ఆశాలపై వేధింపులు తగదు: సీఐటీయూ
ప్రజాశక్తి- శ్రీకాళహస్తి : పని పేరిట ఆశా వర్కర్లను వేధించడం మానుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్య సూచించారు. సెలవు పెడితే జీతాలు ఆపేయడం, రాత్రి డ్యూటీలు చేయకుంటే ఇంటికీ పంపుతామని బెదిరించడం మానుకోవాలని హెచ్చరించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. తొట్టంబేడు ప్రాథమికఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేస్తున్న ఆశా వర్కర్లను వైద్యాధికారిణి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గ్రామ సేవకులైన ఆశా వర్కర్లను పని పేరిట పీహెచ్సీలో రాత్రిళ్ళు విధులు నిర్వహించాలని ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు. రాత్రి డ్యూటీలు చేయలేమని చెప్పే ఆశా వర్కర్లను ఇంటికి పంపిస్తామంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. ఆశా వర్కర్లు కేవలం సహాయకులు మాత్రమేననీ, వారికి పీహెచ్సీలో రాత్రి డ్యూటీలు వేయడం ఏంటని ప్రశ్నించారు. అదేవిధంగా ఆశా వర్కర్లకు అత్యవసర పరిస్థితుల్లో సెలవు కూడా ఇవ్వకుండా వైద్యాధికారిణి వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే సెలవు పెట్టారన్నా కక్షతో తొట్టంబేడు మండలంలోని చిట్టత్తూరు, పెద్దకన్నలి పంచాయతీ ఆశా వర్కర్లైన చంద్రకళ, నాగభూషణమ్మలకు సెప్టెంబర్ నెల జీతాలు వేయకుండా ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఆశా వర్కర్లు సెలవులు పెట్టుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించినా కూడా తొట్టంబేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిణి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా ఆశా వర్కర్ల పట్ల ఆమె తీరు మారకుంటే సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య, పట్టణ కార్యదర్శి వెంకటేష్ పాల్గొన్నారు.










