Apr 07,2023 20:01

రాయచోటి : వ్యాధులపై అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

ప్రజాశక్తి-రాయచోటి : ప్రతి ఒక్కరూ వ్యాయామం చేసి ఆరోగ్యంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కొండయ్య పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాయచోటి ఏరియా ఆస్పత్రిలో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ స్థానిక ప్రభుత్వాస్పత్రి నుంచి నేతాజీ సర్కిల్‌ మీదుగా బస్టాండ్‌ వరకు కొనసాగింది. 'ఆరోగ్యమే మహాభాగ్యం, వ్యాయామం చేయండి.. ఆరోగ్యంగా ఉండండి, రోజూ నడక ఆరోగ్యానికి చాలా మంచిది ,తెల్ల బియ్యం మానండి, ముడి బియ్యం వాడడండి, ఇంటి వంటకం ఆరోగ్యానికి మంచిది' అనే నినాదాలతో ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా డిఎంహెచ్‌ఒ మాట్లాడుతూ ఆరోగ్యానికి మించిన సంపద లేదని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ రోజూ, స్విమ్మింగ్‌, జాగింగ్‌, యోగా వంటి ఏదో ఒక వ్యాయామం చేయాలని తెలిపారు. అనంతరం డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ జంక్‌ ఫుడ్స్‌ తగ్గించాలని, పాలిష్‌ పట్టిన బియ్యం, గోధుమపిండి తగ్గించి తణ ధాన్యాలను ఎక్కువగా వాడాలన్నారు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్‌, డిప్యూటీ మాస్‌ మీడియా అధికారి దేవశిరోమణి ,హెల్త్‌ ఎడ్యుకేటర్‌ బలరామరాజు, రాజగోపాల్‌, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ నారాయణ, రామకష్ణ యాదవ్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌ వెంకటేశ్వరరెడ్డి, విశ్వనాథరెడ్డి, టీబీ సిబ్బంది గంగన్న ,నగేష్‌ , ఏరియా హాస్పిటల్‌ సిబ్బంది, అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఎఎన్‌ఎంలు ,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కలికిరి: జీవనశైలిలో మార్పులతో అందరికీ ఆరోగ్యం లక్ష్యాన్ని సాధించవచ్చునని జిల్లా డిపిఎంఒ డాక్టర్‌ లోకవర్ధన్‌ అన్నారు. ప్రపంచ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం మండలంలోని రెడ్డివారిపల్లిలో ప్రజలకు అసంక్రమిత వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ప్రతి ఐదు మందిలో ఒకరు ఏదో ఒక అసంక్రమిత వ్యాధులతో బాధపడుతున్నారని, అసంక్రామిత వ్యాధులు అంటే ఒకరి నుండి మరికరికి వ్యాప్తి చెందవని, ఆ జబ్బులు షుగర్‌, బిపి, కాన్సర్‌, థైరాయిడ్‌, పక్షవాతం, గుండె సంబంధ జబ్బులు, దంత, కంటి సమస్యలు, స్థూలకాయం వంటివని తెలిపారు. హెల్త్‌ ఎడ్యుకేటర్‌ మహమ్మద్‌ రఫీ మాట్లాడుతూ ఈ అసంక్రమిత జబ్బులన్నిటికీ ముఖ్య కారణాలు గురించి వివరించారు. ప్రతి రోజూ క్రమం తప్పని వ్యాయామం, యోగా చేయడంతో ఒత్తిడి, ఆలోచనలు తగ్గించుకోవచ్చన్నారు. అనంతరం నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మేడికుర్తి ఆరోగ్య పర్యవేక్షకులు హేమలత, ఎంఎల్‌హెచ్‌పి భాను, ఎఎన్‌ఎంలు మాధవి, పార్వతి, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు. ములకలచెరువు: స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఆసుపత్రి నుండి మెయిన్‌ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిహెచ్‌ఒ షకీలాబేగం, ఎంపిహెచ్‌ఇఒ రమణయ్య, ఎంపిహెచ్‌ఎస్‌ అమరావతి, ఆశా వర్కర్లు లక్ష్మీదేవి, మునిరత్న, బి.లక్ష్మీ,కళావతి, సల్మా పాల్గొన్నారు. కలకడ : మండల కేంద్రంలో కలకడ, ఎర్రకోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రపంచ ఆరోగ్య జనాత్వాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ రెండు కేంద్రాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించి, ఆరోగ్యంపట్టు ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకోవాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. గాలివీడు :ప్రతి సంవత్సరమూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ర్యాలీలు నిర్వహించి ప్రజలకు ఆరోగ్యంపై అవగాన కల్పించేవారు. ఈ ఏడాది శుక్రవారం ప్రపచం ఆరోగ్య దినోత్సవాన్ని వైద్య సిబ్బంది పూర్తిగా విస్మరించినట్లు తెలుస్తోంది. ఏ ఒక్క అధికారి కానీ, సిబ్బంది కానీ మండల కేంద్రంలో ఏ ఒక్క కార్యక్రమం నిర్వహించకపోవడంపై పలు విమర్శలు విన్పిస్తున్నాయి. తంబళ్లపల్లి : ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదని విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు ఉంచాలని డాక్టర్‌ మునికుమార్‌ తెలిపారు. కోసవారిపల్లిలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పిఎంపిహెచ్‌ఇఒ రమణ, సిహెచ్‌ఒ సుమతి, ఫార్మసిస్టు వేమారెడ్డి, ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. పీలేరు: అందరి ఆరోగ్యం మనందరి బాధ్యతని తలుపుల రేగళ్ళు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు డాక్టర్‌ రమేష్‌రెడ్డి డాక్టర్‌ కార్తీక్‌ కుమార్‌ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్‌బిఎస.కె ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ శేషగిరి బాబు, డాక్టర్‌ చంద్ర శేఖర్‌ నాయక్‌, డాక్టర్‌ శివయ్య, డాక్టర్‌ రామాంజి, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌, నర్సింగ్‌ సిబ్బంది, జయలక్ష్మి, హెచ్‌ఇలు కొండయ్య, ఉషారాణి, హెల్త్‌ సూపర్వైజర్లు కుసుమ కుమారి, పవన్‌, సిహెచ్‌ఒలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.