Nov 14,2021 07:42

'పాపం పుణ్యం ప్రపంచ మార్గం/ కష్టం సౌఖ్యం శ్లేషార్ధాలూ/ ఏమీ ఎరుగని పూవుల్లారా/ ఆకసమున హరివిల్లు విరిస్తే/ అవి మీకే అని ఆనందించే/ కూనల్లారా' అంటూ బాలలను ముద్దు చేస్తాడు మహాకవి శ్రీశ్రీ. కష్టసుఖాలు ఎన్నున్నా సంపూర్ణ ఆరోగ్యంతో... విజ్ఞానవంతులు కావాలి బాలలు. వారు దేశ భవితకు వనరులు... వారధులు... ఆశాదీపాలు. వారి శ్రేయస్సే దేశాభివృద్ధికి మూలం. అందుకే అంటారు... 'నేటి బాలలే రేపటి పౌరులు' అని. బాల్యాన్ని ఆనందంగా... ఆరోగ్యవంతంగా అనుభవించడం ప్రతి చిన్నారి జన్మహక్కు. ఎవరికైనా బాల్యం ఒక అందమైన జ్ఞాపకం. 'స్వచ్ఛమైన పువ్వులు/ విచ్చుకున్న బంధాలు/ పెంచుకున్న అనుబంధాలు/ చిన్ననాటి జ్ఞాపకాలు' అని ఓ కవి అంటాడు. మనిషి వ్యక్తిత్వం బాల్యాన్ని పెనవేసుకునే వికసిస్తుంది. మనిషిగా ఎంత ఎదిగినా... బాల్యపు జ్ఞాపకాలు... అనుభవాలు అప్పుడప్పుడు తట్టి లేపుతూనే వుంటాయి. అమ్మ లాలిపాట, గోరుముద్దలు, నాన్న మురిపెం, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల గారాబాలు... అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, అత్తామామల ప్రేమానురాగాల మధ్య బాల్యం ఆనందంగా గడిచిపోతుంది. అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. తిరిగిరాని బాల్యాన్ని తలచుకొని 'నా సర్వస్వం నీకిచ్చేస్తా... నా బాల్యం నాకు ఇచ్చెరు' అంటాడు సినారె. బాల్యం అంటే... రంగురంగుల అనుభూతులే కాదు... మింగుడుపడని విషాదాలూ వుంటాయి. తన ప్రమేయం లేకపోయినా అనుభవించక తప్పని కష్టాలూ వుంటాయి.
     చిట్టిచిట్టి చేతుల చిన్నారులు బాల కార్మికులవుతున్నారు. ఆడిపాడాల్సిన వయస్సులో నాలుగు గోడల మధ్య బందీ అవుతున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో విజ్ఞానవంతులు కావాల్సిన పిల్లలకు తగిన ఆదాయాలు లేక తల్లిదండ్రులు పౌష్టికాహారం అందించలేకపోతున్నారు. గర్భస్థ శిశువు నుండే అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. తక్కువ బరువుతో పుట్టడం, అంగవైకల్యంతో పుట్టడం వంటి కారణాల వల్ల వీరు మిగతా పిల్లలతో సమానంగా వుండలేకపోతున్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపాలు, వయసుకు తగిన బరువు లేకపోవటం, శిశు మరణాల రేటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న 'ప్రపంచ ఆకలి సూచీ-2021'లో... 107 దేశాలతో పోల్చితే మన దేశం 94వ స్థానంలో వుంది. దేశంలోని ప్రజల ఆదాయం, ఆర్థిక అసమానతలు వంటి అంశాలను లెక్క తీసుకుంటే... 'ప్రపంచ ఆహార భద్రత సూచీ-2021'లో 113 దేశాలతో కూడిన ఈ జాబితాలో మనం 71వ స్థానంలో వున్నాం. చిన్నతనంలో ఎదుర్కొనే సమస్యలు పిల్లల భవిష్యత్‌పై ప్రభావం చూపుతాయని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విద్య, ఆరోగ్యం, గృహవసతి, పోషకాహారం, పారిశుధ్యం, నీరు అందుబాటులో లేని పిల్లల సంఖ్య 120 కోట్లు ఉండగా, కోవిడ్‌ కారణంగా మరో 15 కోట్ల మంది అదనంగా యునిసెఫ్‌ అధ్యయనం వెల్లడించింది. బాలల జనాభా అత్యధికంగా గల భారత్‌లో కూడా దీని ప్రభావం భారీగానే వుంటుందని ఈ నివేదిక నొక్కి చెబుతోంది.
     అమ్మమ్మ, నానమ్మ ఇళ్లల్లో ఆటపాటల మధ్య సాగిపోయే బాల్యం... నేడు ఒంటరిపాలైంది. కుంచించుకుపోయిన కుటుంబ వ్యవస్థలో... ఇరుకు ఇళ్ళలో... పలకరింపులు కూడా మరిచి, ప్రపంచీకరణ వలలో చిక్కుకుపోయిన తర్వాత అందమైన బాల్యం, బాల్య స్నేహాల బంధమెక్కడిది? ప్రభుత్వాలు రుద్దిన ఆర్థిక భారాలతో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి అనివార్యంగా ఏర్పడింది. పిల్లల మంచిచెడ్డలు చూడడమూ కష్టతరమౌతోంది. ఏ బిడ్డకైనా తల్లి తొలి గురువు. తల్లిదండ్రులతో పాటు పెద్దలు నేర్పిన నీతి, బాధ్యతలు మంచి పౌరులుగా ఎదగడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ జరగాలంటే ప్రభుత్వాలు కనీస మౌలిక వసతులను కల్పించాలి. ఆహ్లాదకరమైన వాతావరణం... మౌలిక వసతులు కల్పించడం మన బాధ్యత. 'బాల బాలికలందరికీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా చదువు నేర్పాలి. బాలబాలికలు పని చేసే పద్ధతిని నిర్మూలించాలి. అలాంటి ఒక సుహృద్భావ వాతావరణంలో పిల్లలు ఎదగాలి. 'మీదే మీదే సమస్త విశ్వం/ మీరే లోకపు భాగ్యవిధాతలు/ మీ హాసంలో మెరుగులు తీరును/ వచ్చేనాళ్ల విభాప్రభాతములు' అంటాడు శ్రీశ్రీ. చిన్నారుల మోమున హాసం మెరిసినప్పుడే నిజమైన 'బాలల దినోత్సవం'.