Feb 24,2023 22:02

మృతిచెందిన చంద్రకిరణ్‌, తరుణ్‌

        ప్రజాశక్తి-హిందూపురం   పట్టణ సమీపంలో ఉన్న శ్రీకంఠపురం చెరువులో పడి ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన శుక్రవారం హిందూపురం రూరల్‌ మండలం పూలకుంట వద్ద చోటు చేసుకుంది. స్థానికులు అందించిన వివరాల మేరకు.. పూలకుంటకు చెందిన ఐటిఐ విద్యార్థి చంద్రకిరణ్‌ (17), బేల్దారి పని చేసే తరుణ్‌ (16) గురువారం ఉదయం గ్రామ సమీపంలో ఉన్న చెరువు వద్దకు బహిర్భూమికి వెళ్లారు. ఉదయం ఇంటి నుండి వెళ్లిన యువకులు రాత్రి అయిన రాకపోవడంతో యువకుల తల్లిదండ్రులు ఆందోళనకు గురై గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం గ్రామస్తులు, యువకుల తల్లిదండ్రులు సమీప ప్రాంతాల్లో తిరుగుతూ చెరువు దగ్గర గాలించారు. అక్కడ ఓ యువకుడి చెప్పు కనిపించడంతో నీటిలో పడ్డారేమో అని అనుమానం వచ్చి నీటిలో గాలించారు. తర్వాత పోలీసులు, ఫైర్‌ సిబ్బందికి సమాచార అందించారు. వారు వెంటనే వచ్చి ఇద్దరి యువకుల మృతదేహాలను వెలికితీశారు. ఒకరిని కాపాడబోయి మరొకరు నీటిలో మునిగి మృతిచెంది ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం జిల్లా అసుపత్రికి తరలించారు. కాగా ఇద్దరు మృతిచెందడంతో యువకులు తల్లిదండ్రులతోపాటు గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది.