Aug 12,2022 13:28

న్యూఢిల్లీ : బీహార్‌లో అనూహ్యంగా అధికార మార్పిడి చోటుచేసుకుంది. బిజెపి భాగస్వామ్యానికి గుడ్‌బై చెప్పిన జెడియు అధినేత నితీశ్‌ కుమార్‌.. పాత స్నేహితుడు ఆర్జేడీతో జతకట్టి.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే బిజెపికి నితీశ్‌ కటీఫ్‌ చెప్పడానికి కారణం.. ఆయనకు ప్రధాని పదవిపై మోహం ఉందని, అందుకే ఉపరాష్ట్రపతి పదవి ఇస్తానన్నా వద్దన్నారన్న వార్తలు వినిపించాయి. దీనిపై ఆయన్ను ప్రశ్నించగా.. ప్రధాన మంత్రి అవాలన్న ఆశ తన మనస్సులో ఏ కోశాన లేదని ఖరాఖండిగాచెప్పారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నానని, అందరూ కలిసి పనిచేయాలని అన్నారు. ఆగస్టు 10న బీహార్‌ ముఖ్యమంత్రిగా ఎనిమిదో సారి ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్‌ కుమార్‌.. తదుపరి ఎన్నికలనుద్దేశించి ప్రధాని మోడీపై ధ్వజమెత్తారు. '2014లో గెలిచాడు, కానీ 2024లో వస్తాడా?' అంటూ ప్రశ్నించారు. ప్రధాని అభ్యర్థిగా ఉండాలనుకుంటున్నారా అన్న ప్రశ్నకు.. తాను దేనీకి పోటీదారుని కాదని వ్యాఖ్యానించారు.