Sep 12,2023 22:02

మాట్లాడుతున్న డాక్టర్‌ వి. రాధికా రెడ్డి

ప్రజాశక్తి - హెల్త్‌ యూనివర్శిటీ : ''ఆత్మహత్యల నివారణలో సమాజం పాత్ర కూడా ముఖ్యమైనదని, ఆత్మహత్యల సంఘటనల గురించి వివరణాత్మక వివరణలు కాకుండా సమస్యలకి అండగా ఉన్నట్లు భరోసా ఇవ్వడం అవసరం'' అని ప్రముఖ సైకియాట్రిస్ట్‌, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ రిజిస్ట్రార్‌ డా||వి. రాధికారెడ్డి పేర్కొన్నారు. బెంజిసర్కిల్‌ వద్ద గల వాసవ్య నర్సింగ్‌ హౌమ్‌లో డా||సమరం అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె ''ఆత్మహత్యల నివారణ'' అంశంపై ప్రసంగించారు. భారతదేశంలో సంవత్సరానికి లక్షమందికి పైగా ఆత్మహత్యలతో విలువైన ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. గత 3సంవత్సరాల్లో లక్ష జనాభాకి 10.2 ఆత్మహత్యలు జరగగా, ఇప్పుడు 11.3 ఆత్మహత్యలకి పెరిగాయన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, వెస్ట్‌ బెంగాల్‌లో ఎక్కువ మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఆత్మహత్యలకి ప్రయత్నించే వాళ్ళ సంఖ్యలో మహిళలు ఎక్కువ ఉండగా, ఆత్మహత్యలతో ప్రాణాలు కోల్పోయేవాళ్ళు మాత్రం పురుషులే ఎక్కువన్నారు. వైవాహిక జీవితం గడుపుతున్న వారికంటే విడాకులు పుచ్చుకున్నవాళ్ళు, దంపతులు ఒకరికొకరు విడిపోయినవాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం ఎక్కువన్నారు. అనారోగ్య కారణాలు, మానసిక వ్యాధులైన డిప్రషన్‌, స్కిజోఫ్రినియా వంటి వ్యాధుల వల్ల కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఆత్మహత్యలు చేసుకోవడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ వాటి నివారణ విషయంలో సమాజం శ్రద్ధ తీసుకుంటే చాలావరకు తగ్గిపోతాయన్నారు. డిప్రెషన్‌కు గురైన వారి మనస్తత్వాన్ని దగ్గరుండి చూసినవాళ్ళకి కొన్ని సంకేతాలందుతాయని, వాటిని గుర్తించి, నేనున్నానని అభయం వాళ్ళకి ఇవ్వగలిగితే ఆత్మహత్య చేసుకోవడం ఉండదన్నారు. డా||మారు వందన సమర్పణ చేసారు