Mar 18,2022 06:53

తమ ఎన్నికల వ్యూహాన్ని సైతం పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. వైసిపి-వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడడమే ఆ వ్యూహం. అంటే ప్రజలముందు పవన్‌ కల్యాణ్‌ రెండు ఆప్షన్లు ఉంచారన్నమాట. వైసిపి కావాలా? లేక బిజెపి ప్లస్‌ మిత్రులు కావాలా? అని అడుగుతున్నారు. అన్ని విధాలా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బిజెపినైనా ఎంచుకోండి, లేదా ఏక పక్షంగా వ్యవహరిస్తూ వివిధ తరగతుల గోడును పెడచెవిన పెడుతూ, కేంద్ర బిజెపి పట్ల మెతకగా, నంగినంగిగా వ్యవహరిస్తున్న వైసిపినైనా ఎంచుకోండి అని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సూచిస్తున్నారు. ఎంత గొప్ప ఛాయిస్‌ ఇచ్చారు పవన్‌కల్యాణ్‌ గారూ !

    తాము అధికారంలోకి రావాలని ప్రతీ రాజకీయ పార్టీ కోరుకుంటుంది. అందులో తప్పు లేదు. అందుచేత పవన్‌ కల్యాణ్‌ 2024లో అధికారంలోకి వచ్చేస్తామని కోరుకోవడంలో తప్పులేదు. అధికారం తమకు ఇస్తే ఏయే అంశాలను అమలు చేస్తామో దానినీ ప్రతీ రాజకీయ పార్టీ ముందుగానే ప్రకటిస్తుంది. అందులోనూ తప్పు లేదు. ఎటొచ్చీ అధికారంలోకి రావడానికి తాము ఏ వ్యూహాన్ని అమలు చేయబోతున్నామో దానిని కూడా పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. అదే మనం అందరం కాస్త పరిశీలించాలి.
    పులిని వెంట పెట్టుకుని మేకల్నీ, గొర్రెల్నీ కాపలా కాస్తానని ఎవరైనా అన్నారనుకోండి. అలా అన్నవారిని నమ్మి మన మేకల్ని, గొర్రెల్ని వారికి అప్పజెప్పామనుకోండి. ఏమౌతుంది? పవన్‌ కల్యాణ్‌ చెప్పిన వ్యూహం ఆ తీరుగానే ఉంది. బిజెపి తో కలిసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అభివృద్థి చేస్తానని అయన చెప్తున్నారు. ఆ అభివృద్ధి అనేది బిజెపితో కలిస్తే జరిగే పనేనా ?
   అంబానీలకు, అదానీలకు ప్రజల సంపదను దోచిపెట్టడం, ఆ ప్రజలలో ఐక్యతను ఛిన్నాభిన్నం చేసి సమాజంలో పరస్పర శత్రు భావాలను పెంచిపోషించడం-ఇది తప్ప బిజెపి ఈ దేశంలో ఇంతవరకూ సాధించిన అభివృద్ధి ఏమిటో పవన్‌కల్యాణ్‌ చెప్పగలరా? మోడీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఇప్పటివరకూ సామాన్య ప్రజానీకానికి ఒరగబెట్టినది ఏమైనా ఉందా? దేశ స్వావలంబనకు మూలమైన ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మడం, దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టడం తప్ప కొత్తగా స్థాపించిన పరిశ్రమలేమైనా ఉన్నాయా? కరోనా కష్టకాలంలో లాక్‌డౌన్‌ విధించడం, దీపాలు వెలిగించమని, చప్పట్లు కొట్టమని, గోమూత్రం తాగి ఆవుపేడ వొంటికి రాసుకోమని చెప్పడం మినహా మోడీ ప్రభుత్వం చేసిందేమిటి? కనీసం వలసకూలీలనైనా ఆదుకోగలిగిందా? ఉత్తరప్రదేశ్‌లో గంగా తీరంలో దిక్కూ మొక్కూ లేకుండా దహన సంస్కారాలకి కూడా నోచుకోక పడివున్న శవాలే బిజెపి అసమర్ధతకు సాక్ష్యాలు. బిజెపి పాలనలో గత ఇరవై ఏళ్ళుగా నలుగుతున్న గుజరాత్‌ గాని, గత ఐదేళ్ళుగా ఉత్తరప్రదేశ్‌ గాని, మరే బిజెపి-పాలిత రాష్ట్రం గాని ప్రజలకు ఉపయోగపడేవిధంగా పరిపాలన జరిగినదానికి నిదర్శనాలను చూపగలరా? ప్రజలను ఆదుకోడంలో అన్ని విధాలా విఫలమౌతున్న పార్టీని వెంటపెట్టుకుని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేస్తాం అని పవన్‌ కల్యాణ్‌ చెప్పడం వంచన కాదా?
