ప్రజాశక్తి - రాయచోటి: విభిన్న ప్రతిభావంతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి వారు ఆర్థికంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ గిరీష పీఎస్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని స్పందన హాల్లో కలెక్టర్ గిరీష పి ఎస్, జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారీయ, చేతుల మీదుగా విభిన్న ప్రతిభావంతులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులలో ఆత్మస్థైర్యం నింపి వారి కాళ్ళ మీద నిలబడే విధంగా ప్రభుత్వం వివిధ రకాలైన బ్యాంకు రుణాలు అందజేస్తోందని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం రుణాల ఇస్తోందని తెలిపారు. తీసుకున్న రుణాలను తిరిగి బ్యాంకులకు సక్రమంగా చెల్లించాలన్నారు. రుణాలు ఏ అవసరం కోసం తీసుకున్నారో వాటికి మాత్రమే ఖర్చు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే వివిధ రకాల రుణాలను జిల్లాలోని అర్హులైన విభిన్న ప్రతిభావంతులందరూ సద్వినియం చేసుకొని ఆర్థికంగా అభివద్ధి చెందాలన్నారు. నేషనల్ హ్యాండ్ క్యాప్డ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌ఎఫ్‌డిసి) ద్వారా పీలేరు మండలం, రేగల్లు గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీకి రూ. 5 లక్షలు, పీలేరు మండలం, ఎనుములవారిపల్లెకు చెందిన వై.మహేశ్వర్ రెడ్డికి రూ. 5 లక్షల చెక్కులను పాడి పరిశ్రమ కోసం కలెక్టర్ చెక్కులు అందజేశారు.










