హైదరాబాద్ : టాలీవుడ్ గాయని మంగ్లీ రూపొందించిన బోనాల పాటపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్‌లో ఈ నెల 11న మంగ్లీ బోనాల పాటను విడుదల చేసింది. ఈ పాటలో ఉపయోగించిన కొన్ని పదాలపై హిందూ సంఘాలు, బిజెపి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు కూడా పెట్టారు. తాజాగా ఈ వివాదంపై మంగ్లీ స్పందించారు. తాను ఎలాంటి వివాదాస్పద పదాలను వాడలేదని చెప్పింది. తెలంగాణలో గ్రామ దేవతల ఒగ్గు కథలు, బైండ్లోల కొలువులు.. ఇలా రకరకాల ఆచారాలు ఉన్నాయని, భక్తిలో కూడా వైరి భక్తి, మూఢ భక్తి అని వివిధ రకాలు ఉన్నాయని చెప్పింది. వీటన్నింటి నేపథ్యంలోనే ఈ పాటను రూపొందించామని తెలిపింది. ముఖ్యంగా ఈ పాటలో ఉపయోగించిన 'మోతెవరి' అనే పదంపై విమర్శలు వస్తుండటంతో ఈ లిరిక్స్‌లో మార్పులు చేసి కొత్త పాటను రిలీజ్ చేస్తున్నామని పేర్కొంది. 80 ఏళ్ల వయసున్న రచయిత రామస్వామి 25 ఏళ్ల క్రితం ఈ పాటను రచించారని మంగ్లీ తెలిపింది. మోతెవరి అంటే గ్రామ పెద్ద అని అర్థమని, ఈ అర్థంతోనే పాట సాగుతుందని చెప్పింది. అయితే కాలక్రమంలో ఆ పదం వ్యతిరేకపదంగా వాడుకలోకి వచ్చిందని, యాసను వివాదం చేయడం ద్వారా ఆయనను కించపరిచే ప్రయత్నం చేయవద్దని కోరింది.










