బీహార్‌లో ఎన్నికల తేది సమీపించేకొద్దీ చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నితీష్ నేతృత్వంలో పాలక ఎన్‌డిఎ కూటమికి ఆర్‌జెడి నాయకత్వంలో కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ఏర్పాటైన మహాఘట్‌బంధన్ గట్టి పోటీ ఇవ్వనుందన్న సంకేతాలు వెలువడుతుండటం మారుతున్న దేశ రాజకీయ ముఖచిత్రానికి అద్దం పడుతోంది. దీనికి తగ్గట్టుగానే మహాఘట్‌బంధన్‌లోని పార్టీలు, నేతలు ఇప్పటికే ఒక వ్యూహం ప్రకారం ప్రచార పర్వాన్ని ప్రారంభించి కొనసాగిస్తున్నారు. మోడీ, నితిష్‌ల వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకువెళ్తూ ప్రత్యామ్నాయాన్ని ఆవిష్కరిస్తున్నారు. అదేసమయంలో ప్రజల ముందు స్పష్టమైన ఎజెండాను ఉంచడంలో ఎన్‌డిఎ కూటమి విఫలమైంది. ఆ కూటమి నుండి బయటకు వచ్చిన చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్‌జనశక్తి పార్టీ(ఎల్‌జెపి) నితీష్‌ను ప్రధానంగా లక్ష్యం చేసుకోవడం, ఆయన పార్టీ జెడియు పోటీ చేసే స్థానాల్లోనే అభ్యర్థులను నిలుపుతుండటం, బిజెపిని పల్లెత్తిఒక్క మాట కూడా అనకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో నితిష్‌ను రాజకీయంగా దెబ్బకొట్టడానికి బిజెపి వ్యూహంలో భాగంగానే ఎల్‌జెపి విడిగా పోటీ చేస్తోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ గట్టిగా అనుకుంటే ఈ చీలికను నివారించడం పెద్ద కష్టమేమి కాదు. కానీ, సర్దుబాటు ప్రక్రియలో ఆశించినన్ని సీట్లను పొందలేకపోయిన బిజెపి నేతలు ఆ సీట్లలో జెడియు అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా ఎల్‌జెపిని బరిలోకి దించుతున్నారన్న వార్తలు నిజమేనని పిస్తున్నాయి.
గడిచిన ఐదు సంవత్సరాల్లో మొదటి రెండేళ్లు మినహా నితీష్ ఎన్‌డిఎతో చేయి కలిపి నడిచారు. అంతకుముందు పదేళ్ల కాలంలోనూ కొన్ని నెలలు మినహా ఎన్‌డిఎ కూటమి పాలనే ఆ రాష్ట్రంలో కొనసాగింది. ఇంత సుదీర్ఘకాలం పాలన సాగించినప్పటికీ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పడకేసింది. ప్రతిపక్షాలే కాదు, నీతి అయోగ్, నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల నివేదికల్లో సైతం ఇదే విషయం బట్టబయలవుతోంది. ప్రైవేటు ఏజెన్సీలు నిర్వహించిన అనేక సర్వేల్లోనూ విద్య,వైద్యం, ఆహార భద్రత, పౌష్టికాహారం, పరిశుభ్రత, ప్రజలందరికి ఇళ్లు, వ్యవసాయం-రైతు సంక్షేమం ఇలా అనేక అంశాల్లో నితీష్ సర్కారు పనితీరు అంతంతమాత్రమే అని తేలింది. కార్మికులపై కూడా ఈ కాలంలో పెద్ద ఎత్తున దాడి సాగింది. అసంఘటిత రంగంతో పాటు, సంఘటిత రంగంలోని కార్మికులపైనా అణచివేత విధానాలు కొనసాగాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు ఇన్ని అన్నీ కావు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంకానీ, రాష్ట్రంలోని నితీష్‌కుమార్ సర్కారుగానీ తమను విస్మరిచించిన తీరు పట్ల వీరు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. నానా కష్టాలు పడి సొంత రాష్ట్రానికి చేరినా అక్కడ కూడా ఆదరణ కరువవడంతో వీరు మండి పడుతున్నారు.
ఈ వైఫల్యాలన్నింటికి నితేషే బాధ్యుడన్నట్లుగా ఎల్‌జెపి నేతలు ప్రచారం చేయడం బిజెపి వ్యూహంలో భాగమే! ఎల్‌జెపి అధినేత చిరాగ్ పాశ్వాన్ తండ్రి, దళిత నేత రామ్‌విలాస్ పాశ్వాన్ ఇటీవల మృతి చెందడంతో సానుభూతి ఓట్లపైన కూడా ఆ పార్టీ నేతలు ఆశలు పెట్టుకుంటున్నారు. బిజెపికి ఉన్న తిమ్మిని బమ్మిని చేయగల సోషల్‌మీడియా బలగం గురించి, ధన బలం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని రకాల హంగులతో ఆ పార్టీ నేతలు మోహరించారు. నిష్పక్షపాతంగా
ఉండాల్సిన ఎన్నికల కమిషన్‌నుకూడా తమకు అనుకూలంగా వ్యవరించేటట్టు మోడీ సర్కారు ప్రభావితం చేస్తోంది. వీటన్నింటిని అధిగమించి బీహార్ ఓటరు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. క్షేత్రస్థాయి నుండి వస్తున్న సమాచారం అయితే, బిజెపి కపట వ్యూహాలను తిప్పికొట్టి వామపక్షాలతో ఉన్న మహాఘట్‌బంధన్‌కు జై కొట్టనున్నారనే..! తద్వారా బిజెపిని చిత్తు చేయగలమన్న విశ్వాసం దేశ ప్రజలకు కలుగుతుంది.










