Oct 25,2020 07:21

అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ బొలీవియాలో సోషలిస్టులు 55.1 శాతంతో అద్భుత విజయాన్ని సాధించారు. 2005లో తొలిసారి ఎవో మొరేల్స్‌ సాధించిన విజయం కన్నా పెద్ద విజయమిది. మూలవాసీ తెగల నుంచి దేశ అత్యున్నత పదవిని తొలిసారి అధిష్టించిన మొరేల్స్‌కు ఆనాడు 53.75 శాతం ఓట్లు రాగా, నేడు అధ్యక్షుడిగా ఎన్నికైన లూయిజ్‌ ఆర్సేకు 55.1 శాతం ఓట్లు రావడం విశేషం. బొలీవియా చరిత్రలో అతి పెద్ద విజయాల్లో ఒకటిగా ఇది నిలిచిపోతుంది. చివరిలో ఒక సంవత్సరం మినహా 14 ఏళ్ల పాటు ఏకధాటిగా పాలించిన మాస్‌ ప్రభుత్వ విధానాలకు ప్రజల నుంచి పెద్దయెత్తున ఆమోదం లభించిందనడానికి ఇదొక నిదర్శనం. బొలీవియా నేత ఎవో మొరేల్స్‌ను అమెరికా ప్రేరేపిత కుట్ర ద్వారా కూల్చివేసిన ఏడాదికి ఈ ఎన్నికలు జరిగాయి. మితవాద సెనెటర్‌ జెనీన్‌ అనీజ్‌ ఈ సంవత్సర కాలంలో అధికారం చెలాయించారు. ఆమె ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆర్తురో మురిలో దుర్మార్గాలకు అంతే లేదు. కుట్రకు వ్యతిరేకంగా నిరసన తెలిపినవారిని అణచి వేసేందుకు అనీజ్‌ ప్రభుత్వం దారుణ నిర్బంధ కాండను ప్రయోగించింది. సకాబే, సెంకాతా నగరాల్లో వందలాది మంది ప్రజలను హత్య చేయించింది. మాస్‌ పార్టీ, అలాగే దాని వామపక్షాలకు చెందిన నాయకులను, కార్యకర్తలను తప్పుడు కేసులు పెట్టి వేధించింది. ఎన్నికల రోజున కూడా ఈ దారుణ నిర్బంధ కాండ కొనసాగింది. మాస్‌ పార్టీకి లభించిన ఈ విజయం కుట్రదారులతో కూడిన జాతి దురహంకార ప్రభుత్వాన్ని ప్రజలు ఎంతగా చీదరించుకున్నారో విదితం చేస్తోంది. మాస్‌ను అణగదొక్కాలని అనీజ్‌ ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించిందో అంతకు రెట్టించిన బలంతో ఆ పార్టీ ఉవ్వెత్తున ఎగసిపడింది. బొలీవియా ప్రజల్లో పార్టీ పునాది ఏమాత్రం చెక్కు చెదరలేదని ఇది నిరూపించింది. ప్రజాస్వామ్య పరిరక్షణకు మాస్‌ పార్టీ గత సంవత్సర కాలంగా రాజీ లేని పోరాటం సాగించింది. ఎన్నికలను వాయిదాల మీద వాయిదాలు వేస్తున్న ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా ఆగస్టులో మాస్‌, దాని మిత్ర పక్షాలు కలసి రోడ్ల దిగ్బంధన ఆందోళనకు పిలుపునివ్వగా, మూలవాసీలు, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఆ ఆందోళనను జయప్రదం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. దీంతో నెలల తరబడి జాప్యం చేసిన ఎన్నికలను అక్టోబరులో నిర్వహించేందుకు అనీజ్‌ అంగీకరించారు. ఈ ఎన్నికల్లో మాస్‌ అఖండ విజయం సాధించి వచ్చే నెలలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ సంక్షోభ కాలంలో మాస్‌ నాయకత్వ మార్పు ఎలా సాధ్యమైందని కొందరు అడగొచ్చు. ఆ సంక్లిష్ట పరిస్థితుల నుంచే వైవిధ్యంతో కూడిన పార్టీ నాయకత్వం పుట్టుకొచ్చింది. ప్రజా ఉద్యమాల్లోంచే నాయకులు పుట్టుకొస్తారని మాస్‌ అనుభవం మరోసారి నిరూపించింది. ఇద్దరు యువ కిశోరాలు ఆండ్రోనికో రొడ్రిగజ్‌, లియోనార్డో లుజావరేలు మొరేల్స్‌ సొంతగడ్డ అయిన కొచబాంబ నుంచి సెనేట్‌కు ఇప్పుడు తొలిసారిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన డేవిడ్‌ కొకెహన్కా గ్రామీణ ప్రాంతంలో పండ్ల తోటల కార్మికులను సంఘటితం చేయడంలో మంచి అనుభవం ఉన్న వ్యక్తి. మాస్‌ పార్టీలో నాయకత్వానికి సంబంధించిన సమస్యే లేదు. ప్రజలతోను, సామాజిక ఉద్యమాలతోను పార్టీ మమేకమై ఉండడం వల్లే ఇది సాధ్యమైంది. ఇప్పుడు ఎవో మొరేల్స్‌ పాత్ర ఎలా ఉండబోతుందని సంశయించినవారూ ఉన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే ఆర్సే ఒక ప్రకటన చేస్తూ, మొరేల్స్‌ కు కొత్త ప్రభుత్వంలో పాత్ర ఉండదు, కానీ, ఆయన అర్జెంటీనా నుంచి బొలీవియాకు రావాల్సిందిగా ఆహ్వానిస్తామని చెప్పారు. సైనిక కుట్ర తరువాత మొరేల్స్‌ అర్జెంటీనాకు గత ఏడాది ప్రవాసం వెళ్లిన సంగతి తెలిసిందే.
మాస్‌ పార్టీ తిరుగులేని ఆధిక్యత సాధించడంతో మితవాద పార్టీలు, ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ స్టేట్స్‌ (ఒఎఎస్‌) వంటి అమెరికా ఏజెంట్లు సైతం ఈ విజయాన్ని అంగీకరించక తప్పలేదు. మొరేల్స్‌ను కూలదోసే కుట్రలో ప్రధాన పాత్రధారుల్లో ఒకరైన ఫెర్నాండో కమాచోను, మాస్‌ వ్యతిరేక గ్రూపులను బొలీవియా ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. గత ఏడాది కాలంగా దాడులు, దౌర్జన్యాలు, హింసతో చెలరేగిన ఈ జాత్యహంకార, మితవాద, పారా మిలిటరీ గ్రూపులు తాత్కాలికంగా స్తబ్దుగా ఉన్నా, అవకాశం చూసుకుని మళ్లీ చెలరేగవచ్చు. కాబట్టి ఈ శక్తుల పట్ల మాస్‌ ప్రభుత్వం ఓ కన్నేసి ఉంచాలి. నూతన ప్రభుత్వం ప్రజానుకూల విధానాలతో ముందుకెళ్లడం ద్వారానే స్వార్థపర శక్తుల కుట్రలను అది సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది. కరోనా మహమ్మారి, ఫాసిస్టు శక్తుల చర్యల వల్ల బొలీవియా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుంది. దీని నుంచి బొలీవియాను మాస్‌ గట్టెక్కిస్తుందన్న నమ్మకంతోనే బొలీవియా ప్రజలు ఈ చారిత్రాత్మక తీర్పు నిచ్చారు. బుల్లెట్లకు బ్యాలెట్‌తో సమాధానమిచ్చారు.

థామస్ బెర్కర్  (వ్యాసకర్త)