తక్కిన దేశం సంగతి పక్కనపెడితే మన రాష్ట్రానికి బిజెపి ప్రభుత్వం ఒరగబెట్టినది ఏమిటి? గతంలో పవన్‌ కల్యాణ్‌ 2019 ఎన్నికల్లో బిజెపి మన రాష్ట్రానికి చేసిన ద్రోహం గురించి ఏమేమి చెప్పారో ఒక్కసారి గుర్తు చేసుకుంటే మంచిది. పాచిపోయిన లడ్డూ అని ఆ నాడు బిజెపి గురించి ఈసడించినది ఎవరో మరి ?
    ప్రత్యేక హోదా విషయంలో బిజెపి పూర్తిగా తన బాధ్యతను నెరవేర్చడంలో విఫలమైంది. విభజన హామీలలో ప్రధానమైనవి ఏవీ ఇంతవరకూ అమలుకు నోచుకోలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసాన్ని కల్పించే బాధ్యత తమది కానేకాదంటోంది మోడీ ప్రభుత్వం. రాజధాని నిర్మాణం విషయంలో బిజెపి తనకేమీ బాధ్యత లేదన్నట్టు మాట్లాడుతోంది. కాని విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాజధానిని నిర్మించి ఇచ్చే బాధ్యత కేంద్రానిదేనన్న సంగతిని పవన్‌ కల్యాణ్‌ సైతం మరిచిపోయి మాట్లాడుతున్నారు. రైల్వే జోన్‌ విషయంలో వొట్టి మాటలే తప్ప చేతల్లో ఒక్క అడుగు కూడా పడలేదు. దీనికి బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే. పైగా వాల్తేరు డివిజన్‌ ను ఆ జోన్‌ పరిధిలోంచి మినహాయించి మరో ద్రోహం చేయడానికి పూనుకుంది. తెలుగు జాతి సమైక్యతను దెబ్బతీసి, నిలువునా రెండు రాష్ట్రాలుగా చీల్చిన పాపంలో బిజెపి ది కీలక పాత్ర. దానికి తోడు ఆంధ్రప్రదేశ్‌ కు అన్ని విధాలా అన్యాయం చేసిన పాపమూ బిజెపిదే. ఇప్పుడు అటువంటి పార్టీతో జత కట్టాలనుకోవడం వెనక మర్మం ఏమిటో ? జనసేన నేతలు చెప్పగలరా ?
    ఇటీవలే పవన్‌ కల్యాణ్‌ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ ఉద్యమానికి మద్దతు తెలియజేసివచ్చారు. ఆ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తానని, కొనేటందుకు ఎవరూ ముందుకు రాకపోతే మూసేస్తానని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోడానికి జగన్‌ ప్రభుత్వం అవసరమైన ఒత్తిడి చేయడం లేదంటూ పవన్‌ విశాఖలో వైసిపి మీద ధ్వజమెత్తారు. దానికి ఎవరికీ అభ్యంతరం లేదు. కాని అసలు ముప్పు తెచ్చిపెట్టిన బిజెపి ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనకపోవడం వెనక ఏ ప్రయోజనాలు దాగివున్నాయో ఆయన చెప్పగలరా? ఇప్పుడు ఏకంగా ఆ పార్టీతో కలిసి అధికారం గురించి పథకాలు రూపొందిస్తున్నారు. విశాఖ ఉక్కును ముంచేయడానికి పూనుకున్నవారితో జతకట్టాక ఇక ఆ పరిశ్రమను ఎలా కాపాడదామనుకుంటున్నారు ? చెప్పగలరా ?
   ప్రభుత్వ రంగాన్ని మొత్తంగానే ధ్వంసం చేస్తున్న బిజెపితో చెలిమి చేశాక ఇక సామాజిక న్యాయాన్ని ఏవిధంగా పరిరక్షిస్తారో చెప్పగలరా?
