Sep 09,2023 22:57

మాట్లాడుతున్న సామినేని ఉదయభాను


ప్రజాశక్తి - విజయవాడ : గత చంద్రబాబు పాలన అవినీతికి కేరాఫ్‌ అని, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరిట రూ.371కోట్లు ప్రభుత్వ ధనంను షెల్‌ కంపెనీల పేరిట దోచుకున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు నివాసంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేంలో ఆయన మాట్లాడారు. బాబు జమానా.. అవినీతి ఖజానా అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంతగా దిగజారిపోయి ఇన్ని కోట్ల రూపాయలను షెల్‌ కంపెనీల పేరిట దోచుకోలేదని అన్నారు. బాబొస్తే జాబోస్తుందంటూ నినాదం పేరిట అవినీతి, అమరావతి రాజధాని పేరిట స్కాం చేయటం చంద్రబాబు కే చెల్లిందన్నారు. అమరావతిలో కాంట్రాక్టులు, మౌలిక సదుపాయాల కాంట్రాక్టుదారుల నుంచి సైతం ముడుపులు అందుకున్న ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు దోపిడీకు జనసేన నాయకులు పవన్‌ కళ్యాణ్‌, సీపీఐ కేంద్రనాయకులు నారాయణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి రాజకీయ కక్ష అంటూ ముసుగు వేసి అండగా ఉంటున్నారని ద్వజమెత్త్రారు. నీతి నిజాయితీ లేనిచంద్రబాబుకు ఏ విధంగా మద్దతు ఇస్తున్నారని జనసేన, సీపీఐ, బీజేపీ లను ప్రశ్నించారు.
నేడు ఎన్టీరామారావు ఆత్మ శాంతించిన రోజు
జగ్గయ్యపేట : ఇప్పటివరకు పలు కేసుల్లో స్టేలు తెచ్చుకొని పబ్బం గడుపుతున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇక స్టేలు తెచ్చుకునే సీజన్‌ పోయిందని, ఆయన పాపం పండిందిక ఆయనను కాపాడేవారు ఎవరూ లేరని నిజంగా నేడు ఎన్టీ రామారావు ఆత్మ శాంతించిన రోజు అని ప్రభుత్వవిప్‌, శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు. పట్టణంలోని నియోజకవర్గ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వవిప్‌, ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యులు సామినేని ఉదయభాను శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఉదయభాను మాట్లాడుతూ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో 550 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిన ప్రధాన నిందితుడైన చంద్రబాబును అరెస్టు చేయడం అక్రమమేమి కాదని, అత్యంత ఆవశ్యకం అని అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన స్కిల్‌ డెవలప్మెంట్‌ విభాగానికి సంబంధించి 550 కోట్ల రూపాయలు స్కామ్‌లో ప్రభుత్వానికి 371 కోట్ల రూపాయలు నష్టం కలిగించిన A1 ముద్దాయి చంద్రబాబు నిజ స్వరూపం బట్టబయలైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెడిసిసి మాజీ చైర్మన్‌ తన్నీరు నాగేశ్వరావు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ తుమ్మల ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు అరెస్టు
పారదర్శకం.. ఎంఎల్‌ఎ
ప్రజాశక్తి - నందిగామ : చంద్రబాబు అవినీతి చేశారు కాబట్టే అరెస్టు అయ్యారని నందిగామ ఎంఎల్‌ఎ మొండితోక జగన్‌ మోహన్‌రావు పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుపై ఎంఎల్‌ఎ శనివారం మీడియాతో మాట్లాడుతూ స్కిల్‌ డెవలప్మెంట్‌ నిధులను షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేసి దోచుకున్న కేసులో సిఐడి దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందన్నారు. పూర్తి ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్‌ చేశారని తెలిపారు.