న్యూఢిల్లీ : పెగాసస్, ఇతర సమస్యలపై పార్లమెంట్ ఉభయసభల్లో మూడవ రోజు కూడా హైడ్రామా నడుస్తోంది. ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్, మీడియా సంస్థలపై ఐటి సోదాలపై విపక్ష ఎంపిలు ఆందోళనలు చేపడుతున్నారు. రాజ్యసభలో గురువారం విపక్ష సభ్యుల విమర్శలతో ఎలక్ట్రానిక్, సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ తన ప్రకటనను వినిపించలేకపోయారు. పెగాసస్ గురించి మాట్లాడేందుకు వైష్ణవ్ లేవగానే... తృణమూల ఎంపి శాంతన్ సేన్ తన పత్రాలను లాక్కొని, చించేసి, డిప్యూటీ స్పీకర్ హరివంశ్ నారాయణ్ సింగ్ వైపు విసిరారు. దానికి సంబంధించిన ప్రతి కాపీని సభలో ఉంచినప్పటికీ... తన వాగ్దాటిని ప్రదర్శించలేకపోయారు. అత్యంత సంచలనాత్మక కథను ఓ వెబ్ పోర్టల్ జులై 18..2021న ప్రచురించిందని, ఈ కథనం చుట్టూ చాలా ఆరోపణలు ఉన్నాయని, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ఒక రోజు ముందు.. ఇదేమీ యాదృచ్చికం కాదంటూ ముగించారు. దీంతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది.
విపక్షాల ఆందోళనలతో గురువారం రాజ్యసభ మూడు సార్లు వాయిదా పడింది. ఆర్జేడీ నేత మనోజ్ ఝా మాట్లాడుతూ... ఐటి శాఖ మంత్రి వైఖరి దురదృష్టమని అన్నారు. విపక్షాల ఆందోళన మధ్య ఐటి శాఖ మంత్రి ప్రకటన చేయడం, సమస్యను ఎగతాళి చేయాలని కేంద్రం చూస్తున్నట్లు అర్థమౌతుందని మనోజ్ వ్యాఖ్యానించారు. ఇటు లోక్‌సభ కూడా మూడు సార్లు వాయిదా పడింది. పెగాసస్‌తో పాటు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిసస్తూ మమతా ఎంపిలతో పాటు అకాలీదళ్ ఎంపిలు ఆందోళనలకు దిగారు. వీటికి ప్రధాని మోడీ సమాధానాలనివ్వాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనలు కొనసాగుతుండగానే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ... ఏ అంశంపైనైనా చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు.










