Mar 13,2022 07:15

అయోధ్యలో రామమందిర నిర్మాణ ప్రచారానికి తోడు వారణాసిలో మోడీ విశ్వేశ్వరాలయ విస్తరణ పనులు ఎంత భారీ ప్రచారంతో ప్రత్యక్ష ప్రసారంతో చేసిందీ చూశాం. ఈ ఎన్నికలు 80-20 శాతం మధ్య జరుగుతున్నాయని యోగి పరోక్షంగా హిందూ ముస్లిం పోరాటంగా చెప్పనే చెప్పి తర్వాత ఏదో సమర్థించుకున్నారు. సకల సంస్థల ప్రైవేటీకరణ విధానాలతో కార్పొరేట్ల ఆర్థిక మద్దతు అంగబలం, బడామీడియాను ప్రలోభాలతో ఒత్తిళ్లతో లోబర్చుకుని అనుకూల ప్రచారానికి వాడుకోవడం ఇవన్నీ బిజెపికి కలిసొచ్చాయి బిజెపికి గెలుపులో సాసుకూల కోణంలో ఒకే అంశం ఉచిత రేషన్‌. కరోనాను ఎదుర్కోవడంలో యోగి సర్కారు ఘోరవైఫల్యం దేశాన్ని ప్రపంచాన్ని కూడా ఆందోళనపరిచింది. వలస కార్మికుల వెతలు కదిలించాయి.

భారత రాజకీయాలలో ఇంకా మతవాద- మితవాద రాజకీయాల ప్రాబల్యం కొనసాగుతున్నదని ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు మరోసారి నిరూపించాయి. హోలీ ముందుగానే వచ్చిందని ఆ శక్తులు పండగ చేసుకోడంలో ఆశ్చర్యం లేదు. దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌లలోనూ బిజెపి అధికారం నిలబెట్టుకుంది. మరీ ముఖ్యంగా యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అయిదేళ్లుపూర్తి చేసుకుని మళ్లీ ఎన్నికయ్యారంటే అది మూడున్నర దశాబ్దాలలోనే మొదటిసారి. ఆ యోగి అయోధ్య రామమందిరం వివాదానికి కేంద్రబిందువైన గోరఖ్‌పూర్‌ మఠాధిపతి కావడం బిజెపి సంఘ పరివార్‌ రాజకీయాలకు కచ్చితమైన ఉదాహరణ. ఆయన హయాంలో యుపిలో మతతత్వ రాజకీయాలు పరాకాష్టకు చేరాయి. హత్రాస్‌, ఉన్నావ్‌, లఖింపూర్‌ ఖేరీ వంటి అత్యాచారాలు హత్యలు జరిగాయి. గోమాంసం పేరిట ప్రాణాలు తీసిన ఘటనలు దేశాన్ని కుదిపేశాయి. ఆర్థికాభివృద్ధిలో దేశంలోనే అట్టడుగున యుపి వుందని వారి ఆధ్వర్యంలోని నీతి ఆయోగ్‌ ప్రకటించింది. కరోనాను ఎదుర్కోవడంలో ఘోరవైఫల్యం ప్రపంచాన్ని కలవరపర్చింది. గంగానదిలో శవాలు తేలడం గగుర్పాటు పుట్టించింది. ఇలాటి ఘోరాలు ఎన్ని జరిగితేనేం? యోగి శాంతి భద్రతలను కాపాడిన యోధుడుగా బడామీడియా హోరెత్తించింది. యుపిలో యోగి గెలిస్తేనే రేపు కేంద్రంలో నరేంద్రమోడీ మూడోసారి ప్రధాని కాగలరని హోం మంత్రి అమిత్‌షా స్వయంగా ప్రకటించారు. ఆయనను ప్రధాని అభ్యర్థిగా చూడడం సహజమన్నారు. ఈ ఫలితాల తర్వాత ప్రధాని విజయోత్సవ ప్రసంగం యుపి మహాకథనం కొనసాగింపే. 2017లో యుపిలో గెలిచినప్పుడే 2019లో తమ విజయం ఖాయమైందని జ్ఞానులు అన్నారనీ, ఇప్పుడు కూడా అదే పునరావృతమవుతుందని ఆయన ప్రకటించారు. ఈ ఫలితాల చుట్టూ బిజెపి సంఘపరివార్‌ వ్యూహం ఎలా వుండేది అర్థం కావడానికి ఒక సంకేతమిది.
బిజెపి విజయానికి మరోవైపు..
       అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ చెప్పినట్టు బిజెపి కీలక విజయంసాధించినా యాభై వరకు స్థానాలు తగ్గాయి.యుపి నుంచి ఏర్పడిన ఉత్తరాఖండ్‌లో బిజెపి ఊహించినదానికి మించి విజయం సాధించినా బెంగాల్‌లో మమతాబెనర్జీలాగే ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ దామిఓడిపోయారు. యుపిలోనూ ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్‌మౌర్య సహా 11మంది మంత్రులు ఓడిపోయారు.మరోవంక సమాజ్‌వాది పార్టీ పదిశాతం ఎక్కువగా 32శాతం ఓట్లు సాధించి రెండున్నర రెట్లు సీట్లు పెంచుకోగలిగింది. నలభైóై స్థానాలలో కేవలం అయిదువేల లోపు ఓట్ల తేడా. అదే సమయంలో2007-12మధ్య పాలన సాగించిన మాయావతి బిఎస్‌పి అన్నిచోట్లాపోటీ చేసి ఒక్క స్థానానికి 12.7 ఓట్ల శాతానికి క్షీణించింది.ప్రియాంక గాంధీ ప్రచారార్భాటం కాంగ్రెస్‌ను గట్టెక్కించలేకపోగా 2.4 శాతం ఓట్ల దగ్గరే ఆగిపోయింది.93 స్థానాల్లో పోటీ చేసిన ఒవైసీ మజ్లిస్‌ ఒక్కశాతం ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయింది. ముస్లింలు అత్యధికంగా సమాజ్‌వాదికే ఓటు చేశారు. ములాయం క్రియాశీల జోక్యం తగ్గినా, అఖిలేష్‌ బిజెపికి కొత్త సవాల్‌దారుగా ముందుకొచ్చారనే అంచనా బలపడింది. ఆయన కూడా ముందునుంచి రంగంలోకి దిగి సమగ్రవ్యూహంతో వ్యవహరించి వుంటే,బిజెపి వ్యతిరేక శక్తులన్నిటినీ కలుపుకొని లౌకిక తత్వం కోసం గట్టిగా పోరాడితే మరింత మెరుగైన ఫలితాలు సాధ్యమై ఉండేవి. ట్విట్టర్‌ నేత అనిపించుకున్న తర్వాత మళ్లీ విజయరథయాత్రతోనే అఖిలేష్‌ ఎన్నికలకు ఏడాది ముందు జనంలోకి వచ్చారు. ఎస్‌పినే ప్రధాన ప్రత్యర్థిగా చూసిన మాట్టాడిన మాయావతి బిజెపిపె రాజకీయ సైద్ధాంతిక పోరాటం దాదాపు చేపట్టలేదు. ఈ రెండు పార్టీలనూ కులంపై ఆధారపడినవిగా విమర్శించిన బిజెపి వాస్తవంలో తన హిందూత్వ వ్యూహాలను తీవ్రంగా అమలు చేయడమేగాక కులాల వారి పొందికల విషయంలోనూ చాలా జాగ్రత్త పడింది. రైతాంగ ఉద్యమం పశ్చిమ యుపిలో బాగా ప్రభావం చూపిస్తుందన్న అంచనాలు నిజమై ఆర్‌ఎల్‌డి తగు సంఖ్యలో స్థానాలు తెచ్చుకోవడమే గాక జయంత్‌ చౌదరి నాయకుడుగా స్థిరపడ్డారు. గత శాసనసభలో అతి తక్కువగా 24 మాత్రమే వున్న ముస్లిం ఎంఎల్‌ఎల సంఖ్య ఇప్పుడు 37కు పెరిగింది. వీరంతా ఎస్‌పి,ఆర్‌ఎల్‌డిల తరపున నెగ్గిన వారే.
