Feb 25,2023 23:10

సిఐ మధు నివాసం వద్ద నిరసన తెలుపుతున్న కందికుంట వెంకటప్రసాద్‌, టిడిపి నాయకులు

         కదిరి టౌన్‌ : కదిరి పట్టణం నిరసనలతో అట్టుడికింది. ఖాద్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయం వద్ద షాపుల తొలగింపు అంశంలో మొదలైన ఘర్షణ చిలిచిలికి గాలివానలా మారింది. సిఐ కౌన్సిలర్‌ మధ్య మొదలైన ఘర్షణ రాత్రికి టిడిపి, వైసి మధ్య ఘర్షణగా మారింది. ఏకంగా కదిరి సిఐ మధు మీసం మెలసి తొడగొట్టి ఛాలెంజ్‌ చేసే వరకు వెళ్లింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ వివాదంతో ఎప్పుడు ఏమి జరిగుతుందో అన్న టెన్షన్‌ ప్రజల్లో నెలకొంది.
లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం వీధిలో దుకాణాలను తొలగించే నిమిత్తం శనివారం ఉదయం సిఐ తుమ్మశెట్టి మధు, ఆ వార్డు టిడిపి కౌన్సిలర్‌ సుధారాణి మధ్య చిన్నపాటి ఘర్షణ మొదలైంది. సిఐ కౌన్సిలర్‌ను అసభ్య పదజాలంతో దూషించడంతో వివాదం అధికం అయ్యింది. దీనికి తోడు సిఐ టిడిపి నాయకలపై మీసం మేలేయడం.. తొడగొట్టి మరింతగా రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడమే కాకుండా మహిళలు అని చూడకుండా బూతుపురాణం అందుకోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. దీనికి అధికార వైసిపి నాయకులు మరింత మద్దతు తెలపడమే కాకుండా ఆయన్ను భూజలపైకి ఎత్తుకుని ఊరేగించారు. అటు టిడిపి, ఇటు వైసిపి రెండు పార్టీలకు చెందిన వారు నిరసనలు చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. శనివారం రాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగింది.
షాపుల తొలగింపుతో మొదలైన వివాదం..
కదిరి పట్టణంలోనున్న ప్రముఖ దేవాలయం లక్ష్మినరసింహ స్వామి ఉత్సవాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఆ వీధిలో రేకులషెడ్డులతో వేసుకున్న దుకాణాలున్నాయి. వీటిని తొలగించేందుకు పోలీసులు శనివారం ఆ ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడి టిడిపి కౌన్సిలరుగానున్న సుధారాణి పోలీసులను వారించారు. దుకాణాలు తొలగించవద్దని కోరారు. కాని సిఐ తుమ్మిశెట్టి మధు ఆమెపై బూతుపురాణం అందుకున్నారు. ఈ విషయం తెలిసి మరికొంత మంది మహిళలు అక్కడికి చేరుకోవడం పోలీసులు, టిడిపి నాయకుల మధ్య వివాదం మొదలైంది. అనంతరం పోలీసు స్టేషన్‌ ఎదుట మహిళలను దుర్భాషలాడిన సిఐపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టిడిపి మహిళా నాయకులు ధర్నాకు దిగారు. ఆ సమయంలోనూ మరోమారు సిఐ మధు రెచ్చిపోయారు. నిరసన తెలుపుతున్న మహిళలపై లాఠీఛార్జి చేశారు.
కందికుంట ఆందోళన
సిఐ మహిళల పట్ల అనుచితంగా ప్రవరించి వారిని ఇష్టానురీతిగా బూతులు తిట్టిన విషయం తెలుసుకున్న కదిరి టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్‌ పట్టణంలోని ఎన్జీవో కార్యాలయంలోని సిఐ నివాసం వద్ద ఆందోళనకు దిగారు. ఆయన వెంట పెద్ద సంఖ్యలో టిడిపి నాయకులు, కార్యకర్తలు వచ్చారు. ఈ సమయంలో కందికుంటపై కూడా సిఐ మధు అదే రకంగా వ్యవహరించారు. మీసాలు మేలేసి, తొడగొట్టారు. ఈ వివాదం నడుస్తున్న క్రమంలో వైసిపి నాయకులు అక్కడికి చేరుకుని సిఐకి మద్దతుగా నిరసన చేపట్టారు. ఆయన్ను భూజాలపై ఎత్తుకుని ఉరేగించారు. అటు టిడిపి, ఇటు వైసిపి ఇద్దరూ ఒకేసారి నిరసనలకు దిగడంతో పరిస్థితి చేదాటిపోయే వరకు వెళ్లింది. రెండు గ్రూపులు పరస్పరం రాళ్లు, చెప్పులు విసురుకున్నారు. ఈ ఘటనలో రెండువైపుల వారికి స్వల్ప గాయాలయ్యాయి. పరిస్థితి తీవ్ర రూపం దాల్చడంతో నల్లమాడ సిఐ అక్కడికి చేరుకుని రెండు గ్రూపులకు నచ్చజెప్పి పిరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
రహదారిపై టిడిపి శ్రేణుల నిరసన
టిడిపి శ్రేణులు కందికుంట ఆధ్వర్యంలో సిఐ తీరు నిరసిస్తూ కదిరి- అనంతపురం చెన్నై రహదారిపై సిఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ నిరసన చేపట్టారు. ఇక్కడికి కూడా సిఐ, వైసిపి శ్రేణులు మరోమారు అక్కడికి చేరుకున్నారు. దీంతో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. వైసిపి శ్రేణులు మరోమారు సిఐని భుజాల మీద ఎక్కించుకుని, మీసం మేలేశారు. 'తేల్చుకుందాం రా'.. అంటూ టిడిపి శ్రేణులకు సవాల్‌ విసిరారు. ఇదే సమయంలో టిడిపి, వైసిపి శ్రేణులు ఒకరిపై ఒకరు విసురుకున్నారు. వెంటనే పోలీసులు లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. మరోమారు నల్లమాడ సిఐ నిరంజన్‌ రెడ్డి కందికుంటకు సర్ధిచెప్పి అక్కడి నుంచి పంపారు.
పోలీసు స్టేషన్‌లో కందికుంట
రహదారిపై ఆందోళన చేస్తున్న టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్‌ను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాత్రి 11 గంటల వరకు స్టేషన్‌లోనే ఉంచుకున్నారు. ఈ సమయంలోనూ స్టేషన్‌ బయట టిడిపి శ్రేణులు ఆందోళన నిర్వహించారు.