Dec 27,2022 19:46

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, జెసి, అధికారులు

ప్రజాశక్తి - రాయచోటి : సంక్షేమ ఫలాలను అర్హులైన లబ్ధిదారులకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్‌ గిరీష అన్నారు. మంగళవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాలు అందని లబ్ధిదారులకు నగదు పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ గిరీష, జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారీయా, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ, విఎస్‌డబ్ల్యూ ఎస్‌ఎఒ మోహన్‌రాజు, డిఆర్‌డిఎ సత్యనారాయణ, జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమ, సాధికారిత అధికారి జాకీర్‌ హుస్సేన్‌, జిల్లా అధికారులు, లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నవరత్నాలు బైఅన్యువల్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా మిగిలిపోయిన రాష్ట్రంలోని 2,79,065 మంది లబ్ధిదారులకు రూ.590.91 కోట్లను కంప్యూటర్‌ బటన్‌ నొక్కి వారి ఖాతాలకు నగదును జమ చేశారన్నారు. అన్నమయ్య జిల్లాలో నవరత్నాలు బైఅన్యువల్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా 19,582 మంది లబ్ధిదారులకు రూ.15.72 కోట్లు జమ చేశామన్నారు. నిర్ణీత సమయంలోగా దరఖాస్తు చేసుకోకపోవడంవల్లో, బ్యాంకు ఖాతాలు సరిగ్గా లేపోవడం వల్లో ఇలా ఏ కారణం చేతనైనా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందకపోతే అటువంటి వారందరి కోసం ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం తీసుకొచ్చిందన్నారు. ప్రతి కుటుంబానికీ నాలుగు నుంచి ఐదు పథకాల నుంచి లబ్ధి పొందుతున్నారు అన్నారు. జగనన్న అమ్మబడి, వసతి దీవన, విద్యాదివేన, జగనన్న చేదోడు, ఇలా చాలా రకాల పథకాలు ద్వారా ప్రతి కుటుంబానికీ రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా వాలింటీర్లు, సచివాలయ సిబ్బంది మీ గడప వద్దకే వచ్చి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ద్వారా ఆర్థిక లబ్దిని నేరుగా తమ ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నగదు జమ చేశారని చెప్పారు.