పెరిగిందని అన్నారు. సామాన్యులు జీవించలేని పరిస్థితి తయారయిం దన్నారు. మోడీ విధానాలు, భారాలకు వ్యతిరేకంగా ఈ నెల 24న జింఖానా గ్రౌండ్‌లో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు హాకర్స్‌ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు కాశీనాధ్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్‌ శ్రీనివాస్‌, సెంట్రల్‌ సిటీ అధ్యక్ష, కార్యదర్శులు కె దుర్గారావు, ఎంవి సుధాకర్‌ మాట్లాడారు. ముందుగా యూనియన్‌ కార్యదర్శి సిహెచ్‌ మురళి కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. మహాసభ అనంతరం 30 మందితో నూతన కమిటీ ఏర్పడింది. యూనియన్‌ నగర అధ్యక్ష, కార్యదర్శులుగా బి వెంకటేశ్వ రరావు, సిహెచ్‌ మురళి ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, గౌరవాధ్యక్షులుగా ఎం సీతారాములు, కోశాధికారిగా వైఎన్‌విబి కృష్ణ ఎన్నికయ్యారు. గుర్తింపుకార్డుల మంజూరుకు పోరాడాలని, నగరపాలక సంస్థ అధికారులు, పోలీసుల వేధింపులు నిలువరించాలని, వ్యాపారాల కోసం ప్రభుత్వం జగనన్న తోడు ద్వారా రుణ సదుపాయం కల్పించాలని తదితర పలు తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు యం. బాబురావు, టీ ప్రభుదాస్‌, తూర్పు సిటీ సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎస్‌ కోట బాబు పాల్గొన్నారు.