Jul 24,2021 15:26

విశ్వంలో ఎన్నో అద్భుతాలు జరగుతూ ఉన్నాయి. ఆ అద్భుతాలను ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు పసిగట్టి తెలియజేస్తూ ఉంటారు. అలాంటి అద్భుతాలను కొన్నింటిని కళ్లారా చూడవచ్చు. కాగా, ఈ రోజు, రేపు (జులై 24, 25)న కూడా ఖగోళంలో మరో అద్భుతం జరగనుంది. చంద్రుడు ఈ రోజు శనిగ్రహానికి అత్యంత, 25న గురుగ్రహానికి దగ్గరగా వెళ్లనున్నాడు. అంతేకాదు.. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే రేఖలోకి వస్తాయని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. జులై 24న చంద్రుడు నాలుగు డిగ్రీల పాటు పక్కకు జరుగుతాడు. దాంతో శని గ్రహానికి చంద్రుడు దగ్గరగా ఉంటాడు. ఈరోజు రాత్రి చంద్రుడు, శని గ్రహం రెండు కూడా పక్కపక్కనే కనిపిస్తాయి. మరో నాలుగు డిగ్రీల పాటు జరిగి 25న గురుగ్రహానికి దగ్గరవుతాడు. ఈ రెండు గ్రహాలు కూడా సోమవారం తెల్లవారకముందు సమయంలో పక్కపక్కనే కనిపిస్తాయి. వీటిని నేరుగా లేదా బైనాక్యులర్స్‌ సాయంతో చూడవచ్చు.

బక్‌ మూన్‌ అంటే..?
చంద్రుడు నాలుగు డిగ్రీలు కాస్త పక్కకి ఉండడం వల్ల సూర్యుడి కాంతి పూర్తిగా చంద్రుడి మీదే పడుతుంది. ఈ సమయంలో చంద్రుడు చాలా కాంతివంతంగా కనిపిస్తాడు. ఇలాంటి చంద్రుడిని బక్‌ మూన్‌ లేదా థండర్‌ మూన్‌ అని పిలుస్తారు. జూలైలో పౌర్ణమి రోజు వచ్చే కాంతివంతమైన చంద్రుడిని బక్‌ మూన్‌ అని పిలవవచ్చు. మగ జింకల కొమ్ములు ఈ సమయంలో బాగా పెరుగుతాయని చెబుతుంటారు. ఈ పేరును అల్గాన్‌ క్విన్‌ తెగ వారు పెట్టారు. మగ బక్‌ డీర్స్‌ తమ కొమ్ములను జూలై సమయంలోనే పెంచుతాయి. పాతవి విరిగిపోయి ఈ సమయంలో కొత్తవి వస్తుంటాయట. అంతేకాదు.. ఈ సమయంలో ఎక్కువ ఉరుములు, పిడుగులు కూడా పడుతుంటాయి కాబట్టి దీనిని థండర్‌ మూన్‌ అని కూడా పిలుస్తారు. ఈ చందమామ రంగు కూడా తెల్లగా కాకుండా కాస్త ఎరుపు, నారింజ రంగుల కలయికలో ఉంటుంది.