Mar 15,2022 06:41

కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేకసార్లు పరిశ్రమల అధికారులపై కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఒత్తిడి చేసి అదనంగా భూములు ఉన్నట్లు తప్పుడు రిపోర్టులు సేకరించారు. ఆ నివేదికల ఆధారంగా ఇప్పుడు భూములన్నీ లాక్కోబోతున్నారు. దానికి ఆగమేఘాల మీద భూముల కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. భూములు లాక్కోవడం పరిశ్రమల అభివృద్ధికి తీవ్ర ఆటంకం. ఇది దేశద్రోహం. ప్రభుత్వ భూములు ప్రైవేట్‌ వ్యక్తుల చేతికి వెళ్తే మరలా తిరిగిరావు. అభివృద్ధి కార్యక్రమాలేవీ సాధ్యం కావు. ప్రమాదాలు జరిగితే తల దాచుకోవడానికి కూడా స్థలాలు లేకుండా పోతాయి.

కేంద్ర ప్రభుత్వం 2022 మార్చి 10న కేంద్ర ప్రభుత్వ భూముల అమ్మకానికి ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. గతంలో ''భూ బ్యాంకు'' పేరుతో దేశంలోని ప్రభుత్వరంగ పరిశ్రమల నుంచి భూములు లాక్కోవడానికి ప్రయత్నించింది. ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో ఆగిపోయింది. ఇప్పటికే మూసివేయబడిన కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల్లోని భూములు మరియు నూరు శాతం అమ్మాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలు ఈ పరిధి లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దేశంలోని అన్ని పరిశ్రమలను అమ్ముతామని లేదా మూసివేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలోని అసలు రహస్యం...ఈ పరిశ్రమల భూములన్నీ తమ ఇష్టం వచ్చిన విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టడమే. 1996లో మూసివేయబడిన హైదరాబాద్‌ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐడిపిఎల్‌ లాంటి అనేక పరిశ్రమల్లో భూములను వెంటనే స్వాధీనం చేసుకోవచ్చు. హైదరాబాద్‌ నడిబొడ్డున ఐడిపిఎల్‌ లో ప్రభుత్వ లెక్కల ప్రకారం 891 ఎకరాల భూమి ఈ భూ బకాసురుడి చేతిలోకి వెళ్ళిపోతుంది. నడుస్తున్న పరిశ్రమల్లో అమ్మకానికి పెట్టిన పరిశ్రమల భూములను కూడా ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవచ్చు. ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఉపయోగించని భూములను లేదా పూర్తిగా ఉపయోగించని భూములను తీసుకుంటామని తెలిపారు. వాస్తవానికి విలువైన భూములన్నీ కేంద్ర ప్రభుత్వం లాక్కోబోతున్నది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత సామాన్య రైతుల నుంచి భూములను పెద్దఎత్తున స్వాధీనం చేసుకొని కేంద్ర ప్రభుత్వాలు పరిశ్రమలను అభివృద్ధి చేశాయి. మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క ప్రభుత్వరంగ పరిశ్రమను కూడా నెలకొల్పలేదు. కాని నేడు గతం నుంచి అభివృద్ధి చేసిన పరిశ్రమల భూములన్నింటిని స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టబోతున్నారు.
    భూముల విలువ బాగా పెరిగింది. భూమి అంటే బంగారం అయ్యింది. ఒకప్పుడు పట్టణాలకు చివరగా ఉన్న పరిశ్రమలు, పట్టణాలు అభివృద్ధి చెందడంతో నేడు పట్టణం నడిబొడ్డు లోకి వచ్చాయి. పరిశ్రమ నడపడం కంటే పరిశ్రమల స్థలాలు అమ్ముకుంటే లాభాలు వస్తాయని ప్రైవేట్‌ యజమానులు ఇప్పటికే అనేక నగరాల్లో స్థలాలన్నింటిని అమ్ముకున్నారు. ముంబయి లోని టెక్స్‌టైల్‌ పరిశ్రమలన్నీ 30 ఏళ్ళ క్రితమే రియల్‌ ఎస్టేట్‌గా మారిపోయాయి. గుంటూరు లోని భజరంగ్‌ జ్యూట్‌ మిల్లును ప్రైవేట్‌కి అమ్మేశారు. ఇప్పుడు ప్రభుత్వాల కళ్లన్నీ ఈ భూములు అమ్ముకోవడం మీద పడ్డాయి. ఒకవైపు స్వాతంత్య్రం వచ్చాక అభివృద్ధి చేసిన భారీ పరిశ్రమలన్నిటినీ నేడు ప్రైవేట్‌కు అమ్మడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. మరో వైపున ఈ పరిశ్రమల్లోని భూములను లాక్కోవడానికి కొత్తగా ఈ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. పరిశ్రమలు అభివృద్ధి చేస్తే ఉపాధి పెరుగుతుంది. పరిశ్రమల చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయి. కాని ప్రభుత్వం ఉపాధి పెంచడానికి ప్రాధాన్యత ఇవ్వకుండా కార్పొరేట్ల ప్రయోజనాల కోసం పరిశ్రమల భూములను లాక్కొని పరిశ్రమల అభివృద్ధిని ఆటంక పరుస్తున్నది. ఇది దేశ ప్రయోజనాలను కార్పొరేట్లకు తాకట్టు పెట్టడమే. భవిష్యత్‌లో దీని ప్రభావం దేశాభివృద్ధిపై తీవ్రంగా వుంటుంది. ఉపాధి తీవ్రంగా దెబ్బ తింటుంది. విశాఖ లోని కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమ అయిన హిందూస్థాన్‌ జింక్‌ను...