సిపిఎం, సిపిఐ రాజకీయ ప్రచార భేరి బహిరంగ సభలో వక్తలు
ప్రజాశక్తి - రాయచోటి టౌన్ : కేంద్రంలో బిజెపి అమలు చేస్తున్న విధానాలతో దేశ ప్రగతికి నష్టం వాటిల్లుతోందని వక్తలు పేర్కొన్నారు. కేంద్రంలోని బిజెపి విధానాలకు వ్యతిరేకంగా రాయచోటి బస్టాండ్ సర్కిల్‌లో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో బిజెపిని సాగనంపుదాం, దేశాన్ని కాపాడుకుందాం, ప్రచార భేరి బహిరంగ సభ నిర్వహించారు. ఈసందర్భంగా సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు పి.శ్రీనివాసులు, పి.ఎల్.నరసింహులు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ అమలు చేస్తున్న విధానాలతో అన్ని రకాల ధరలు పెరుగుతున్నాయన్నారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో 32 మంది ప్రాణ త్యాగలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రయివేటీకరించడం అన్యాయమని వాపోయారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరిస్తే రిజర్వేషన్లు అమలు కావని, లక్షలాదిమంది కార్మికులు, ఉద్యోగులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై మోడీ ప్రభుత్వం దాడి చేస్తుందన్నారు. రాజ్యాంగ హక్కులు పరిరక్షణకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్ సంస్థలకు కారుచౌకగా అమ్మివేస్తున్నారని విమర్శించారు. సమ్మె, కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని వాపోయారు. ఉపాధి నిధులలో కోత పెట్టి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ అధికారంలోకి వచ్చిన మోడీ ఖాళీ పోస్టులను భర్తీ చేయడం లేదన్నారు. పెద్దనోట్లు రద్దు చేసి ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు. బిజెపి ీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారన్నారు. మోడిని గద్దె దించితేనే దేశం అభివద్ధి పథంలో నడుస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బలం లేకపోయిన వైసిపి, టిడిపిలు బిజెపి విధానాలకు మద్దతు ఇస్తున్నారన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకించకపోవడం అన్యాయమన్నారు. అన్నమయ్య జిల్లా అభివద్ధి కావాలంటే హంద్రీనీవా, కడప, బెంగళూరు రైల్వే లైన్ పూర్తి చేయాలని పేర్కొన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అదాని, అంబాని ఆస్తులను పెంచేందుకు మోడీ పనిచేస్తున్నారని చెప్పారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలపై దాడులు అధికమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించేందుకు జనసేన పెట్టనని చెప్పిన పవన్ కల్యాణ్, బిజెపి వైఫల్యాలను ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. బీజేపీ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ము, ధైర్యం వామపక్షాలకు మాత్రమే ఉందని ఉద్ఘాటించారు. ప్రజలు, కార్మికులు, రైతాంగ సమస్యలు పరిష్కారానికి వామపక్షాలు పోరాటం చేస్తాయన్నారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎ.రామాంజులు, సిపిఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన సభలో సిపిఐ నాయకులు చిన్నం పెంచలయ్య, సిపిఎం నాయకులు హరిశర్మ, సిపిఐ జిల్లా నాయకులు కష్ణప్ప, మహేష్, రంగారెడ్డి, సాంబశివ, సిపిఎం నాయకులు నరసింహ, భాస్కర్, సిఐటియు జిల్లా కార్యదర్శి భాగ్యలక్ష్మి, మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలు సుమిత్ర పసంగించారు. సిపిఎం నాయకులు ఫయాజ్ ఆహ్వానం పలికి, వందన సమర్పణ చేసిన కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నాయకులు కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
- మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు










