పుట్టపర్తి అర్బన్ : జిల్లాలో వివిధ జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియపై నిర్లక్ష్యం చేయకుండా వేగంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ టిఎస్.చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు పుట్టపర్తి కలెక్టరేట్‌లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే, వివిధ జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వెళ్లే గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకి సంబంధించి భూసేకరణ ప్రక్రియ పూర్తిగా చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా ఇంకా 127 హెక్టార్లకు సంబంధించి భూములు సేకరించిన రైతుల బ్యాంక్ అకౌంట్ల వివరాలు, ఆధార్ కార్డుల వివరాలను త్వరగా అందజేయాలన్నారు. బ్యాంక్ అకౌంట్ల వివరాలు, ఆధార్ కార్డుల వివరాలు అందిస్తే రైతులకు వేగవంతంగా పరిహారం అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో వివిధ జాతీయ రహదారులకు సంబంధించి ఎలాంటి పెండింగ్ లేకుండా భూసేకరణ చేపట్టాలని ఆదేశించారు. సకాలంలో భూసేకరణ పూర్తి చేసి రహదారుల నిర్మాణం వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తిక్, పుట్టపర్తి, కదిరి ఆర్డీవోలు భాగ్యరేఖ, రాఘవేంద్ర, కలెక్టరేట్ జి సెక్షన్ సూపరింటెండెంట్ బాలాజీ, ఆయా మండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు.










