ప్రజాశక్తి - రాయచోటి టౌన్: అన్నమయ్య జిల్లా ఏర్పడిప్పటి నుండి భూకబ్జాలు ఎక్కువయ్యాయని సమగ్ర విచారణ చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో రాయచోటి, మదనపల్లి, రాజంపేట, ఓబులవారిపల్లి, కోడూరు, పీలేరు, కలికిరి, పెద్దమండ్యం, గుర్రంకొండ తదితర మండలాలతో పాటు జిల్లా వ్యాప్తంగా దొంగ పట్టాలతో భూములు కాజేస్తున్నారనే ప్రచారం జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వ భూములు, దళితులకు పంచిన భూములను కూడా వదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఇంటి స్థలాలు, వ్యవసాయ భూములు ఆక్రమించుకోవడం, ఎదురు తిరిగిన వారిపై దాడులు చేయడం పరిపాటిగా మారిందని వాపోయారు. పేదలకు, భూ బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు, రెవెన్యూ అధికారులు న్యాయం చేయక పోగా, వారిపైనే కేసులు పెట్టడం, ఆఫీసుల చుట్టూ తిప్పుకోవడం తప్ప న్యాయం చేయలేదని వాపోయారు. చాలా చోట్ల పేదల ఆనుభవంలో ఉన్న భూములను రాజకీయ, ఆర్థిక అండదండలు ఉన్నవారికి అధికారులే కట్టబెడుతున్నారని అన్నారు. రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మక్కై భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. జిల్లాలో భూ ఆక్రమణల నిగ్గు తేల్చాలని అందుకోసం జాయింట్ కలెక్టర్ నాయకత్వంలో కమిటీ వేసి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. భూ కబ్జాలకు, ఆక్రమణలకు పాల్పడుతున్న వారిని శిక్షించాలని లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమం ఉధతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎ.రామాంజులు, నాయకులు డి.సి.వెంకటయ్య, ఎస్.రామచంద్ర, ఓబులేసు పాల్గొన్నారు.










