Apr 26,2023 21:43

ఫొటో : మాట్లాడుతున్న మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి

బిజెపి ప్రభుత్వం నిరంకుశ పాలన
- మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి
ప్రజాశక్తి-ఆత్మకూర అర్బన్‌ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిరంకుశ పాలన చేస్తూ, ప్రజలపై పన్నులు వేస్తూ వారిని వేధిస్తుందని, అందుకు అనుకూలంగా వైసిపి, టిడిపిలు ఉన్నాయని, దేశంలో స్వపరిపాలన రావాలంటే అటు కేంద్రంలోనూ.. ఇటు రాష్ట్రంలోనూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఎంతైనా ఉందని మాజీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్‌ పార్టీ మీడియా చైర్మన్‌ డాక్టర్‌ నర్రెరెడ్డి తులసిరెడ్డి అన్నారు. బుధవారం ఆత్మకూరు పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పిసిసి ప్రధాన కార్యదర్శి చేవూరి శ్రీధర్‌ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం మోసం చేసిందన్నారు. రాష్ట్రానికి సంజీవిని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టిందని, కడప జిల్లాలో స్టీల్‌ప్లాంటుకు స్వస్తి పలికిందని విమర్శించారు.
దుగరాజపట్నం ఓడరేవు ఊసేలేదని, రాయలసీమ, ఉత్తరాంధ్రకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చిందన్నారు. పోలవరం ప్రశ్నార్థకమైందని, విశాఖ రైల్వేజోన్‌ ప్రస్తావనే లేదని, విశాఖ విజయవాడ మెట్రో రైల్‌ హుసేలేదని, ఆంధ్రుల ఆత్మాభిమానమైన విశాఖ ఉక్కును కాలగర్భంలో కలిపేసిందని దుయ్యబట్టారు. బిజెపి దేశాన్ని అప్పులు భారత్‌ చేసిందని తెలిపారు. 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాలలో పండిట్‌ నెహ్రూ మొదలుకొని మన్మోహన్‌ సింగ్‌ వరకు 13 మంది ప్రధానులు కాలంలో కేంద్ర ప్రభుత్వం రూ.46 లక్షల కోట్లు అప్పు చేయగా, కేవలం 8 సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం అదనంగా రూ.109 లక్షల కోట్లు అప్పుచేసిందని తెలియజేశారు. బిజెపి దేశాన్ని అమ్మకానికి పెట్టిందని, ప్రభుత్వ రంగ సంస్థలైన విమానాశ్రయాలను, నౌకాశ్రయాలను, రైల్వే స్టేషన్లను అమ్మేస్తుందన్నారు. దీంతో దేశంలో నిరుద్యోగం పెరుగుతుందని తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌, నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడికి అందుబాటులోకి లేవన్నారు. కార్యక్రమంలో డిసిసి అధికార ప్రతినిధి చేవూరు దేవకుమార్‌ రెడ్డి, పిసిసి అధికార ప్రతినిధి కే.రఘురాం ముదిరాజ్‌, పిసిసి ఉపాధ్యక్షులు సివి శేషారెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి చేవూరు శ్రీధర్‌ రెడ్డి, డిసిసి అధ్యక్షులు చేవూరు దేవకుమార్‌ రెడ్డి, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు వన్నెం నాగరాజు, పిసిసి సభ్యులు ఖాజా రహంతుల్లా, తదితరులు పాల్గొన్నారు.