Mar 25,2022 07:00

ఇంతవరకూ విద్యార్ధి ఉద్యమ నేతగా, వామపక్ష ఉద్యమకారుడిగా వ్యవహరించిన బోరిక్‌ దేశంలోని పేద ప్రజల ఆర్ధిక అవసరాలను తీర్చడం ఎంత ప్రాధాన్యతగల అంశమో తెలియనివాడు కాదు. ఇంతకాలమూ అమలు జరిగిన నయా ఉదారవాద విధానాల పర్యవసానంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితులను అధిగమించాలంటే ముందు పేద ప్రజలకు ఊరట కల్పించడం అత్యంత ప్రాధాన్యతా అంశం అని గమనించాలి. ''నయా ఉదారవాద విధానాల అమలుకు పుట్టినిల్లు చిలీ. అందుచేత ఇక్కడే ఆ విధానాలకు సమాధి కూడా కడదాం. ఈ కృషిలో ముందుండే యువశక్తి ఏం చేయబోతోందో అని అనవసరంగా భయాందోళనలకు లోను కావద్దు'' అని బోరిక్‌ అన్నాడు.

     మార్చి 11న గేబ్రియల్‌ బోరిక్‌ చిలీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశాడు. చిలీ చరిత్రలో ఈ సందర్భం ఒక నూతన అధ్యాయానికి తెర తీసింది. చిలీలో అధ్యక్ష పదవికి కనీస వయస్సు 35 సం. ఉండాలి. సరిగ్గా అంతే వయస్సు ఉన్న బోరిక్‌ చిలీకి అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడయాడు. చిలీ కమ్యూనిస్ట్‌ పార్టీ తో సహా పలు పార్టీల, ఉద్యమాల కూటమిగా ఏర్పడిన 'అప్రెబో డిగ్నిడాడ్‌ ' తన నేతగా బోరిక్‌ను ఎన్నుకుంది. ఆ కూటమిలో ఒక భాగస్వామిగా ఉన్న' ఫ్రెంటె ఆంప్లియో' ( విశాల వేదిక) పార్టీలో బోరిక్‌ సభ్యుడు. 51 సంవత్సరాల క్రితం కమ్యూనిస్టులతో కలిసి కూటమి ఏర్పాటు చేసి దేశాధ్యక్షుడిగా సాల్వడార్‌ అలెండీ విజయం సాధించాడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే విధంగా బోరిక్‌ దేశాధ్యక్షుడయాడు.
    దేశాన్ని మొత్తంగా మార్చివేసే విధానాలను అమలు చేయడం కోసం పని చేసే కొత్త ప్రభుత్వపు మంత్రి వర్గంలో దేశంలోని వివిధ తరగతులన్నింటినుండీ ప్రాతినిధ్యం ఉండేలా రూపొందించారు. బోరిక్‌ మంత్రివర్గంలో కమ్యూనిస్టులు, సోషలిస్టులు ఉన్నారు. 25 మంది సభ్యులున్న మంత్రివర్గంలో 14 మంది మహిళలు. మంత్రివర్గం సగటు వయస్సు 42 సంవత్సరాలు. మగవారు, నడివయస్కులు ఎక్కువగా ఉండే మంత్రివర్గం స్థానే యువత, మహిళలు ప్రధానంగా ఉండేవిధంగా కొత్త కూర్పు ఉంది.
    33 సంవత్సరాల యువతి కామిలా వాల్లెజో కమ్యూనిస్టు మంత్రి. ఆమె ప్రభుత్వ అధికార ప్రతినిధిగా వ్యవహరించనున్నారు. 35 ఏళ్ళ జియార్జియో జాక్సన్‌ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి. వీరంతా బోరిక్‌ కు విద్యార్ధి ఉద్యమంలో సహచరులు. దేశంలో వ్యాపారమయమైన విద్యావిధానానికి వ్యతిరేకంగా వీరంతా కలిసి ఉద్యమం నిర్వహించారు. 36 ఏళ్ళ యువతి ఇజ్కియా సిచెస్‌ దేశ హోం శాఖామంత్రి. గతంలో క్లీనర్‌ గా పని చేసి కార్మికోద్యమాన్ని నిర్మించిన 48 ఏళ్ళ లజ్‌ విడాల్‌ కొత్త మహిళా సంక్షేమ మంత్రి. 1973లో మిలిటరీ కుట్ర ద్వారా అధికారాన్ని కోల్పోయిన అలెండీకి మనుమరాలు మయా ఫెర్నాండెజ్‌ (50 ఏళ్ళు) చిలీ కొత్త రక్షణమంత్రి.
    పదవీస్వీకారం సందర్భంగా అధ్యక్ష భవనం బాల్కనీ నుండి ప్రసంగిస్తూ బోరిక్‌ ఆనాడు అలెండీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి సామ్రాజ్యవాదుల అండతో పినోచెట్‌ మిలిటరీ కూటమి చేసిన కుట్రను ప్రస్తావించారు. అప్పటినుండి దేశంలో సైనిక నియంతృత్వ పాలనలో సాగిన హింసను, అణచివేతను గుర్తు చేశారు. గతంలో జరిగిన ఆ దుర్మార్గాలను మళ్ళీ సాగనివ్వబోమని స్పష్టం చేశారు.
    చిలీలో మానవ హక్కుల ఉల్లంఘనను సాగనివ్వం అని బోరిక్‌ హామీ ఇచ్చారు. నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలపై గత మిలిటరీ ప్రభుత్వాలు సాగించిన దమన కాండ వంటివి అనుమతించబడవని ప్రకటించారు. ఇప్పుడు అమలౌతున్న లోపభూయిష్టమైన పెన్షన్‌ విధానాన్ని, వైద్య వ్యవస్థను, విద్యార్ధులపై పెరిగిన రుణ భారాన్ని, లింగ వివక్షతను విమర్శించారు. వాటిని సరి చేస్తామన్నారు. స్థానిక మూల వాసులను వారి భూములనుండి వెళ్ళగొట్టే విధానాలను నిలుపు చేయనున్నట్టు ప్రకటించారు. భిన్న జాతుల, తెగల సమాహారంగా ఉన్న చిలీ దేశపు సాంస్కృతిక వైవిధ్యాన్ని రక్షిస్తామని, కళాకారుల హక్కులను కాపాడతామని ప్రకటించారు. అలెండీ కాలంలో చేపట్టిన విధానాలను గుర్తు చేస్తూ ఆ నాటి ఉత్తేజపూరిత అనుభవాలనుండి ప్రేరణ పొందుతూ ముందుకు సాగుతామని ప్రకటించారు.
    బోరిక్‌ మంత్రి వర్గం ప్రమాణ స్వీకార కార్మక్రమం కూడా నూతన సాంప్రదాయాన్ని నెలకొల్పింది. దేశంలోని అన్ని స్థానిక, మూలవాసుల సమూహాల ప్రతినిధులు ఈ కార్మక్రమంలో పాల్గొన్నారు. ఇంతకాలమూ అభివృద్ధికి నోచుకోకుండా ఒక మూలకు నెట్టివేయబడ్డ ఈ సమూహాలనన్నింటినీ అభివృద్ధి పథంలో కలుపుకుపోతామని కొత్త ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అవసరమైన సామాజిక మార్పులు జరిగేవిధంగా కొత్త విధానాలు ఉంటాయని తెలిపింది.
    సాధారణ దుస్తులను ధరించి బోరిక్‌ ప్రమాణస్వీకారం చేశాడు. సాంప్రదాయ పద్ధతి ప్రకారం ''ఒట్టు పెట్టే'' బదులు ''ప్రజలందరికీ వారి సమక్షంలో హామీ'' ఇచ్చాడు. తద్వారా ఏ అతీత శక్తుల కన్నా ప్రజలే తన ప్రభుత్వం దృష్టిలో అధికులని స్పష్టం చేశాడు. అధికారికంగా కేటాయించిన గృహాన్ని తిరస్కరించి ''స్వేచ్ఛ'' కు, ''ఆశ'' కు మధ్య ఏర్పడిన ''అనాధల'' వీధిలోనే తన నివాసాన్ని కొనసాగిస్తున్నాడు.
