Apr 04,2023 21:09

సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారీయా

రాయచోటి : మదనపల్లి- పీలేరు జాతీయ రహదారి -71 కు సంబంధించి త్వరితగతిన భూపరిహారం పంపిణీ చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారీయ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్‌లో మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో మదనపల్లి నుంచి పీలేరు వరకు చేపట్టిన జాతీయ రహదారి-71 కు సంబంధించి భూ పరిహార పంపిణీ అంశంపై జాతీయ రహదారి అధికారులు, సంబంధిత తహశీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ మదనపల్లి నుంచి పీలేరు వరకు చేపట్టిన జాతీయ రహదారికి అవసరమైన 455 ఎకరాలను 2018-19 లో సేకరించామని చెప్పారు. ప్రస్తుతం భూ పరిహార పంపిణీ చేస్తున్నారని, ఇందులో భాగంగా ఇప్పటికే 82 శాతం పరిహారం చెల్లించామని పేర్కొన్నారు. రహదారికి సంబంధించి అవసరమై ఈ సంవత్సరం అదనంగా మరో 104 ఎకరాలు సేకరించగా అందులో కూడా 35శాతం పరిహారం చెల్లించారని తెలిపారు. ఈ రెండు అంశాలలో మిగిలిన పరిహారాన్ని కూడా వేగవంతంగా చెల్లించేందుకు అధికారులు కషి చేయాలన్నారు. పరిహారం చెల్లింపుకు సంబంధించి తహశీల్దార్ల వద్ద ఫైల్స్‌ పెండింగ్‌ లేకుండా ఎప్పటికప్పుడూ కలెక్టరేట్‌కు పంపించాలని సూచించారు. ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఉన్న వాస్తవ అంశాలపై పూర్తిగా సమాచారాన్ని క్రోడీకరించి ఫైల్స్‌ పంపాల్సి ఉందని తెలిపారు. కోర్టు కేసులకు సంబంధించి తగు చర్యలు తీసుకోవాలన్నారు సమావేశంలో జాతీయ రహదారుల అథారిటీ సైట్‌ ఇంజినీర్‌ వెంకటరమణ, సంబంధిత తాసిల్దార్లు, జాతీయ రహదారుల అధికారులు పాల్గొన్నారు.