Oct 27,2020 07:31

విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జీవనాడిగా చెప్పబడుతున్న పోలవరం ప్రాజెక్టు బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా చేతులెత్తేసి వెన్నుపోటు పొడిచింది. ఇప్పటికే ప్రత్యేక హోదా సహా సమస్త విభజన హామీలనూ తుంగలో తొక్కిన మోడీ సర్కారు చివరికి పునర్విభజన చట్టం ద్వారా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం విషయంలోనూ ఐదున్నర కోట్ల సీమాంధ్రులను నిలువునా వంచింది. విభజన సమయంలో పార్లమెంట్‌లో, అనంతరం 2014, 2019 ఎన్నికల్లో బిజెపి మేనిఫెస్టోలలో పోలవరాన్ని ప్రధానాంశంగా పేర్కొంది. గద్దెనెక్కి ఆరున్నరేళ్లు గడిచాక పోలవరంలో కేవలం డ్యాము నిర్మాణ బాధ్యతే కేంద్రానిదని, భూసేకరణ, భూములిచ్చిన నిర్వాసితుల సహాయ పునరావాసం (ఆర్‌ఆర్‌)తో సంబంధం లేదని చెప్పి తన కుటిలత్వాన్ని బయట పెట్టుకుంది.
భూమి లేకుండా ప్రాజెక్టు నిర్మాణం సాధ్యమేనా? గాలిలో జలాశయాలు కడతారా? ఎక్కడేగాని సవివరమైన ప్రాజెక్టు నివేదికల (డిపిఆర్‌)ల్లో భూసేకరణ కాంపొనెంట్‌ తప్పక ఉండి తీరుతుంది. భూసేకరణ చేయాలంటే భూములు ఇచ్చిన వారికి సహాయ పునరావాసం కల్పించాలి. దాదాపు 380 గ్రామాలు, లక్ష కుటుంబాలు పోలవరంలో నిండా మునుగుతున్నాయి. నిర్వాసితులయ్యేది అత్యధికులు ఆదివాసీలే. అందుకే పోలవరం ముంపు బాధితులకు ప్రత్యేకంగా ఆర్‌ఆర్‌ ప్యాకేజీలు అవసరమయ్యాయి. ఆర్‌ఆర్‌ ప్యాకేజీతో కేంద్రానికి సంబంధం లేదనడం దగా. గిరిజనులంటే పూచిక పుల్లతో సమానమని బిజెపి సహజసిద్ధ వైఖరి పోలవరంలో మరొకసారి రుజువైంది. పోలవరం నిర్మాణ వ్యయాన్ని 2013-14 నాటి రేట్లకనుగుణంగా రూ.20,398 కోట్లతో డిపిఆర్‌-2ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదించి, దాన్నే ఓకే చేయాలంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పిపిఎ)కి ఇటీవల లేఖ పంపడంతో బిజెపి నమ్మక ద్రోహం బహిర్గతమైంది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక 2014 ఏప్రిల్‌ ఒకటి తర్వాత అయిన ఖర్చులో ఇప్పటికే రూ.8,614 కోట్లు ఇచ్చేశామని, 2014 ఏప్రిల్‌ 1కి ముందు అయిన వ్యయం రూ.4,730 కోట్లు కూడా రీయింబర్స్‌ చేశామని, ఇక ఇవ్వాల్సింది రూ.7,053 కోట్లు మాత్రమేనని తేల్చేసింది. పైగా రాష్ట్రం ఖర్చు చేసిన రూ.2,234 కోట్లు సైతం డిపిఆర్‌కు పిపిఎ ఆమోదం లభించాకనే విడుదల చేస్తామని మెలిక పెట్టింది. ఈ చర్య కేంద్ర కుట్రకు పరాకాష్ట. తాగునీరు, విద్యుత్‌ ప్రాజెక్టులను మినహాయించి, 2017-18 అంచనాల ప్రకారం ప్రాజెక్టు వ్యయం రూ.55,448 కోట్లకు పిపిఎ, కేంద్ర జలనంఘం, సాంకేతిక సలహా కమిటీ గతంలోనే ఆమోదం తెలి పాయి. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ సైతం రూ.47,725 కోట్లకు ఎప్పుడో గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సంస్థలే. వాటిని పక్కనపెట్టిన ఆర్థిక శాఖ 2017 నాటి కేంద్ర కేబినెట్‌ ఆమోదిం చిన నోట్‌ ఆధారంగా ఖర్చును నిర్ణయించడం నయ వంచన.
రాష్ట్రానికి కేంద్రం అడుగడుగునా ద్రోహం తలపెడుతున్నా గత టిడిపి ఇప్పటి వైసిపి రెండూ బిజెపి పట్ల చూపుతున్న వినయ విధేయతలు ప్రజలకు చేస్తున్న అతిపెద్ద మోసం. పోలవరం అంచనాలను అధఃపాతాళానికి కుదించిన సమయంలోనూ ఆ రెండు పార్టీలూ ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ ప్రజలను ఇంకా దగా చేయ ప్రయత్నించడం జుగుప్సాకరం. ముఖ్యమంత్రి కనీసం రూ.47 వేల కోట్లన్నా సాధించేందుకు పిపిఎ సమావేశంలో పట్టుబడతామని శనివారంనాటి సమీక్షా సమావేశంలో పేర్కొనగా మంత్రి అనిల్‌కుమార్‌ ఖర్చు తగ్గింపుపై కేంద్రానికి బాసటగా నిలుస్తూ, తప్పంతా గత టిడిపి ప్రభుత్వానిదని రాజకీయ ఆరోపణలను లంకించుకున్నారు.
విభజన హామీల కోసం కేంద్రం మెడలు వంచుతామన్న ముఖ్యమంత్రి లేఖలతో సరిపెడుతున్నారు. కేంద్రం నిర్మించాల్సిన పోలవరం కాంట్రాక్టు తమకు వస్తే చాలు, హోదా, ఇతర విభజన హామీలు ఏమైనా ఫర్వాలేదనే రీతిలో లేని ప్యాకేజీకి ఒప్పుకొని, ఇప్పుడేమో వైసిపి ప్రభుత్వం వైఫల్యం చెందిందని టిడిపి వారు చిలకపలుకులు పలుకుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై నిగ్గదీయలేని వైసిపి, టిడిపి బలహీనతను బిజెపి ఎంచక్కా తన రాజకీయాలకు ఉపయోగపెట్టుకుంటోంది. మూడు పార్టీల అసలు బండారం పోలవరంతో మరోసారి బహిర్గతమైంది. రాష్ట్ర ప్రజల ఆశల ప్రాజెక్టు పోలవరం ప్రశ్నార్ధకమైంది. బిజెపి, వైసిపి, టిడిపి మూడుముక్కలాటలో సమిధలయ్యేది తామేనని ఇప్పటికైనా ప్రజలు గ్రహించడం అవసరం.