    ఎన్నికల హామీలను నెరవేర్చడం బోరిక్‌ కు కత్తిమీద సాము వంటిది. అంత తేలికేమీ కాదు. ప్రపంచం లోనే అత్యధిక స్థాయిలో అసమానతలు ఉన్న దేశాలలో చిలీ ఒకటి. కేవలం ఒక్క శాతం వ్యక్తుల వద్ద దేశ సంపదలో 25 శాతం పోగుబడివుంది. దానికి తోడు దేశంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంది. ఆర్ధిక సంక్షోభం ఉంది. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, పెట్టుబడిదారీ వర్గాల కూటమికి పార్లమెంటులో ఇంకా గణనీయమైన బలం ఉంది. రాజ్యాంగయంత్రం మీద గట్టి పట్టే ఉంది. ఈ ఆటంకాలను అధిగమించి బోరిక్‌ ముందుకు సాగవలసివుంటుంది.
     ఇంతవరకూ విద్యార్ధి ఉద్యమ నేతగా, వామపక్ష ఉద్యమకారుడిగా వ్యవహరించిన బోరిక్‌ దేశంలోని పేద ప్రజల ఆర్ధిక అవసరాలను తీర్చడం ఎంత ప్రాధాన్యతగల అంశమో తెలియనివాడు కాదు. ఇంతకాలమూ అమలు జరిగిన నయా ఉదారవాద విధానాల పర్యవసానంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితులను అధిగమించాలంటే ముందు పేద ప్రజలకు ఊరట కల్పించడం అత్యంత ప్రాధాన్యతా అంశం అని గమనించాలి.
    ''నయా ఉదారవాద విధానాల అమలుకు పుట్టినిల్లు చిలీ. అందుచేత ఇక్కడే ఆ విధానాలకు సమాధి కూడా కడదాం. ఈ కృషిలో ముందుండే యువశక్తి ఏం చేయబోతోందో అని అనవసరంగా భయాందోళనలకు లోను కావద్దు'' అని బోరిక్‌ అన్నాడు.
    బ్రిటిష్‌ లేబర్‌ పార్టీ నాయకుడు జెరెమీ కోర్బిన్‌ బోరిక్‌ పదవీ స్వీకార కార్యక్రమానికి హాజరయాడు. ఆ సందర్భంగా '' ఇప్పుడు బోరిక్‌కి చాలామంది సలహాలు ఇచ్చేవాళ్ళు తయారౌతారు. వారిలో అనేకులు అతను తన లక్ష్య సాధనలో విజయం సాధించకూడదని కోరుకునేవాళ్ళు కూడా ఉంటారు. ఈ సమాజం మెరుగుపడి సామాజిక న్యాయం, ప్రజారోగ్యం, సార్వత్రిక విద్య వంటివి అభివృద్ధి చెందాలన్న బోరిక్‌ ఎన్నికల హామీలు నెరవేరకూడదని వారు కోరుకుంటారు. అటువంటివారి బారి నుండి బోరిక్‌ చాలా అప్రమత్తంగా ఉండాలి.'' అన్నాడు.
    ఐతే బోరిక్‌ కు తోడ్పడే కొన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. ప్రజామోదంతో ఎన్నికైన రాజ్యాంగ చట్టసభ రిఫరెండం ద్వారా ఏర్పడింది. ఈ రాజ్యాంగ అసెంబ్లీ చేసే నిర్ణయాలను పూర్తిగా అమలు చేస్తానని బోరిక్‌ ఇదివరకే ప్రకటించివున్నాడు. ఆ రాజ్యాంగ సభ రూపొందించే ముసాయిదా రాజ్యాంగం 2022 లోనే ప్రజామోదం పొందడానికి వీలుగా రిఫరెండం నిర్వహిస్తామని ప్రకటించాడు. చిలీ ఒక బహుళ సంస్కృతి తో కూడిన దేశం అని రాజ్యాంగసభ ఇప్పటికే తీర్మానించింది. ఇంతవరకూ అమలులో ఉన్న రాజ్యాంగం స్థానిక తెగల, మూలవాసుల సమూహాల హక్కులను గాని, వారి ప్రత్యేకతలను గాని గురించడానికి నిరాకరించింది. స్థానిక తెగల స్వయం నిర్ణయాధికారాన్ని ప్రస్తుత రాజ్యాంగం నిరాకరించింది. ఇప్పుడు రాజ్యాంగసభ చేసిన తీర్మానం స్థానిక తెగలు చాలా కాలం నుండీ కోరుతున్న స్వయంనిర్ణయాధికార హక్కును గుర్తించినందున బోరిక్‌ వారి డిమాండ్‌ ను నెరవేర్చగలిగే అవకాశం బాగా ఉంది.
     చిలీలో మహిళీ ఉద్యమాలు చాలా కాలం నుండీ సంతానోత్పత్తి విషయంలో, అబార్షన్‌ విషయంలో, తమ ఆమోదంతో మాత్రమే లైంగిక సంపర్కం ఉండాలన్న విషయంలోఉద్యమాలు నిర్వహించారు. ఈ అంశాలన్నింటినీ కొత్త రాజ్యాంగ సభ పరిగణనలోకి తీసుకుంది. మహిళల డిమాండ్లను హక్కులు గా గుర్తిస్తూ రాజ్యాంగంలో పొందుపర్చాలని తీర్మానించింది. బిడ్డల్ని కనే విషయంలో గాని, కనకూడదనే విషయంలో కాని మహిళలకు హక్కులు ఉన్నాయని గుర్తించింది. గత 200 సంవత్సరాలుగా సాగుతున్న వివక్షతను ఇప్పుడు అధిగమించ గలుగుతున్నామంటూ మహిళా ఉద్యమ నాయకులు హర్షామోదాలు తెలియజేస్తున్నారు.
    నయాఉదారవాద విధానాల హానికర పర్యవసానాల నుండి సామాన్యులకు రక్షణ కావాలన్నది చిలీ లోని ప్రజలందరి డిమాండ్‌ గా ఉంది. చిలీ లోని అసమానతలను తగ్గించడం బోరిక్‌ ముందున్న మరో పెద్ద సవాలు.
     బోరిక్‌ విజయం కన్నా ముందు పెరూ లో పెడ్రో కాస్టిల్లో, హోండూరాస లో క్సిమారా కాస్ట్రో, ఎన్నికల్లో విజయాలు సాధించారు. వీరిద్దరూ వామపక్ష శక్తుల ప్రతినిధులే. 2022 మే నెలలో కొలంబియాలో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ వామపక్ష శక్తులు అమెరికా-అనుకూల శక్తులను ఓడించడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నాయి. ఇక అక్టోబర్‌ లో బ్రెజిల్‌ లో అధ్యక్ష ఎన్నికలలో లూలా డిసిల్వా గెలిచే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఇప్పటికే వామపక్ష శక్తులు అధికారంలో ఉన్న అర్జెంటినా, బొలివియా, వెనిజులా, నికరాగ్వా, క్యూబా దేశాలతోబాటు బోరిక్‌ కలిసి ''లాటిన్‌ అమెరికా స్వతంత్రంగా, ఎవరికీ లొంగకుండా, లాటిన్‌ అమెరికన్‌ ప్రజలందరి మధ్య పరస్పర సహకారం, స్నేహభావం పెంపొందేలా '' కృషి చేస్తామని ప్రకటించాడు.
బోరిక్‌ చేసిన వాగ్దానాలను నెరవేర్చే తరుణం నేడు వచ్చింది. ఇక ఆచరణే తరువాయి.
 

(స్వేచ్ఛానుసరణ)
ఆర్‌.అరుణ్‌ కుమార్‌

ఆర్‌.అరుణ్‌ కుమార్‌