ఇంటర్నెట్ డెస్క్ : కరోనా లాక్‌డౌన్ సమయంలో ఎవరూ కూడా ఎదురురెదురుగా కూర్చొని మట్లాడుకునే పరిస్థితి లేదు. అంతా అంతర్జాలంలోనే పలకరింపులు.. పని..పాఠాలు ఇలా ఏదైనా సరే.. అన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. మహమ్మారి పరిస్థితులు యావత్ ప్రపంచ జనాభాను ఆ దిశగా అడుగులు వేయించింది. ఇలాంటి పరిస్థితులనే తనకు అనుకూలంగా మార్చుకొని.. కోట్లను కూడబెట్టుకున్నాడు ఓ యువ పారిశ్రామికవేత్త. కేవలం రెండే రేండేళ్లలో.... సొంత ఆఫీసు అంటూ లేని వ్యక్తి సండే టైమ్స్ సంపన్నుల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. అతనెవరంటే.. ఇంగ్లాండ్‌కు చెందిన జానీ బౌఫారాత్. అతను స్థాపించిన ఆన్‌లైన్ సమావేశ వేదిక 'హోపిన్' ద్వారా ఇప్పుడు ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. కేవలం ఆరుగురి ఉద్యోగులతో 2019లో ప్రారంభమైన హోపిన్... ఇప్పుడు ఏకంగా 600 వందల మంది దాకా పనిచేస్తున్నారు. అయితే ఇంతమంది ఉద్యోగుల్లో బౌఫారాత్..కొంతమందిని ప్రత్యక్షంగా ఎప్పుడు కలుసుకోలేదట. అయినా వీరందరూ ఒకే దగ్గర పనిచేస్తేనే కదా.. వారితో నేరుగా మాట్లాడడం.. పరిచయాలు పెంచుకోవడం లాంటివి జరిగేవి. ఇంతవరకూ హోపిన్‌కు సొంత భవనమే లేదు. ఎక్కడెక్కడవారైనా.. ఏ టైమ్‌లో అయినా సమర్థవంతంగా పని చేసుకోవచ్చని బౌఫారత్ చెబుతున్నాడు. అలాగే బౌఫారత్‌కు అసలిప్పటివరకూ సొంత భవనం గురించి ఆలోచనలే రాలేదట. భవనం లేకుండా బిజినెస్ చేయలేమా అని తన ఉద్దేశమట. ఇలా తను ప్రారంభించిన హోపిన్ ద్వారా వందల మందే కాదు.. అలవోకగా ముప్పై, నలభై వేల మంది దాకా ఆన్‌లౌన్ సమావేశాన్ని నిర్వహించుకోవచ్చు. ఇక ఐక్యరాజ్యసమితి, నాటో లాంటి పెద్ద పెద్ద సంస్థలకు హోపిన్ సేవలు అందించింది.
సండే టైమ్స్ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకోవడంపై జానీ బౌఫారత్ మాట్లాడుతూ.. 'నేను స్థాపించిన హోపిన్ కంపెనీ.. లాక్‌డౌన్ సమయం వల్లే విజయవంతమైంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రజలు ప్రత్యక్షంగా కలుసుకోకుండానే, ఆన్‌లైన్‌లో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందువల్లే తన కంపెనీ లాభాల పంట పండించింది' అని అన్నారు. హోపిన్ సరైన సమయంలో లాంచ్ అయిన స్టార్టప్‌గా నిలిచిపోయింది. దీనివల్ల జానీ బౌఫారత్ అతని కంపెనీ విలువను 5.65 బిలియన్ డాలర్లకు పెంచాడు.











