- కోడిపందేల నిర్వహణకు స్థలాల చదును
- ఏర్పాట్లలో పందేలరాయుళ్లు బిజీబిజీ
- ఈ ఏడాదైనా కోర్టు ఆదేశాలు అమలయ్యేనా ?
ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి : కోడి పందేలకు వ్యతిరేకంగా కోర్టు ఆదేశాలున్నా, పోలీసులు హెచ్చరికలు చేస్తోన్నా పందేలరాయుళ్లు పట్టించు కోని పరిస్థితి కన్పిస్తోంది. బరులు సిద్ధం చేసే పనిలో పందేల రాయుళ్లు బిజిబిజీగా ఉన్నారు. ఇప్పటికే ఏలూరు, జంగారెడ్డి గూడెం వంటి అనేక ప్రాంతాల్లో బరులను చదును చేసి చుట్టూ స్తంభాలు వేసి సిద్ధం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఒకటి, రెండు రోజుల్లో బరుల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కంటే ఈసారి పెద్ద ఎత్తున కోడి పందేలు జరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. గతేడాది సంక్రాంతి పండగ మూడు రోజులూ జిల్లాలో 400కుపైగా బరుల్లో కోడి పందేలు జరిగాయి. రూ.200 కోట్లకుపైగా డబ్బులు చేతులు మారాయి. బరుల వద్ద గుండాట, మూడు ముక్క లాట, మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. వీటికి ఆకర్షితులై సామాన్య ప్రజానీకం తమ జేబులు ఖాళీ చేసుకున్న పరిస్థితి ఉంది. కోడిపందేలను అడ్డుకుని తీరతామంటూ బీరాలు పలికిన పోలీసులు... ప్రభుత్వ అనధికార ఆదేశాలతో పండగ మూడు రోజులూ ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారని గత ఏడాది తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈసారీ అదే పరిస్థితి కొనసాగేలా కనిపిస్తోంది. కోడి పందేలను అడ్డుకోవాలంటూ ఈ నెల నాలుగో తేదీన డివిజన్, మండల స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామస్థాయిలో జాయింట్ యాక్షన్ కమిటీలు ఏర్పాటు చేశారు. గ్రామసభలు నిర్వహించి అవగాహన కార్యక్రమాల పేరుతో హడావుడి చేస్తున్నారు. గతంలో పందేలు జరిగిన చోట 144 సెక్షన్ విధించాలని తహశీల్దార్లకు ఆదేశాలు వెళ్లాయి. ఇప్పటి వరకూ జిల్లాలో మూడు వేల మందిపైగా బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు, మూడు వేల కోడి కత్తులను సీజ్ చేసినట్లు పోలీసులు చెబుతు న్నారు. కోడి పందేలను అడ్డుకుని తీరాలంటూ జిల్లా కలెక్టర్, ఎస్‌పి సైతం కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసినా బరుల ఏర్పాటు మాత్రం ఆగడం లేదు.
గతకంటే భారీగా ?
గతేడాదికంటే ఈసారి భారీగా కోడి పందేలు జరగనున్నట్లు పందెంరాయుళ్లు చెబుతున్నారు. అందుకోసం అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని అంటున్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే పందెంరాయుళ్ల కోసం హోటల్ రూములు సైతం ముందుగానే బుక్ చేసినట్లు తెలుస్తోంది. బరులు ఎక్కడ ఏర్పాటు చేయాలనే ప్రణాళికలు ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. బరుల వద్ద గుండాట, పేకాట వంటివి నిర్వహించేందుకు ఒప్పందాలు సైతం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్లకు ఎంత మామూళ్లు ఇవ్వాలనేదీ నిర్ణయించినట్లు పందేలరాయుళ్లు చెప్పుకొస్తున్నారు. భోగి పండగ ముందురోజుకల్లా అన్ని ఏర్పాట్లూ జరిగిపోతాయని, పండగ మూడు రోజులూ పందాలు యథావిధిగా జరుగుతాయని పందెంరా యుళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి జిల్లాలో 450కుపైగా బరుల్లో కోడిపందేలు సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీసలి, జంగారెడ్డిగూడెం, పూలపల్లి వంటి చోట్ల భారీ పందేలకు కొందరు రాజకీయ నాయకులు కూడా రానున్నట్లు సమాచారం. పోలీసుల ప్రకటనలు అన్నీ కోర్టులకు చూపుకోవడానికే అనే చర్చ సాగుతోంది. ఈసారైనా కోర్టు ఆదేశాలు అమలయ్యేనా? అనే చర్చ జనాల్లో సాగుతోంది.










