Oct 25,2020 07:48

బీహార్‌ ఎన్నికల ప్రణాళికలో బిజెపి కరోనా వ్యాక్సిన్‌ ఉచితంగా ఇస్తానని వాగ్దానం చేయడంపై ఎన్నో విమర్శలు, విసుర్లూ రావడం అక్కడ పరిస్థితికి ప్రతిబింబం. కరోనా వ్యాక్సిన్‌ ఇంకా తయారు కాలేదన్నది ఒకటైతే, కేంద్రంలో పాలన చేసే పార్టీ ఒక రాష్ట్రంలోనే ఆ విధమైన వాగ్దానం ఎలా చేస్తుందనేది అంతకన్నా కీలకమైన ప్రశ్న. కాని బీహార్‌లో నితీష్‌ కుమార్‌ నాయకత్వం లోని ఎన్‌డిఎ ప్రభుత్వం కరోనాను అరికట్టడంలో విఫలమైన తీరుపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని గుర్తించక తప్పలేదు గనకే బిజెపి ఈ విపరీత వాగ్దానం చేసింది. గత ఎన్నికల్లోనూ ప్రధాని మోడీ 2015లో 'ఎన్ని వేల కోట్ల ప్యాకేజీ కావాలి. లక్ష కోట్లా...? రెండు లక్షల కోట్లా...?' అని ఊరించిన తీరు అపహాస్యం పాలైంది. ప్రజలు కూడా వాటిని విశ్వసించలేదు గనకే బిజెపిని పూర్తిగా తిరస్కరించి ఆర్‌జెడి తో కలసి ఒకటిగా ముందుకొచ్చిన నితీష్‌ కూటమిని గెలిపించారు. కాని తర్వాత నితీష్‌ నీతి మాలిన రాజకీయంతో ఆ కూటమి నుంచి ఆర్‌జెడి ని తొలగించి మళ్లీ ప్రజలు తిరస్కరించిన బిజెపి కి ప్రభుత్వ పగ్గాలు అప్పగించారు. గద్దెపై ముఖ్యమంత్రిగా తానున్నా ఈసారి నితీష్‌ పూర్తిగా పరాధీనమై పోయారన్నది జనవాక్యంగా మారింది. ఇప్పుడు అసెంబ్లీ ప్రచారం లోనూ ఎక్కడ చూసినా మోడీ బమ్మలే దర్శనమిస్తున్నాయి. సభలు కూడా ఆయనే ఎక్కువగా నిర్వహిస్తున్నారు. పదిహేనేళ్ల నితీష్‌ పాలనలో బీహార్‌ సుపరిపాలన ప్రచారం తలకిందులై అవినీతి, అత్యాచారాలు, అసమర్థత తాండవిస్తున్నాయి. మోడీకి తనే ప్రత్యామ్నాయమన్న స్థాయిలో ఆయనను రానివ్వబోనని చెప్పిన నితీష్‌ మధ్యలో మళ్లీ గెలవడానికి నాటకం నడిపి ఆ తర్వాత మళ్లీ నెత్తిన పెట్టుకోవడం రాజకీయ అనైతికతకు పర్యాయ పదమైంది. ఉత్తర భారత దేశంలో బిజెపి నేరుగా అధికారం లోకి రాలేకపోయిన ఏకైక రాష్ట్రం బీహార్‌. 1990వ దశకంలో వి.పి.సింగ్‌ ను కూలదోసేందుకై అద్వానీ రథయాత్ర పేరుతో మండల్‌కు పోటీగా కమండల్‌ రథయాత్ర మొదలెట్టినప్పుడు పగ్గాలు వేసింది బీహార్‌. అప్పటి నుంచి పదిహేనేళ్లు లాలూ...ఆయన గడ్డి కుంభకోణంలో చిక్కాక రబ్రీదేవి పాలన నడిచింది. మరో పదిహేనేళ్లుగా నితీష్‌్‌ ఏలుతున్నారు. ఏమైనా ఆ పరివర్తన ఒక్కసారిగా గాని, సూటిగా గాని జరగలేదని గుర్తుంచుకోవాలి. ఒక దశలో రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ నాయకత్వం లోని ఎల్‌జెపి ఇటు నిలిచి వుంటే నితీష్‌ పాలన ఇన్నాళ్లు సాగివుండేది కాదు. అవకతవకలు, ఆరోపణలూ ఎన్ని వున్నా లాలూ కొంతమందిలా బిజెపి మతతత్వ రాజకీయాలతో రాజీ పడలేదు. వారి వ్యూహాలకు ప్రతిగా మైనార్టీలను, బి.సి లు ఎస్‌.సి లను నిలబెట్టగలిగారు.