కాంగ్రెస్‌, బిజెపి ప్రభుత్వాలు ...వేదాంత ప్రైవేట్‌ కంపెనీకి అమ్మేశాయి. ఈ పరిశ్రమ లాభాల్లో ఉన్నప్పటికీ యాజమాన్యం కంపెనీని మూసివేసి 370 ఎకరాల భూమిని రియల్‌ ఎస్టేట్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నది. రైతులు పరిశ్రమ కోసం భూములిచ్చారు తప్ప రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడానికి కాదు. పరిశ్రమ నడపకపోతే ఆ భూములను తిరిగి రైతులకే ఇవ్వాలి. హిందూస్థాన్‌ జింక్‌ విషయంలో ఈ వివాదం సుప్రీం కోర్టులో నేటికీ నడుస్తున్నది. తీర్పు రాకుండానే దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో భూములను లాక్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది.
    వాస్తవానికి ఏ కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమ లోను భూములు అదనంగా లేవు. ప్రతి పరిశ్రమను నిరంతరం అభివృద్ధి చేయడానికి కావాల్సిన భూములను ముందుగానే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కోసం 22 వేల ఎకరాల భూములను ప్రభుత్వం 1970 లోనే స్వాధీనం చేసుకున్నది. ఇప్పటికి 15 వేల ఎకరాలు పరిశ్రమ మరియు టౌన్‌షిప్‌ కోసం ఉపయోగిస్తున్నది. మిగిలిన 7 వేల ఎకరాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం 70 లక్షల మొక్కలను పెంచింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నేడు 7.3 మిలియన్‌ టన్నుల సామర్ధ్యంతో నడుస్తుంది. దీనిని 20 మిలియన్‌ టన్నుల సామర్ధ్యానికి పెంచాలి. నిధులు లేక విస్తరణ జరగడంలేదు. ఈ మిగులు భూములను స్టీల్‌ప్లాంట్‌ విస్తరణకు ఉపయోగించాలి. లేదా ఆ భూములను తిరిగి నిర్వాసిత రైతులకు ఇవ్వాలి. కాని కేంద్ర ప్రభుత్వం 7 వేల ఎకరాల భూములను అదనంగా ఉన్నట్లుగా అధికారులపై ఒత్తిడి చేసి రిపోర్టులు తయారు చేయించింది. విశాఖ పోర్టులో 1,269 ఎకరాల ఖాళీ భూములు ఉన్నట్లు నిర్ణయించారు. దేశంలోని అన్ని పోర్టులలో కలిపి 14,604 ఎకరాల భూములు ఖాళీగా ఉన్నట్లు తేల్చారు. దేశంలోని ఇతర ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నిట్లోను టౌన్‌షిప్‌లను కూల్చి ఆ భూములను కూడా అదనంగా ఉన్న భూములుగా చూపిస్తున్నారు.
    మన దేశంలోని భారీ పరిశ్రమల్లో రైల్వే, రక్షణ రంగాల చేతిలో అత్యధిక భూములున్నాయి. రక్షణ రంగంలోనే 62 కంటోన్‌మెంట్లతో సహా 17.95 లక్షల ఎకరాలు మరియు 16.35 ఎకరాల రక్షణ ఎస్టేట్ల భూములున్నాయి. రైల్వేలకు చెందిన 11.80 లక్షల ఎకరాలలో 1.25 లక్షల ఎకరాలు మిగులుగా ఉన్నట్లుగా ప్రభుత్వ లెక్కల్లో తేల్చారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేకసార్లు పరిశ్రమల అధికారులపై కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఒత్తిడి చేసి అదనంగా భూములు ఉన్నట్లు తప్పుడు రిపోర్టులు సేకరించారు. ఆ నివేదికల ఆధారంగా ఇప్పుడు భూములన్నీ లాక్కోబోతున్నారు. దానికి ఆగమేఘాల మీద భూముల కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. భూములు లాక్కోవడం పరిశ్రమల అభివృద్ధికి తీవ్ర ఆటంకం. ఇది దేశద్రోహం. ప్రభుత్వ భూములు ప్రైవేట్‌ వ్యక్తుల చేతికి వెళ్తే మరలా తిరిగిరావు. అభివృద్ధి కార్యక్రమాలేవీ సాధ్యం కావు. ప్రమాదాలు జరిగితే తల దాచుకోవడానికి కూడా స్థలాలు లేకుండా పోతాయి. కేంద్ర ప్రభుత్వ ఈ దుర్విధానాన్ని ఎదిరించాలి. ''మా పరిశ్రమల భూములు ఎవ్వరికీ ఇవ్వం'' అని ప్రతి పరిశ్రమ లోను ఉద్యమించాలి. మార్చి 28, 29 దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా తమ సత్తా చాటాలి.
 

/ వ్యాసకర్త : సిఐటియు ఎ.పి రాష్ట్ర అధ్యక్షులు /
సిహెచ్‌. నరసింగరావు

Bhoo Bakasura BJP ...