సిపిఎస్‌ విధానాన్ని తాను పూర్తిగా అధ్యయనం చేశానని, తాము అధికారంలోకి వస్తే ఆ విధానాన్ని రద్దు చేస్తామని పవన్‌ కల్యాణ్‌ విజయవాడ సభలో ప్రకటించారు. పూర్తి అధ్యయనం చేసి వుంటే ఆ విధానాన్ని తెచ్చిపెట్టినది బిజెపియేనని, ఆ విధానాన్ని రద్దు చేయడానికి అది పూర్తి వ్యతిరేకమని పవన్‌ కల్యాణ్‌కు తెలియలేదా? ఆ పార్టీతో కలిశాక ఇక సిపిఎస్‌ ను రద్దు చేయడమెలా కుదురుతుంది ?
    అప్పుల్లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చేస్తామని ఇంకో వాగ్దానం. దేశం మొత్తం మోడీ హయాంలో భారీ అప్పుల్లో కూరుకుపోయింది. మోడీ పాలనలో భారీ అప్పులు చేసినా వాటిని మాఫీ చేయించుకోగలుగుతున్నది అంబానీ, అదానీ, టాటా, బిర్లాలే తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు కావు. రాష్ట్రాలకు న్యాయంగా రావలసిన వాటాలను ఎగ్గొడుతున్నది కేంద్ర ప్రభుత్వం. మన రాష్ట్రానికి రావలసిన నిధుల విషయంలో మరీ అన్యాయంగా వ్యవహరిస్తోంది. అటువంటి బిజెపితో చెట్టపట్టాలేసుకున్నాక ఇక మన రాష్ట్రానికి దక్కేది చిప్పే. బహుశా ''అప్పుల్లేని రాష్ట్రం'' అని పవన్‌ కల్యాణ్‌ అన్నది ఈ ఉద్దేశ్యంతోనే కాబోలు.
    వ్యవసాయం, విద్య, విద్యుత్తు, మునిసిపల్‌ పాలన తదితర రంగాలు ఆ యా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశాలు. కాని మోడీ ప్రభుత్వం వాటిని కూడా తన గుప్పెట్లోకి తీసుకుని రాష్ట్రాల అధికారాలను నామావశిష్టంగా దిగజార్చుతోంది. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపన సంగతి తర్వాత. ఉన్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునే చర్యలేవీ లేవు. సహకార రంగాన్ని సైతం అమిత్‌ షా స్వయంగా తన గుప్పెట్లోకి తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కన్నా, ఈ రాష్ట్రంలో ఓడరేవులను, అడవులను, గనులను కార్పొరేట్ల పరం చేయడమే బిజెపి లక్ష్యంగా ఉంది.ఉన్న వాటిని కొల్లగొట్టేవారు కొత్తగా పెట్టుబడులు తెచ్చేదేమిటి? అభివృద్ధి చేసేదేమిటి? మూతబడుతున్న పరిశ్రమలను ఆదుకోడానికి ముందుకు రానివారితో కలిసి కొత్త పరిశ్రమలను నెలకొల్పుతామనడం నేల విడిచిన సాము కాక ఇంకేమిటి? ఇక వ్యవసాయంలో చిన్న, మధ్యతరహా రైతులకు మనుగడే సవాలుగా మారిపోయింది. దానిని మరింత జటిలం చేసే నల్ల వ్యవసాయ చట్టాలను తెచ్చిన ఘనత బిజెపిదే కదా ?
   అన్ని విషయాల్లోనూ రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు అన్యాయం చేసిన, చేస్తున్న బిజెపితో చెట్టపట్టాలేసుకున్నాక ఇక రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడగలుగుతారు ?
   తమ ఎన్నికల వ్యూహాన్ని సైతం పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. వైసిపి-వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడడమే ఆ వ్యూహం. అంటే ప్రజల ముందు పవన్‌ కల్యాణ్‌ రెండు ఆప్షన్లు ఉంచారన్నమాట. వైసిపి కావాలా? లేక బిజెపి ప్లస్‌ మిత్రులు కావాలా? అని అడుగుతున్నారు. అన్ని విధాలా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బిజెపినైనా ఎంచుకోండి, లేదా ఏక పక్షంగా వ్యవహరిస్తూ వివిధ తరగతుల గోడును పెడచెవిన పెడుతూ, కేంద్ర బిజెపి పట్ల మెతకగా, నంగినంగిగా వ్యవహరిస్తున్న వైసిపినైనా ఎంచుకోండి అని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సూచిస్తున్నారు. ఎంత గొప్ప ఛాయిస్‌ ఇచ్చారు పవన్‌కల్యాణ్‌ గారూ !