ఎన్నెన్నో పరిణామాలు
భారత దేశంలో మొదటి మహా సామ్రాజ్యమైన మౌర్యవంశం నాటి నుంచి బీహార్‌ను వెనకబడిన కులాల చైతన్యానికి నిలయంగా చెబుతుంటారు. 1970లలో జయప్రకాశ్‌ ఉద్యమం కూడా అక్కడే మొదలైంది. అప్పటి నుంచి దాన్ని హైజాక్‌ చేయడానికి బిజెపి కూటమి తంటాలు పడుతూనే వుంది. లౌకిక శక్తుల అనైక్యత వారు అధికారంలో వున్నప్పటి తప్పిదాలు కలసి అందుకు అవకాశమిచ్చాయి. 2015లో కేంద్రంలో మోడీ ఘన విజయం సాధించిన తర్వాత మొదట దెబ్బతిన్నది బీహార్‌లోనేనంటే దానికి కారణం నితీష్‌ ఎన్‌డిఎ నుంచి నిష్క్రమించి ఆర్‌జెడి తో కలవడమే. ఆ ఎన్నికల్లో మోడీగాని, అప్పటి బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా గాని చేసిన ప్రసంగాలు జుగుప్స కలిగించాయి. నితీష్‌ కూటమి గెలిస్తే పాకిస్తాన్‌లో పండుగ చేసుకుంటారని నోరు పారేసుకున్నారు. ఆ సమయంలోనూ సర్వేలు బిజెపి కి గెలుపునే జోస్యం చెప్పాయి. కాని కూటమి ఘన విజయంతో మోడీ మోతకు పగ్గాలు పడ్డాయి. తేజస్వి యాదవ్‌ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కాని కుటిల నీతికి మారు పేరైన నితీష్‌ కుమార్‌ ఒక క్రమపద్ధతిలో దానికి తూట్లు పొడిచారు. లాలూను దేశంలోనే అరాచకానికి మారుపేరుగా చిత్రించిన మోడీ అనుకూల మీడియా ఆ ప్రచారాన్ని పునరుద్ధరించింది. కేంద్రం పత్యేకంగా వారిపైనే దాడులు చేసి రెచ్చగొట్టింది. నితీష్‌ వ్యూహాత్మకంగా విడగొట్టుకోవడంతో వారూ ఆ విధంగానే ప్రతిస్పందించారు. ఏ విలువలూ పాటించని నితీష్‌ మళ్లీ బిజెపితో దోస్తీకి తలుపులు తీశారు. లాలూకు శిక్షపడినా జైలు పాలైనా ఆ కుటుంబం, ఆర్‌జెడి లు మళ్లీ ఊపిరి పోసుకోవడానికి తనతో పొత్తు కారణమని ఆయన భయపడ్డారు. ఈ తలకిందులు రాజకీయాన్ని జెడియు అధ్యక్షుడైన శరద్‌ యాదవ్‌ వ్యతిరేకిస్తే రాజ్యసభలో ఆయన సభ్యత్వం రద్దు చేయించారు. ఒకప్పటి సోషలిస్టు కుదురు నుంచి వచ్చిన జనతాదళ్‌ పరివారంతో కర్ణాటకలో కుమారస్వామి గౌడ ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం మినహా మరెవరూ బిజెపి తో నేరుగా కలిసిన సందర్భం లేదు. కాని నితీష్‌ మాత్రం మొదటి నుంచి అందుకు విరుద్ధం. 2019లో రాష్ట్రం లోని లోక్‌సభ స్థానాలు ఇంచుమించు మొత్తంగా వారే గెలుచుకోగలిగినా అది మోడీ పట్టును పెంచి నితీష్‌ను తగ్గించింది.
