Jan 17,2022 20:23

పాట్నా :  బీహార్‌లో బిజెపి, కూటమి భాగస్వామి, పాలక పార్టీ జనతాదళ్‌ యునైటెడ్‌ (జెడి(యు))ల మధ్య సంబంధాలు రోజురోజుకి క్షీణిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. బిజెపి, జెడి(యు) నేతల మధ్య ట్వీట్ల వార్‌ కొనసాగుతోంది. హద్దుల్లో ఉండాలని, లేకుంటే కూటమి మధ్య విబేధాలు తప్పవంటూ బిజెపి బెదిరింపులకు దిగింది. 74 : 45 సీట్ల భాగస్వామ్యంతో బీహార్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో బిజెపి కలిసి నడవాలంటే అణిగిమణిగి ఉండాల్సిందేనంటూ జెడి(యు) నేతలపై బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడ్డారు.  ఎవరి హద్దుల్లో  వారు  ఉండాలని   బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ పార్టీ జెడి(యు ) నేతలను రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సంజయ్  జైశ్వాల్‌ హెచ్చరించారు. ప్రభుత్వాన్ని మంచి వాతావరణంలో శాంతియుతంగా నడిపించేందుకు ఇరువైపుల నుంచి సహకారం ఉండాలని గుర్తు చేసుకోవాలని అన్నారు. 2005కి ముందు ముఖ్యమంత్రి నివాసంలో హత్యలు, కిడ్నాప్‌లు జరిగేవని, ఇప్పుడు అలా మారడం తమకు ఇష్టం లేదంటూ బెదిరించారు.

ప్రధాని మోడీని జెడియు నేతలు తరుచూ ట్విట్టర్‌లో ట్యాగ్‌ చేస్తుండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రధానితో ట్విట్టర్‌-ట్విట్టర్‌ అంటూ ఆడొద్దని హెచ్చరించారు. ఎవరి హద్దుల్లో వారు ఉండాలని లేదంటే బిహార్‌లోని 75 లక్షల మంది బిజెపి కార్యకర్తలు సమాధానం చెప్తారని అన్నారు. అశోక చక్రవర్తిపై సినీ రచయిత జయ ప్రకాష్‌ సిన్హా అనుచిత వ్యాఖ్యలు చేశారని.. దీంతో ఆయనకు ఇచ్చిన పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలంటూ జెడియు జాతీయ అధ్యక్షుడు రాజీవ్‌ రంజన్‌, పార్లమెంటరీ బోర్డ్‌ చైర్మన్‌ ఉపేంద్ర కుష్వాహాలు డిమాండ్‌ చేశారు. మొఘలుల చక్రవర్తి ఔరంగజేబుతో సమానంగా అశోకుని పోల్చడాన్ని వ్యతిరేకిస్తూ జైశ్వాల్‌ కూడా జయప్రకాష్ పై  ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే ప్రకాష్‌ సిన్హాను ఎందుకు అరెస్ట్‌ చేయలేదని, ఆయనకు ఇచ్చిన పద్మశ్రీని ఎందుకు వెనక్కు తీసుకోలేదంటూ  జెడియు నేతలు పదేపదే ట్వీట్లు చేయడంతో పాటు ప్రధానిని ట్యాగ్‌ చేయడంపై జైశ్వాల్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా సంజయ్  జైశ్వాల్‌ స్పందించారు. కూటమి బలంగా, ఎక్కువ రోజులు ఉండాలంటే కూటమిలోని పార్టీల నేతలు ఎవరి హద్దుల్లో వారు ఉండాలని, రాష్ట్రపతి ఇచ్చిన అవార్డును వెనక్కి తీసుకొమ్మని ప్రధానిని డిమాండ్‌ చేయడం ఏమిటని ప్రశ్నించారు. డిమాండ్‌ ఏకపక్షంగా ఉండకూడదని, ప్రధానితో ట్విట్టర్‌ ట్విట్టర్‌ అంటూ ఆడే ఆటలు ఆపేయాలని హెచ్చరించారు. ప్రస్తుతం జైస్వాల్‌ వ్యాఖ్యలు  వివాదాస్పదమయ్యాయి. అయితే ఈ ట్వీట్‌పై ఉపేంద్ర కుష్వాహ్ ఘాటుగా స్పందించారు. తమ డిమాండ్‌ నెరవేరేంతవరకు వెనక్కి తగ్గేది లేదని సమాధానమిచ్చారు.

చిన్న గ్రూపులు (జెడి(యు) జాతీయ స్థాయిలో పెద్ద పార్టీల పని తీరును అర్థం చేసుకోలేవని బిజెపి ఒబిసి విభాగం ప్రధాన కార్యదర్శి నిఖిల్‌ ఆనంద్‌ ట్వీట్‌ చేశారు. వారి పార్టీ గుర్తింపుపై వారికే అవగాహన ఉండదని పరోక్షంగా జెడి(యు)కి చురకలంటించారు. వారు కొత్త స్థానం కోసం వెతకాల్సిన రోజు ఎంతో దూరంలో లేదంటూ ట్విట్టర్‌లో తెలిపారు. దీనిపై జెడియు ప్రతినిధి అభిషేక్‌ జా స్పందించారు. కొందరు తమ స్థానాన్ని మరిచిపోయి ఊహల్లో తేలుతూ మాట్లాడుతుంటారని, కింద పడితే గాని వారి పరిస్థితి అర్థం కాదని... అలాంటి వారిని దైవం కాపాడాలంటూ సమాధానమిచ్చారు. జనవరి 15న బీహార్‌ ముఖ్యమంత్రి జిల్లా నలందలో 13 మంది ప్రాణాలను బలిగొన్న మద్యం విషాద ఘటన అనంతరం ఈ ట్వీట్ల వార్‌ ప్రారంభమైంది. రాష్ట్రంలో నితీష్‌ ప్రభుత్వం కారణంగానే మద్యనిషేధం వాగ్దానం విఫలమైందంటూ  సంజయ్  జైస్వాల్‌ విమర్శలకు దిగడంపై జెడి(యు) నేతలు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.