   ''సముద్రాన పడి మరణించడమో, ఉరి పోసుకుని చావడమో సమస్యగా ఘనీభవించిందొక సంసారికి'' అని మహాప్రస్థానంలో మహాకవి శ్రీశ్రీ అన్నది గుర్తుకు తెచ్చారు కదా !
ఈ రెండూ తప్ప వేరే దారే లేదన్నట్టు పవన్‌ కల్యాణ్‌ సూత్రీకరించడం రాష్ట్రానికి అన్యాయం చేయడమే.
రాష్ట్రాల హక్కులకోసం నిలబడి పోరాడుతున్న ఇతరులెవరూ కనిపించడం లేదా ?
     ఏడాదిపాటు అన్ని నిర్బంధాలనూ తట్టుకుని మోడీ ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలను ఎదిరించి పోరాడి వాటిని రద్దు చేయించిన రైతుల పోరాటం కనిపించలేదా? ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కోసం దేశం మొత్తం మీద జరుగుతున్న పోరాటాలు కాని, విశాఖ ఉక్కు కార్మికులు ఏడాదిగా సాగిస్తున్న దీక్షలు గాని మీకు ఏమీ తెలియజెప్పడం లేదా? దేశంలోను, రాష్ట్రంలో సైతం మోడీ విధానాల వలన అభద్రతాభావంలో పడిపోతున్న మైనారిటీలు మీకు కనపడడం లేదా? హుళక్కి అయిపోతున్న సామాజిక న్యాయం మీలో ఏ కలవరాన్నీ కలిగించడం లేదా? పవన్‌ కల్యాణ్‌ గారూ!
కార్పొరేట్‌-అనుకూల విధానాలకు, మతవిద్వేష కారక రాజకీయాలకు, నిరంకుశ విధానాలకు ప్రత్యామ్నాయం ఏర్పడితే ప్రజలకు మేలు జరుగుతుంది. ''నీ ఎడం చెయ్యి తీసెరు, నా పుర్రచేయి పెడతా'' అన్నట్టు వ్యవహరించడం ఎవరిని మోసగించడానికి ?
   ''బిజెపి రోడ్‌మ్యాప్‌ కోసం ఎదురు చూస్తున్నా'' అని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన మర్నాడే రాష్ట్ర బిజెపి నేత సోము వీర్రాజు కేంద్ర బిజెపి నేతలతో కలిసి పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రంలో వ్యూహాన్ని చేపడతారని ప్రకటించేశారు. దీనిని బట్టే విషయం స్పష్టం అయిపోయింది. బిజెపి ఈ రాష్ట్రంలో ఆడబోయే రాజకీయ జూదంలో పవన్‌కల్యాణ్‌ ని ముందు అడ్డం పెట్టుకుంటున్నారు. ఢిల్లీ నుండే స్క్రీన్‌ప్లే, డైలాగులు వస్తాయి, డైరెక్షనూ అక్కడిదే. ఇక్కడ యాక్షన్‌ పవన్‌కల్యాణ్‌ చేస్తారు. ఇతర తారాగణాన్ని సమకూర్చుకోవాల్సింది కూడా అతనే. ఎటొచ్చీ ఈ జూదంలో భాగస్వామిగా తానూ తయారేనని టిడిపి కూడా సిద్ధపడుతుందా? ఈ ఆటలో జోకర్‌ ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం ఆ యా పార్టీలే చెప్పాలి.
    రాష్ట్రంలోని ప్రజలు, వారికి తోడుగా సర్వదా నిలిచే వామపక్షాలు ఈ ద్విముఖ జూదపు బండారాన్ని తిరస్కరించాలి. రాష్ట్ర ప్రజల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల ఆత్మగౌరవాన్ని, జీవన ప్రమాణాలను, ప్రజాస్వామ్య హక్కును పరిరక్షించే ప్రత్యామ్నాయం నేటి ఆవశ్యకత. ఆ దిశగా కృషి చేయడానికి ముందుకు వచ్చే శక్తులను, వ్యక్తులను, సంస్థలను స్వాగతించాలి, ఆదరించాలి, అండదండలివ్వాలి.

ఎం.వి.ఎస్‌. శర్మ