Sep 28,2022 22:26

ప్రజాశక్తి - వన్‌టౌన్‌
ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూడవరోజు బుధవారం శ్రీ గాయత్రీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ నేపథ్యంలో దుర్గగుడిలో విధులు నిర్వహిస్తున్న అర్చక స్వాములను పోలీసులు లోపలకు వెళ్ళనీయకుండా అడ్డుకు న్నారు. దీంతో తాము దేవాలయ అర్చకులమని, తమకు పాసులు ఉన్నాయని వారు ఒక పక్క చెబుతున్నా అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టుబుళ్లు నిలిపివేసిన తీరుపై వారు తీవ్ర మనస్తాపం వ్యక్తం చేశారు. ఈ సంఘటన బుధవారం దుర్గగుడి రాజగోపురం ప్రాంతంలో చోటుచేసుకుంది. అటుగా వస్తున్న దేవాలయ అర్చకులు తాము గుడిలోకి వెళ్ళాలని చెప్పినా వినకుండా అడ్డుకుంటే విధులు ఎలా నిర్వహిం చాలని వారు వాపోతున్నారు. దేవాలయంలో అమ్మవారి సేవలు అందించే తమకే ఈ రకంగా పోలీసులు ఆంక్షలు విధిస్తే ఎలాగని వారు వాపోతున్నారు. అదే సమయంలో దేవాలయంలో కలెక్టర్‌ డిల్లీరావు క్యూ లైన్లు తదితర పర్యవేక్షణకు వచ్చారు. దీంతో సంబంధిత పోలీసులు విధానంపై అర్చకులు కలెక్టర్‌ డిల్లీరావుకు వివరించారు. తమకు దేవాలయం ఇచ్చిన పాసులు ఉన్నా కూడా పోలీసులు నిలిపివేశారని తెలిపారు. సంబంధిత పాసులను కలెక్టర్‌కు చూపించారు. దుర్గగుడి ఈవో భ్రమరాంబ తమకు ఆదేశాలు జారీ చేయలేదని పోలీసులు చెబుతున్నారని, ఈ విధంగా కొనసాగితే తాము విధులు నిర్వర్తించలేమని అర్చకులు కలెక్టర్‌ వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే దుర్గగుడి ఈవో భ్రమరాంబ తీరుపై అర్చకులు ఆందోళన చెందుతున్నారు. ఉత్సవాలు తొలి రోజు నుంచి సమన్వయ లోపాలు తలెత్తుతూనే ఉన్నాయని, వీటిని పరిష్కరించే దిశగా ఈవో చర్యలు చేపట్టడం లేదని దుర్గగుడి ఉద్యోగులు, అర్చకులు తీవ్ర మనస్థాపం చెందుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై కలెక్టర్‌ డిల్లీరావు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని వారికి తెలిపారు.