ప్రజాశక్తి-నెల్లూరు : బ్లాక్ మార్కెట్లో యూరియా అమ్మకాలను అడ్డుకుని జిల్లాలో వరిపంట సాగుబడి చేస్తున్న రైతులకు సరిపడా ఆర్‌బికే కేంద్రాల ద్వారా, సొసైటీల ద్వారా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఏపి రైతు , కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం జిల్లాలో నెలకొన్న యూరియా కొరత నివారణకు చర్యలు తీసుకోవాలని, బ్లాక్ మార్కెట్లో యూరియా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎపి రైతు , కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టాయి. ఈ సందర్భంగా ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పులిగండ్ల శ్రీరాములు, పొట్టేపాళెం చంద్రమౌళి మాట్లాడుతూ జిల్లాలో 6 నుంచి 7 లక్షల ఎకరాల్లో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు వరి సాగు చేస్తున్నారన్నారు. వీరందరికీ యూరియా అవసరముందన్నారు. జిల్లాలోని ఎక్కువ మండలాల్లో వరి సాగుబడి చేస్తున్న రైతులకు యూరియా అందుబాటులో లేదన్నారు. వాస్తవానికి మార్కెట్ ధరకు అధనంగా మరో రూ.70లు కలిపి బ్లాక్ మార్కెట్లో యూరియా బస్తాప్ర్రయివేట్ వ్యక్తులు విక్రయి స్తున్నారన్నారు. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా, సొసైటీల ద్వారా రైతాంగానికి అవసరమైనత మేరకు యూరియా సరఫరా చేస్తామని ప్రకటించిందన్నారు. ఈ క్రాప్ నమోదు చేసుకున్న రైతులకు అందజేస్తామని ప్రభుత్వం చెప్పిందన్నారు. ప్రభుత్వం చేసిన ప్రకటనలు కేవలం కాగితాలకు పరిమితమయ్యాయన్నారు. సమస్యలన్నింటికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతాంగానికి సరపడా యూరియా సరఫరా చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నామన్నారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుళ్లూరు గోపాల్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం.పుల్లయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో రబీ సీజన్ ప్రారంభం అయిన తరువాత జిల్లాలో ఆలస్యంగా రబీ సీజన్ ప్రారంభం అవుతుందన్నారు. అందువల్లనే జిల్లా లో వరి పంట సాగుబడి చేసే రైతాంగానికి యూరియా సరిపడా సరఫరా అయ్యేదని, ఈ ప్రభుత్వ హయాంలో మాత్రం అందుకు విరుద్దంగా యూరియా సరఫరా అవుతుందన్నారు. ఈ పరిస్థితి ఎందుకు ఆసన్నమైందో రైతులకు అర్ధం కావడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి పరిస్థితిని చక్కదిద్దాలన్నారు. తక్షణమే ఆర్‌బికే కేంద్రాల్లో, సొసైటీ సంఘాల్లో యూరియా అమ్మకాలు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలె వెంగయ్య, జిల్లా సహాయ కార్యదర్శులు పి.రమేష్, ఓడూరు వెంకట క్రిష్ణయ్య, జి.బుజ్జయ్య, గురునాధం పలువురు రైతు సంఘాల నాయకులు మాట్లాడారు. రైతులు పాల్గొన్నారు.