చిరాగ్‌ వెనక బిజెపి
పదిహేనేళ్ల పాలనలో నెరవేరని వాగ్దానాలతో ప్రజలలో పలుచనై పోయారని, ప్రతిష్ట కోల్పోయారని బిజెపి భావిస్తున్నది. రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ కుమారుడైన చిరాగ్‌ పాశ్వాన్‌ మోడీకి విధేయత చాటుతూనే కూటమి నుంచి బయిటకు రావడం వెనక బిజెపి హస్తం బహిరంగ రహస్యం. అందుకే ఆయన మోడీని అతిగా పొగుడుతూ నితీష్‌ పైనే బాణాలు ఎక్కుపెడుతున్నారు. ప్రజా వ్యతిరేకత మూటకట్టుకున్న నితీష్‌ పాలనతో విడగొట్టుకుంటూ వీలైతే రేపు చిరాగ్‌తో కలసి పాలన లోకి రావాలని బిజెపి కలలు కంటున్నది. అయితే ముఖ్యమంత్రిగా ఆయనను ముందుంచక తప్పని స్థితి. ఇరువైపులా ఘనీభవించిన ఈ అవకాశవాదంతో నితీష్‌...మోడీ ప్రచారంపై ఆధారపడటం ఒకవైపు ఆయనను ముందుంచుతూనే తమ వ్యూహాలు సాగిస్తున్న బిజెపి నేతల చాణక్యం మరోవైపు బీహార్‌ రాజకీయాలను రక్తి కట్టిస్తున్నాయి. కేంద్రం ఆధీనం లోని నీతి ఆయోగ్‌ కూడా బీహార్‌ వెనకబడిపోయినట్టు లెక్కలు విడుదల చేసింది. జాతీయ నేరాల సంస్థ లెక్కలు కూడా అలాగే వున్నాయి.
వామపక్షాల పొత్తు
తేజస్వి యాదవ్‌ నాయకత్వంలో ఆర్‌జెడి, కాంగ్రెస్‌, వామపక్షాల సంఘటన మహాఘట్‌బంధన్‌కు ప్రచారంలో ప్రజాదరణ కనిపిస్తున్నది. సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్‌ మూడింటికీ బీహార్‌లో తమవైన కేంద్రాలు వున్నాయి. లాలూ తో కలసి పోటీ చేసిన సిపిఐ కి 1995లో అక్కడ 25 స్థానాలుండేవి. సిపిఎం భూ పోరాటాలలో లాలూ హయాం లోనే తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొని పునాదిని కాపాడుకున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో బీహార్‌లో ఎన్‌డిఎ ఓటమి దేశంలో లౌకిక శక్తుల పురోగమనానికి, బిజెపిని ఎదుర్కోవడానికి చాలా కీలకమని సిపిఎం భావిస్తున్నది. నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్న సిపిఎం రాష్ట్ర కమిటీ ఒక ప్రణాళికను కూడా విడుదల చేసింది. ఆర్‌జెడి కూటమి సీట్ల సర్దుబాటు త్వరగా పూర్తి చేసుకుని రంగంలోకి రావడం, వామపక్షాలు మొత్తం భాగస్వాములుగా వుండటం సానుకూల అంశంగా వుంది. తన వయసులో సగం కూడా లేని యువ నాయకుడైన తేజస్విపై నితీష్‌ పేరెత్తి మరీ దాడి చేయడం బట్టి పోటీని ఎంత తీవ్రంగా తీసుకుంటున్నారో తెలుస్తుంది. లాలూ ప్రసాద్‌ ఆటవిక పాలన నుంచి బీహార్‌ను విముక్తి చేసిన ఘనత నితీష్‌ ది అని చెప్పిన వ్యాఖ్యాతలు కూడా ఇప్పుడు సమర్థించలేకపోతున్నారు. నితీష్‌ను బాగా బలపర్చిన పాత్రికేయుడు రాజ్‌దీప్‌ సర్దేశాయి తాజాగా రాసిన వ్యాసం చూస్తే ఆయన స్థానం ఎంతగా దిగజారిందో తెలుస్తుంది. ఎన్‌డిఎ కూటమిపై జరిగే పోరాటంలో చిరాగ్‌ పాశ్వాన్‌ ఎల్‌జెపి, ఒవైసీ మజ్లిస్‌ నాయకత్వంలో ఏర్పడిన మరో కూటమి సైంధవ పాత్ర పోషిస్తున్నాయి. కాంగ్రెస్‌, ఆర్‌జెడి లు ఎన్‌డిఎను నిలవరించలేవనీ తామే ఓడిస్తామని విస్తారంగా పోటీలు పెట్టిన మజ్లిస్‌, బిఎస్‌పి కూటమి ఓట్ల చీలికకు కారణమవుతున్నది.
