Apr 25,2023 21:47

ఫొటో : మాట్లాడుతున్న ఎస్‌ఐ వెంకటరాజేష్‌

ఆటో కార్మికులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : ఆటో కార్మికుల క్రమశిక్షణతో ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని ఎస్‌ఐ వెంకటరాజేష్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. మంగళవారం నెల్లూరు జిల్లా ఆటో కార్మికు సంఘం ఆధ్వర్యంలో ఇందుకూరుపేట మండల జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎస్‌ఐ వెంకట రాజేష్‌ మాట్లాడుతూ ఆటో కార్మికులు మద్యం సేవించి వాహనం నడప రాదనీ, ఇన్సూరెన్స్‌, బండి కాగితాలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా సరిచూసుకోవాలని తెలిపారు. కేవలం ఆటో విషయంలోనే కాకుండా ప్రతి ఆటో కార్మికుడు సామాజిక స్పృహ కలిగి బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు. అలాగే ప్రపంచ కార్మిక దినం మేడేను జయప్రదం చేయాలని జిల్లా ఆటో కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు టివివి ప్రసాద్‌, జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మారుబోయిన రాజాలు పిలుపునిచ్చారు.
అదేవిధంగా 8గంటల పనిదినం సాధించుకునేందుకు కార్మిక వర్గం ఎన్నో బలిదానాలు చేసిందని అమెరికా లోనీ చికాగో నగరంలో జరిగిన ఉద్యమాలలో రక్త తర్పణాలతో ఎర్రజెండా ఆవిర్భవించిందని 8 గంటల పనిదినం సాధించుకున్నారని తెలియజేశారు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న 44 లేబర్‌ చట్టాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రద్దు చేసిందని కార్పొరేట్‌ పెట్టుబడీదారులకు కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్‌ కోడ్‌లను బిజెపి ప్రభుత్వం తీసుకురావడాన్ని కార్మిక వర్గం అంతా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. సమ్మె చేసే హక్కు సంఘాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు, వంటి అనేక కార్మిక వర్గం పోరాటాల ఫలితంగా సాధించుకున్నవని కార్మిక చట్టాలను రద్దు చేసిన బిజెపి ప్రభుత్వాన్ని 2024లో గద్దె దింపాలని పిలుపునిచ్చారు. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మండల సిపిఎం కార్యదర్శి మైపాటి కోటేశ్వరరావు, లీగల్‌ అడ్వైజర్‌ శ్యామ్‌ రెడ్డి, యువజన విభాగం నాయకులు చీమకుర్తి శ్రీనివాసుల రెడ్డి, వెన్ను వేణు, సిఐటియు నాయకులు నాసిన పరశురామయ్య, చాన్‌బాషా, మనోహర్‌, వాసు, దయాసాగర్‌, బర్రి ప్రసాద్‌, అశోక్‌, మస్తానయ్య, ప్రతాప్‌, ఆటో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.