        బిజెపి ఘన విజయాన్ని కొనియాడే శక్తులూ మోడీ, షాలకు యోగి ఆదిత్యనాథ్‌ తోడైనారని త్రిమూర్తులుగా కీర్లించడం ఎలాగూ జరుగుతున్నది. తీవ్రమైన మెజారిటేరియనిజం అంటే హిందువులే పాలించాలన్న హిందూత్వ రాజకీయం ముస్లిం వ్యతిరేకత షరామామూలుగా నడిచాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణ ప్రచారానికి తోడు వారణాసిలో మోడీ విశ్వేశ్వరాలయ విస్తరణ పనులు ఎంత భారీ ప్రచారంతో ప్రత్యక్ష ప్రసారంతో చేసిందీ చూశాం. ఈ ఎన్నికలు 80-20 శాతం మధ్య జరుగుతున్నాయని యోగి పరోక్షంగా హిందూ ముస్లిం పోరాటంగా చెప్పనే చెప్పి తర్వాత ఏదో సమర్థించుకున్నారు. సకల సంస్థల ప్రైవేటీకరణ విధానాలతో కార్పొరేట్ల ఆర్థిక మద్దతు అంగబలం, బడామీడియాను ప్రలోభాలతో ఒత్తిళ్లతో లోబర్చుకుని అనుకూల ప్రచారానికి వాడుకోవడం ఇవన్నీ బిజెపికి కలిసొచ్చాయి బిజెపికి గెలుపులో సాసుకూల కోణంలో ఒకే అంశం ఉచిత రేషన్‌. కరోనాను ఎదుర్కోవడంలో యోగి సర్కారు ఘోరవైఫల్యం దేశాన్ని ప్రపంచాన్ని కూడా ఆందోళనపరిచింది. వలస కార్మికుల వెతలు కదిలించాయి. బిజెపి కేంద్ర మంత్రులు ప్రజా ప్రతినిధులు కూడా విమర్శ చేశారు. అయితే, మలిదశలో యోగి పేద కుటుంబాలలో ప్రతి వ్యక్తికి అయిదు కిలోల ఉచిత రేషన్‌ ఇచ్చారు, దాంతోపాటే తక్కువ ధరలకూ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరుకులు అందజేశారు. ఇది బాగానే ప్రభావం చూపిందని సర్వేలలోనూ నిరూపితమైంది. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి గనక వాటిని నిలిపేస్తారా అనే సందేహాలు కూడా వున్నాయి. స్త్రీలు ఎక్కువగా ఓటేశారని, ఎస్‌పి బిఎస్‌పిల సంఘ వ్యతిరేకశక్తులను అణచిశారనేే అభిప్రాయం విజయానికి కారణమైందని చెబుతున్నారు. బీహార్‌లో లాలూప్రసాద్‌ ఆర్జేడీలపైన కూడా ఇదే ప్రచారం నడిచేది. బిజెపి ఎంపిలు కూడా అత్యాచారం కేసులలో హత్యలలో చిక్కుకుపోవడం అసత్యం కాదు. అయినా ఇతరులపైనే సాగిన ఏకపక్ష చిత్రణ పనిచేసిందన్నమాట. బిజెపి వ్యతిరేక కూటమి గురించి ప్రాంతీయ నేతలు జోరుగా మాట్లాడినా అతి కీలకమైన యుపిలో ఓట్ల చీలిక నివారించడానికి కనీసం తగ్గించడానికి ప్రయత్నించలేదు. ఫలితాల తర్వాత మాయావతి అఖిలేష్‌ ప్రియాంకలలో ఎవరూ ఆ సత్యాన్ని గుర్తిస్తున్నట్టు మాట్లాడలేదు.
ఆప్‌ ఘన విజయం, కేజ్రీ తీరుతెన్నులు
       పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అఖండ విజయం 117లో 92 స్థానాలు సాధించి పాలక పక్షమైన కాంగ్రెస్‌, అకాలీదళ్‌లను తుడిచిపెట్టడం మరింత ప్రచారం పొందింది. రైతాంగ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన పంజాబ్‌లో బిజెపి వూసులేకుండా పోయింది.. తన ప్రాణాలు తీసే ప్రయత్నం జరిగిందంటూ ప్రహసనం నడిపినా మోడీ మంత్రం పనిచేయలేదు. బిజెపితో తెగతెంపులు చేసుకున్న అకాలీదళ్‌ను కూడా ఆదరించలేదు. ఏమైనా సరైన ప్రత్యామ్నాయ రాజకీయ పక్షం వున్నచోట ప్రజలు ఆదరిస్తారనడానికి పంజాబ్‌ ఫలితాలే ఉదాహరణ. ఒక ప్రాంతీయ పార్టీ రెండు రాష్ట్రాలలో అధిóకారానికి రావడం ఇదే మొదటిసారి. 2017లో 20 స్థానాలు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా వచ్చిన ఆప్‌ ఎప్పటినుంచో పంజాబ్‌ను తదుపరి లక్ష్యంగా చేసుకుంది.