Aug 18,2022 11:11

పాట్నా : బీహార్‌లో కొత్తగా ఏర్పడిన 'మహాఘట్‌ బంధన్‌' ప్రభుత్వం వచ్చే ఏడాది లేదా రెండేళ్లలో 5 నుండి 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే.. తన 'జన్‌ సూరజ్‌ అభియాన్‌' ఉపసంహరించుకుంటానని ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. అదే చేస్తే.. నితీష్‌ కుమార్‌ ప్రభుత్వానికి పూర్తి మద్దతునిస్తానని అన్నారు. బుధవారం సమస్తిపూర్‌లో తన మద్దతుదారులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఆర్‌జెడి-జెడియు-కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజల మద్దతు లభించడం లేదని అన్నారు. 'సిఎం పదవి కోసం నితీష్‌ కుమార్‌ ఫెవికాల్‌ వాడుతున్నారు. మిగతా పార్టీలు దాని చుట్టూ తిరుగుతున్నాయి' అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బిజెపితో తెగతెంపులు చేసుకుని.. ఆర్‌జెడితో జెడియు తిరిగి జతకట్టిన సంగతి తెలిసిందే. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్‌ మాట్లాడుతూ.. 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నెరవేరుస్తామని అన్నారు. నితీష్‌ కుమార్‌ కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో ఇదే రకమైన వాగ్దానం చేశారు. గతంలో నితీష్‌కు సన్నిహితంగా మెలిగిన ప్రశాంత్‌ కిశోర్‌.. ప్రాంతీయ సంబంధాలను ఏర్పరుచుకోవడానికి, బీహార్‌ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని, సాధ్యమైన పరిష్కారాలను అందించేందుకు జన్‌ సూరజ్‌ అభియాన్‌ను ప్రారంభించిన సంగతి విదితమే.