Aug 24,2022 09:00

పాట్నా : బీహార్‌లో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం. బలపరీక్షకు సిద్ధమౌతున్న సమయంలో... సిబిఐ దాడులు చోటుచేసుకున్నాయి. ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన 'ల్యాండ్‌-ఫర్‌-జాబ్‌' కేసుకు సంబంధించిన ఆ పార్టీకి ఇద్దరు నేతల ఇళ్లల్లో బుధవారం ఉదయం సిబిఐ అధికారులు సోదాలు చేపడుతున్నారు. ఆర్‌జెడి రాజ్యసభ ఎంపి అహ్మద్‌ అష్ఫాక్‌ కరీంతో పాటు, బీహార్‌ ఎమ్మెల్సీ సునీల్‌ సింగ్‌ నివాసంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇటీవల బిజెపి కూటమికి ఝలక్‌నిచ్చిన ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ నేతృత్వంలోని జెడియు.. ఆర్‌జెడి, కాంగ్రెస్‌తో జత కట్టి.. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధమౌతోంది. అంతలోనే ఈ దాడులు జరగడం గమనార్హం.
      ఈ దాడులు ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయని, ఒకసారి తనిఖీలు చేశారని, మళ్లీ చేయడంలో అర్థం లేదని, తమ పార్టీ ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురిచేసి.. వారి వైపుకు తిప్పుకోవాలని చూస్తున్నారని సింగ్‌ వ్యాఖ్యానించారు. బీహార్‌లో అధికారాన్ని కోల్పోయి, అక్కసుతో ఉన్న బిజెపి... సిబిఐ, ఇతర కేంద్ర సంస్థలతో దాడులకు సిద్ధమౌతున్నదని ఆర్జేడీ అధికార ప్రతినిధి ఒకరు గత రాత్రి ట్వీట్‌ చేయగా.. మరుసటి రోజే ఈ దాడులు చోటుచేసుకున్నాయి. కాగా, బీహార్‌ అసెంబ్లీ మొత్తం స్థానాలు 242 కాగా, మెజార్టీ మార్కు 121. నితీష్‌ ఫ్రభుత్వానికి 165 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా.. కూటమి విశ్వాస పరీక్ష నెగ్గడం.. నల్లరుపై నడకే.