దీర్ఘకాలంగా పాతుకుపోయిన రెండు సంప్రదాయ పార్టీల స్థానే నూతనత్వంతో కూడిన ఆప్‌ను ఓటర్లు ఘనంగా గెలిపించడం అర్థం చేసుకోదగిందే. గోవాలోనూ ఆప్‌కు స్థానాలు వచ్చాయి గనక ఇక మరో రాష్ట్రంలో వస్తే జాతీయ హోదా లభిస్తుందని లెక్కలు వేస్తున్నారు. ఇందుకోసం గుజరాత్‌, హిమచల్‌ ఎన్నికలపై దృష్టి పెడతామంటున్నారు. ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు లేకపోవడం, వైద్యం వంటి పౌరసదుపాయాల కల్పనలో మంచి ఫలితాలు సాధించడం పంజాబ్‌ ప్రజలు దాన్ని ఎంచుకునేలా చేశాయి. ఆప్‌ రైతాంగ ఉద్యమం సమయంలో సానుకూల వైఖరి తీసుకుంది గాని బిజెపి మతతత్వాన్ని అంత గట్టిగా వ్యతిరేకించడంలేదనే అభిప్రాయం వుంది.గత కొద్ది మాసాలలోనూ కేజ్రీవాల్‌ మోడీ పేరెత్తిందే తక్కువ.పైగ్‌ా గుళ్లు గోపురాలు తిరుగుతూ తను కూడా హిందూత్వ అనుకూలమనే సంకేతాలివ్వడానికి ప్రయత్నిస్తున్నారు. పంజాబ్‌ విజయోత్సవ ప్రసంగంలోనూ హనుమాన్‌ గుడికి వెళ్లివచ్చినట్టు చెప్పడమే గాక బిజెపి తరహాలో భారత్‌మాతాకి జై నినాదానికి ప్రాధాన్యమిచ్చారు.ఆప్‌ ప్రధానంగా కాంగ్రెస్‌ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఆ శూన్యంలో తను ప్రవేశిస్తున్నదని,బిజెపికి కూడా అది అంత అభ్యంతరంగా లేదని అంటున్నారు. ఈ ఫలితాల తర్వాత ఆప్‌ను అభినందించి సహకారం ఇస్తామని మోడీ ప్రకటించగా కేజ్రీ ధన్యవాదాలు చెప్పారు.శరద్‌పవార్‌ మినహా తక్కిన ప్రతిపక్ష నాయకులు ముఖ్యమంత్రులు పెద్దగా అభినందించలేదు.భగవంత్‌మాన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్తిగా ప్రకటించకముందు ఆయనే వెళతారనే వూహలు కూడా వినిపించేవి. ఢిల్లీ కన్నా పంజాబ్‌ పెద్దది, ఎక్కువ అధికారాలు గల ప్రభుత్వం గనక కేజ్రీవాల్‌ ఎలా సమన్వయం చేస్తారనేది కూడా చూడవలసి వుంటుంది.గోవాలో కాంగ్రెస్‌ వారిని చేర్చుకుని తనే ప్రత్యామ్నాయంగా వస్తానని ప్రకటించుకున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీ ఆశలు కూడా ఫలించలేదు.
కాంగ్రెస్‌ కకావికలు
          అందరికన్నా ఘోరంగా దెబ్బతిన్నది కాంగ్రెస్‌. ప్రియాంకగాంధీ ఎంతగా ఆరాటపడినా గత కొన్నేళ్లుగా క్రమేణా క్షీణిస్తున్న ఆ పార్టీయుపిలో సఫలం కాలేకపోయింది.. ఉత్తరాఖండ్‌లో బిజెపిపై అసంతృప్తి వున్నా కాంగ్రెస్‌ ఓటమిపాలైంది. గతంలోగోవా,మణిపూర్‌లలో గతంలో ఏకైక పెద్ద పార్టీగా వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేక బిజెపికి అప్పగించిన ఆ పార్టీ ఈసారి ముందే ఓడిపోయింది.గోవాలో 40 స్థానాలకు గాను కేవలం 12 తెచ్చుకోగా,బిజెపికి ఇరవై దక్కాయి.మణిపూర్‌లో ఇంకా ఘోరంగా 40కి రెండే వచ్చాయి.గెలుపు లెక్కలేసుకున్న ఉత్తరాఖండ్‌లో బిజెపికి 48రాగా కాంగ్రెస్‌ 18 దగ్గరే ఆగిపోయింది. పంజాబ్‌నైనా నిలబెట్టుకుంటే దేశ రాజకీయాలలో ఆ పార్టీకి గౌరవం దక్కుతుందనుకున్నారు గాని అక్కడ 70లో 19 మాత్రమే దక్కాయి.అమరీందర్‌ సింగ్‌ను మార్చి దళితనేత చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీని గడ్దెక్కించినా రిజర్వుడు స్థానాలు ఆప్‌కే అత్యధికంగా వచ్చాయి.ఈ ఫలితాల తర్వాత కాంగ్రెస్‌లో జి23 అనే తిరుగుబాటు నేతలు స్వరం పెంచారు. గాంధీ కుటుంబంచుట్టూనే తిరుగుతుంటే ఉన్న పునాది కూడా పోతుందని తీవ్ర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ను వదిలేయాలని మమత పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ తన సముచిత పాత్ర నిర్వహించకుండా అడ్డుకుంటున్నదెవరనిసీతారాంఏచూరి ఫలితాలకు ముందే ప్రశ్నించారు.
