Nov 17,2021 07:02

పోరాడి సాధించుకున్న భారత స్వాతంత్య్రాన్ని పద్మశ్రీ అవార్డు గ్రహీతలే ఒక భిక్షగా కించపరుస్తుండటం ఓ మహా విషాదం. ఆ పోరాటంలో క్షమాభిక్ష కోరిన వారి వారసుల నుంచి అంతకన్నా ఏం ఊహించగలం. సాగు చేసిన వారికి కదా సాధకబాధకాలు తెలిసేది. ప్రాణ త్యాగాల ఫలితమైన వలస పాలన విముక్తికి పార్లమెంటరీ వ్యవస్థలో పదవులకూ తేడా తెలియని తెరమీది ముఖాలే ప్రముఖులు అయినప్పుడు ఈ దుస్థితి దాపురిస్తుందేమో! పద్మశ్రీ అవార్డు పొందిన మైకంలో, మైకులో ఏమైనా మాట్లాడొచ్చు అనుకున్నారేమో, నటి కంగనా రనౌత్‌ ఏకంగా దేశ స్వాతంత్య్రానికి అర్ధాన్నే మార్చేశారు. అవార్డు ప్రదానం చేసినవారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన భారత స్వాతంత్రపు తేదీలనే మార్చేస్తున్నారు! ఇది క్షమించరాని నేరం. 2014 లోనే దేశానికి స్వాతంత్య్రమొచ్చిందని చెప్పిన నటి మరి అంతకు ముందే ఏర్పాటు చేయబడిన అవార్డును ఎలా స్వీకరించారో? భక్తికి, దాసోహానికి, విమర్శకు ఒక హద్దు ఉండాలి. అది తమ ఉనికిని భూస్థాపితం చేసేలా ఉండకూడదు. భవిష్యత్తును ప్రసన్నం చేసుకోవడానికి పూర్వాశ్రమాన్ని హతమార్చుకోవడం ఎంత దారుణం. స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రను కించపరిచేలా మాట్లాడింది తెలియని అమాయకత్వంతో కాదు. అది అహంకారం మాత్రమే కాదు. స్వాతంత్య్ర పోరాటంలో లక్షల మంది ప్రాణ త్యాగాలను కించపరచడం మాత్రమే కాదు. అది బాధ్యత, భయం-భక్తి లేని తనం. ఒకరి మెప్పు కోసం ఎంతటి మాటకైనా తెగబడే తెంపరితనం. 'పర్యవసానాలు ఏమి ఉంటాయో కూడా నాకు తెలుసు'' అంటూ మాట్లాడటం ఎంత అహంకారం! ఇది పెంచి ప్రోత్సహించబడుతున్న పోకడ. మంద బిగువు చూసుకుని మొరిగే ఇలాంటి వారి సంఖ్య పెరిగితే ఇప్పుడున్న ఈ మాత్రపు స్వాతంత్య్రం కూడా ఖచ్చితంగా పోయే ప్రమాదమున్నది. ఈనాటి దౌర్భాగ్యమేమంటే, దేశమంటే ఒక రాజకీయ పక్షం కాదని, దేశమంటే ఒక మతం కాదనీ, దేశభక్తి అంటే ఒకరిని అసహ్యించుకోవడం అంతకన్నా కాదని దేశ అత్యున్నత అవార్డు గ్రహీతలకు చెప్పాల్సి రావడం. 'టైమ్స్‌ నౌ' నిర్వహించిన సదస్సులో నటి కంగనా రనౌత్‌ చేసిన ఈ అశుద్ధ వాక్కుల పైన.. కార్యక్రమ ప్రాసారానంతరం రేగిన వివాదానికి వీపు చరుచుకుని టైమ్స్‌ నౌ సంస్థ 'ఈ వ్యవహారంతో మాకు ఎలాంటి సంబంధం లేదు' అని ట్వీట్‌ చేయడం నిరుపయోగమైనది.