ఆశలు, అంచనాలు
నితీష్‌ కు మహిళల ఓటింగు పెట్టని కోట అని అంటున్నా ఈ కాలంలో ముజఫర్‌పూర్‌ మహిళాశ్రమంలో అత్యాచారాలపై సిబిఐ చార్జిషీటు మేరకు శిక్షలు పడటం సంచలనం కలిగించిన పరిణామం. ఇక మహిళా వికాస్‌ సమితిలో రెండు వేల కోట్లు, బి.సి ల అభివృద్ధి సమితి పేరిట జరిగిన మరో భారీ కుంభకోణం కుదిపేశాయి. టాయిలెట్ల కుంభకోణం, కుళాయిల కుంభకోణం రోత పుట్టించాయి. హథ్రాస్‌ అత్యాచారానికి ముందే ఏరియాలో దళిత బాలికపై అమానుషం జరగడమే గాక ఆమె తల్లిదండ్రులను జైలు పాలు చేయడం తీవ్ర నిరసనకు దారితీసింది. ఆ యు.పి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఇప్పుడు పాలక కూటమికి ప్రధాన ప్రచారాకర్షణగా మారడం దళిత వర్గాలను వెక్కిరిస్తున్నది. ఆర్‌జెడి పదిహేనేళ్ల పాలనలో పది లక్షల ఉద్యోగాలు కల్పించామంటే ఎగతాళి చేసిన బిజెపి తాము 19 లక్షల ఉద్యోగాలిస్తామని గొప్పగా వాగ్దానం చేయడం ఎలా చూడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ నిలదీసింది. బీహార్‌లో మిల్లుల మూతను నివారించి తగు చర్చలు తీసుకునే బదులు దేశానికే చౌకగా వలస కార్మికులను ఎగుమతి చేసే ఫ్యాక్టరీగా మారిందని నితీష్‌ నింద మూట కట్టుకున్నారు. లాక్‌డౌన్‌ కాలంలో వలస కార్మికుల సమస్య బీహార్‌నే ఎక్కువగా ప్రభావితం చేసింది. తిరిగి వచ్చిన వారు పని, తిండి లేక నానా పాట్లు పడాల్సి వచ్చింది. ఈ వాస్తవాలన్నీ ప్రజల దృష్టిలో వుండబట్టే ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ఇక చిరాగ్‌ పాశ్వాన్‌, మోడీని కీర్తిస్తూనే తనూ నితీష్‌కు వ్యతిరేకమన్నట్టు సాగించే ప్రచారం తికమక పెడుతున్నది. వీటన్నిటినీ అధిగమించి తామే విజయం సాధిస్తామనీ, నవంబరు 9న నితీష్‌ ఓడిపోతే 10న లాలూ బెయిలుపై విడుదల కానున్నారని తేజస్వి చెబుతున్నారు. తేజస్వి యువ నాయకత్వంపై ఆసక్తి పెరుగుతుండగా యువత నుంచి నితీష్‌ ప్రసంగాలకు డిజ్‌లైక్స్‌ పెరుగుతున్నాయని కొంతమంది పోల్చి చూపిస్తున్నారు. సిఎఎ వంటి సమస్యలపై ఆయన నోరు మెదపకపోవడం ప్రజాస్వామిక చైతన్యం గల బీహార్‌ ప్రజలకు మింగుడు పడటంలేదు. అందుకే మోడీ ప్రచారంలో కాశ్మీర్‌ సమస్య, చైనాతో ఉద్రిక్తతలో బీహార్‌ జవాన్ల పాత్ర వంటి అంశాలను లేవనెత్తి తనదైన జాతీయ వాదం జప్పించాలని చూస్తున్నారు. రాష్ట్రంలో అస్తవ్యస్త పాలనా పరిస్థితుల రీత్యా గత ఎన్నికల్లో పాకిస్తాన్‌ కార్డు విఫలమైనట్టే ఇవి కూడా విఫలం కావలసిందే. లాలూ పాలన బీహార్‌ను 'బిమారు' రాష్ట్రంగా మార్చిందంటున్న మోడీ పదిహేనేళ్లుగా తామే పాలిస్తున్న పరమ సత్యం మర్చిపోతున్నారు. ఇప్పుడు మతతత్వ రాజకీయాలు, హక్కులపై దాడి, కరోనా అనంతర సంక్షోభం, అత్యాచారాలు దేశాన్నే ఆవరించాయి. ఈ పరిస్థితులలో తొలి పరీక్షగా బీహార్‌ ఎన్నికలను చూడవలసి వుంటుంది. దీని తర్వాత బెంగాల్‌, యు.పి తదితర ఎన్నికలు వస్తాయి. జోస్యాలు, సర్వేలు ఎలా వున్నా గతంలో చాలాసార్లు చారిత్రిక పరిణామాలకు సాక్షిగా నిలిచిన పాటలీపుత్రం ప్రస్తుత తీర్పు ఎలా వుంటుందని దేశమంతా ఆసక్తిగా చూస్తున్నది. లౌకిక శక్తుల విజయం ఆశిస్తున్నది.