Sep 13,2023 22:38

మాట్లాడుతున్న ఎపి ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రా రెడ్డి


ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : విద్యార్ధులకు అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య కే హేమచంద్రారెడ్డి అన్నారు. ఉన్నత విద్యారంగానికి సంబంధించిన వివిధ కోర్సులను ఉచితంగా అందించే లక్ష్యంతో ఎపి ఉన్నత విద్యామండలి సైలర్‌ అకాడమీతో ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో దానిపై కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు వివరించేందుకు విజయవాడ కెబిఎన్‌ కళాశాలలో సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి ఆచార్య కే.హేమచంద్రా రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులు, నూతన ఆవిష్కరణల నేపథ్యంలో అన్ని రంగాల్లోనూ నూతన విధానాలు ఆరంభమవుతున్నాయన్నారు. కేవలం తరగతి బోధన, సాధారణ ప్రయోగాలు, పాత విద్యా బోధనా పద్దతులను పక్కన పెట్టి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అనేక నూతన విధానాలను ప్రారంభించినట్లు తెలిపారు. నూతన కోర్సులను ఆన్‌లైన్‌లో చేసుకునేందుకు వీలుగా ఉన్నత విద్యామండలి పలు సంస్థలతో ఒప్పందాలను చేసుకుంటుందన్నారు. దీనికి సంబంధించి తమ ఓపెన్‌ లెర్నింగ్‌ క్యాంపస్‌ ఏపీ ఉన్నత విద్యామండలితో ఒప్పందం చేసుకొని అనేక కోర్సులను అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. విద్యావేత్త అర్చనాథకూరన్‌ మాట్లాడుతూ నూతన విద్యావిధానంలో నూతన విధానాలపై వివరించారు. కార్యక్రమానికి కేబీఎన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.నారాయణరావు స్వాగతం పలికారు. ఉన్నత విద్యామండలి అకాడమిక్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ డాక్టర్‌ విష్ణు తదితరులు పాల్గొన్నారు.