నిజానికి ఇప్పుడు భారత చరిత్రను కించపరుస్తున్న ఇలాంటి వాళ్ళకి తప్ప వేరెవ్వరికీ స్వాతంత్య్రం లేదు. దేవుడి పేరు మీద, ఆవు పేరు మీద, సంస్కృతి పేరు మీద ఇతరులపై తెగబడుతున్న దాడులకు అంతేలేని రోజులివి. రాజకీయ ప్రతిపక్షాలను ఒక శత్రు మూకల కింద జమగట్టేసి నిరంతరం భౌతిక, ఆర్థిక, మానసిక దాడులు చేస్తున్న సందర్భాలివి. ప్రశ్నించే విలేకరులను యుఎపిఎ (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణా చట్టం) కింద అరెస్టు చేస్తున్నారు. గత ఏడేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా పత్రికా విలేకరులు నిర్బంధాలకు గురవుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో పంతొమ్మిదేళ్ల మహిళ అత్యాచారాన్ని, పోలీసులు చేసిన అసంబద్ధ దహనాన్ని ప్రశ్నించినందుకూ సిద్దికీ కప్పన్‌ అనే విలేకరిని, ఈ మధ్య కాలపు త్రిపుర అల్లర్లను ప్రశ్నించినందుగాను శ్యాం మీరా సింగ్‌ అనబడే విలేకరితో బాటు అనేక మందిని యుఎపిఎ చట్టం కింద జైల్లో వేయడం స్వాతంత్య్రం లేని దేశాల్లో మాత్రమే జరిగే సంఘటనలు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్న సుధా భరద్వాజ్‌, ఆనంద్‌ తెల్తుంబ్డే, వరవరరావు లాంటి మేధావులను ట్రయల్‌ లేకుండా జైల్లో పెట్టడాన్ని ఏ స్వాతంత్య్ర దేశంలోనూ మనం చూడం.
మహోన్నత త్యాగాల ఫలితమైన దేశ స్వాతంత్య్రాన్ని కించపరిచినా ఏమీ చేయరన్న భరోసాని...2014 తర్వాతి పాలకులు ఇచ్చారు. ఇలాంటి పోకడలున్న చోట అనుచరులంతా అణకువగా ఉంటారనీ ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందనీ ఆశించడం అత్యాశే. భారత ప్రజాస్వామ్యం దిగజారుతున్నదని గుటెన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయానికి చెండిన 'వి-డెమ్‌' సంస్థ ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థలపై నివేదికను వెలువరిస్తే ఎగిరిపడిన పాలకులు, దేశ పౌరులే ఇలా వక్రభాష్యాలు చేస్తుంటే నోరు మెదపక పోవడాన్ని ఏమనాలి? ఈ రకమైన పోకడ ప్రజల సౌభ్రాతృత్వాన్ని మట్టుబెడుతుంది. దీనిని పునరుద్ధరించాలంటే సహనశీలురైన ఎంతమంది గాంధీలు జన్మించాలో!
స్వాతంత్య్రాన్నీ, దానికోసం పోరాడిన వాళ్ళనీ, ఆనాడు వేసిన ఆర్థిక పునాదులనూ వక్రీకరించడం లేదా తప్పుగా ప్రచారం చేయడం నేడు పనిగట్టుకుని నడుపుతున్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతిని యావత్‌ భారతదేశం మొన్ననే జరుపుకుంది. కానీ గాంధీ నెహ్రూల స్థానాలను చరిత్రలో మసకబార్చడానికి నేటి పాలకులు సర్వ ప్రయత్నాలూ చేస్తున్నారు. కంగనా వ్యాఖ్యలూ ఈ కోవ లోనివే. నేతల జయంతి అంటే వారి దార్శనికతను గుర్తు చేసుకోవడమే. నెహ్రూ కేవలం దేశానికి మొదటి ప్రధాని మాత్రమే కాదు. స్వతంత్ర భారత్‌కు ఆర్థిక పునాదులను వేసిన దార్శనికుడు. నేడు స్వాతంత్రోద్యమానికీ, నెహ్రూ దార్శనికతకూ సవాలు ఏర్పడింది. నేటి పాలకులకు సంబంధించిన పూర్వ నాయకులెవరూ స్వాతంత్య్రోద్యమ చరిత్రలో లేకపోయేసరికి దేశ స్వతంత్రం కోసం పోరాడిన నెహ్రూ-గాంధీ వంటి నేతలను కించపరుస్తున్నారు. నెహ్రూ కేవలం ప్రభుత్వ రంగాల సృష్టికర్తగా మాత్రమే చూడడానికి వీలు లేదు. ఆయన శాస్త్రీయ అవగాహనకు ప్రతీక. ప్రభుత్వ కార్యకలాపాల్లో మతపరమైన పోకడలకు అవకాశం ఉండకూడదని చెప్పడమే కాక చేసి చూపించిన ఘనత ఉన్నది. కానీ నేటి కాలంలో శాస్త్రీయ అవగాహన కన్నా మూఢ నమ్మకాలకు ప్రాధాన్యత పెరిగింది. కాబట్టే వ్యక్తి పూజలో మునిగి తేలుతూ చరిత్రను దహనం చేయచూస్తున్నారు. ఇది గర్హనీయం.
                                                                             - జి. తిరుపతయ్య / వ్యాసకర్త సెల్‌: 9951300016 /