భువనగిరి : ఇటీవల టిపిసిసి అధ్యక్షుడిగా తనను కాదని రేవంత్‌రెడ్డిని నియమించడంతో ఆవేదన చెంది ఆ వ్యాఖ్యలు చేశానని ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల రేవంత్‌ను టిపిసిసి అధ్యక్షుడిగా నియమించగానే.. కోమటిరెడ్డి 'ఓటుకు నోటు కేసు మాదిరిగానే పిసిసి ఎన్నిక జరిగినట్లు తనకు ఢిల్లీ వెళ్లాక తెలిసింది' అంటూ కోమటిరెడ్డి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై ఆయన నేడు వివరణ ఇచ్చారు. తనకు పిసిసి పదవి రాలేదన్న ఆవేదనతోనే అలా మాట్లాడానన్నారు. సీనియర్ నేతగా మాట్లాడానే తప్ప వేరే ఉద్దేశం లేదన్నారు. వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా భువనగిరిలో వైఎస్‌ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 'చాలా పార్టీల నుంచి నాకు ఆహ్వానాలు అందాయి. ఏ పార్టీలో చేరను. కాంగ్రెస్‌లోనే కొనసాగుతా. పార్టీలో గ్రూపు రాజకీయాలు చేస్తే అందరం నష్టపోతాం. గాంధీభవన్‌లో కూర్చుంటే ఎన్నికల్లో గెలవలేం. ప్రజలతో మమేకమై గ్రూపులు లేకుండా పని చేస్తేనే గెలుస్తాం. కెసిఆర్‌ను ఓడించాలంటే అందరం కలిసికట్టుగా పని చేయాలి' అని తెలిపారు. 'అన్ని అర్హతలు ఉండి పదవి ఇవ్వకుంటే బాధ ఉంటుంది. అంత మాత్రాన పార్టీ మారతారా? తెలంగాణ కోసం మంత్రి పదవికే రాజీనామా చేసిన వ్యక్తిని నేను. నాకు ఏ పదవి అవసరం లేదు. భువనగిరి ఎంపిగా రూపాయి ఖర్చు లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలు నన్ను గెలిపించారు' అని కోమటిరెడ్డి అన్నారు.










