ప్రజలందరికీ తీపిని పంచే చెరకు రైతు దీపావళి పండుగ వేళ పోలీసుల అణిచివేత చర్యలకు గురికావడం రైతుల శ్రేయోభిలాషులమని చెప్పుకునే ప్రభుత్వానికే సిగ్గుచేటు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను సొమ్ము చేసుకున్న మిల్లు యజమానులను బకాయిల కోసం నిలదీస్తే లాఠీలతో బాదేస్తారా? అక్రమ కేసులు బనాయిస్తారా? ఎంతటి దుర్మార్గమిది! విజయనగరం జిల్లా లచ్చయ్యపేట ఎన్‌సిఎస్ చక్కెర మిల్లు పరిధిలోని చెరకు రైతులు రెండేళ్లుగా యాజమాన్యం నుంచి తమకు రావాల్సిన బకాయిల కోసం బుధవారం చేపట్టిన పోరాటం పూర్తిగా న్యాయసమ్మతమైనది.
వాస్తవానికి యాజమాన్యాల నుంచి రైతులకు బకాయిలు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. క్రషింగ్, చక్కెర దిగుబడి, చెల్లింపుల పురోగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన ప్రభుత్వమే రైతులపై అణిచివేత చర్యలకు పాల్పడటం దుర్మార్గం. పంట సేకరించిన ఏ మిల్లు అయినా పక్షం రోజుల్లోగా చెల్లింపులు చేయకపోతే సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలన్నది నిబంధన. రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా ఆస్తులను వేలం వేసైనా సరే అన్నదాతలకు చెల్లింపులు జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ఆచరణలో జరుగుతున్నదేమిటి? యాజమాన్యాల కొమ్ముగాయడం. బకాయిల కోసం నిలదీసే గొంతులను నులిమేయడం. అక్రమ కేసులు బనాయించడం, మహిళలని కూడా చూడకుండా అవమానకర రీతిలో వ్యవహరించడం. అన్నదాతలకు మద్దతుగా వెళ్లిన కార్మిక, కర్షక సంఘాల నాయకులను కారాగారాల్లో బంధించడం. రైతుల శ్రేయస్సు చూడవలసిన పాలకులు చేయాల్సిన పనులా ఇవి? ఈ అణిచివేత చర్యలను సహించలేకే రైతులు ప్రతిఘటించాల్సి వచ్చింది. అదేదో ప్రభుత్వం మీద పథకం ప్రకారం సాగించిన తిరుగుబాటు కాదు.
ఏడాదంతా కష్టపడి పండించిన పంట డబ్బు రెండు మూడేళ్లయినా రాకపోతే రైతు ఎలా బతకాలి? ఒక ఎకరాకు సుమారు రూ.50 వేలు ఖర్చు చేసి పండించిన పంటకు రెండేళ్లయినా సొమ్ము చేతికందకపోతే ఆ పంట కోసం చేసిన అప్పు తీర్చేదెలా? బతుకెళ్లదీసేదెలా? చైరుకు రైతుల న్యాయబద్ధమైన ఈ ఆక్రోశానికి బదులివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? రాష్ట్రంలో వివిధ చక్కెర మిల్లుల పరిధిలో 10 వేల మంది పైగా చెరకు రైతులకు రూ.90 కోట్ల బకాయిలు అందాల్సి వుంది. చిత్తూరు జిల్లా నిండ్ర లోని నేటం షుగర్స్ పరిధిలో 2850 మంది రైతులకు రూ.36 కోట్లు, ఇదే జిల్లా బి.ఎన్ కండ్రిగ లోని సూదలగుంట చక్కెర కర్మాగారం పరిధిలో 3000 మంది రైతులకు రూ.30 కోట్లు, నెల్లూరు జిల్లా పొదలకూరు లోని సూదలగుంట చక్కెర కర్మాగారం - 2 పరిధిలో 700 మంది రైతులకు రూ.8 కోట్లు, విజయనగరం జిల్లా లచ్చయ్యపేట లోని ఎన్‌సిఎస్ మిల్లు పరిధిలో 2400 మంది రైతులకు రూ.16 కోట్లు బకాయిలు అందాల్సి వుంది.
దేశవ్యాప్తంగా చెరకు పండించే అన్ని రాష్ట్రాల్లోనూ రైతన్న రోడ్డెక్కుతున్నాడు. విత్తనం మొదలు కోత వరకూ చెరకు సాగులో ముఖ్య భూమిక పోషించే మహిళా రైతులు, వ్యవసాయ కార్మికులు ఈ ఉద్యమాల్లో అగ్రపీఠిన నిలబడి పోరు సల్పుతున్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, కర్ణాటక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్..రాష్ట్రమేదైనా ఉమ్మడి సమస్య బకాయిలే. మార్కెట్‌లో చక్కెర ధర రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. కిలో రూ.50కి సమీపించింది. అటు వినియోగదారులపైనా భారాలు వేసి ఇటు రైతులకు చెల్లింపులు ఎగ్గొట్టి లాభాలు దండుకుంటున్న మిల్లుల యాజమాన్యాలపై పాలకులు చర్యలకు ఉపక్రమించకపోవడమే బకాయిలు పేరుకుపోవడానికి అసలు కారణం.
రైతుల ఆందోళనకు కొన్ని చోట్ల ప్రభుత్వాలు దిగొస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం 64 మిల్లులకు ఈ ఏడాది అనుమతులు విత్‌హోల్డ్‌లో పెట్టింది. పంజాబ్‌లో ప్రభుత్వామోదిత ధర (ఎస్‌ఎపి) క్వింటాలకు రూ.360కి పెంచింది. మన రాష్ట్రంలో ప్రభుత్వం ఇప్పటికైనా భేషజాలకు పోకుండా తక్షణమే రైతులకు చెల్లింపులు జరిపేలా చూడాలి. రైతుల పైనా, రైతు సంఘాల నాయకుల పైనా అక్రమంగా బనాయించిన కేసులు ఎత్తివేయాలి. చెల్లింపుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న చక్కెర మిల్లుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి. అదే నిజమైన భరోసా అవుతుంది.