ఫ్రంట్‌లు, ప్రాంతీయ నేతలు
         ఇక కెసిఆర్‌, మమత,కేజ్రీవాల్‌ వంటివారిలో ఎవరు మోడీకి ప్రత్యామ్నాయం తీసుకువస్తారనే చర్చ మీడియాలో మొదలైంది. కెసిఆర్‌ వెనకడుగు వేస్తారని కేజ్రీవాల్‌ అవకాశాలు పెరుగుతాయని మరోవైపు కథనాలు వస్తున్నాయి.్‌ తమ ఫ్రంట్‌ ఎలావుంటుందో ఇంకా స్పష్టత రావాలని కెసిఆర్‌ ముందే ప్రకటించారు.ఈ ఫలితాలు వచ్చిన సమయంలోనే ఆయన అస్వస్తతకు గురైనారు గేనక వారం రోజుల విశ్రాంతిలో మాట్లాడేది వుండదు.ఒరిస్సాలో నవీన్‌ పట్నాయక్‌,ఎపిలో జగన్‌మోహనరెడ్డి(చంద్రబాబునాయుడు కూడా)బిజెపికి వ్యతిరేకంగా ముందుకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు కర్ణాటక మినహా దక్షిణాది రాష్ట్రాలలో నామమాత్రంగా వున్న బిజెపి యుపిని చూపి ఎపిలో లేదా తెలంగాణలో గెలిచేస్తానని హడావుడి చేయడం హాస్యాస్పదం.కేజ్రీవాల్‌ ఆప్‌ పంజాబ్‌లో సాధించింది మంచి విజయమైనా దాన్నిబట్టి అయన దేశవ్యాపిత శక్తిగా మోడీకి ప్రత్నామ్నాయంగా వచ్చేస్తారనడం అవాస్తవికతే.యుపితో సహా నాలుగుచోట్ల పనిచేసిన మోడీ మంత్రం పంజాబ్‌లో విఫలమైనప్పుడు అక్కడ ఒకచోట గెలిచినంతమాత్రాన కేజ్రీ దేశమంతా గెలిచేస్తారని చెప్పడం అతిశయోక్తి.గతంలోఆ ప్రయత్నం చేసి దెబ్బతిన్నారు కూడా. అలాటి సమగ్ర విధానం ఇప్పుడైనా ఆయన ప్రకటించలేదు.మోడీ అన్నట్టు 2022 ఎన్నికలతోనే బిజెపికి 2024 విజయం వచ్చిందని చెప్పడానికి లేదు.అప్పటికి చాలా పరిణామాలు చూడాల్సి రావచ్చు.ఏది ఏమైనా బిజెపి కూటమి మతతత్వ కార్పొరేట్‌ రాజకీయాల సవాలు తీవ్రంగా కొనసాగుతుందనడం నిస్సందేహం.కేంద్ర రాష్ట్రాలలో ఆ ప్రజా వ్యతిరేక అనర్థక విధానాలను ఎదుర్కోవాలంటే ే వామపక్షాలు ప్రజాస్వామిక శక్తులు మరింత ఉధృతంగా కృషి చేయవలసి వుంటుంది. తగిన వ్యూహాలను విస్త్రత రాజకీయ సైద్ధాంతిక ప్రచారాన్ని చేపట్టవలసి వుంటుంది.ి్ట కేంద్రంలో బిజెపి మరోసారి వస్తుందా లేక ఇంకేదైనాకూటమికి అవకాశం లభిస్తుందా అన్నది 2024లోక్‌సభ ఫలితాల తర్వాతే తేలుతుంది.

                     అయిదు రాష్ట్రాలు-అనేక సంకేతాలు                   -      తెలకపల్లి రవి