May 23,2022 07:50
  • మొదటి స్థానంలో ఎపి, రెండోస్థానంలో తెలంగాణ

న్యూఢిల్లీ : గత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బిఐ నుంచి స్పెషల్‌ డ్రాయింగ్‌ ఫెసిలిటీ (ఎస్‌డిఎఫ్‌), వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌, ఓవర్‌డ్రాఫ్ట్‌ రూపంలో అత్యధిక రోజులు తెలుగు రాష్ట్రాలు అప్పులు చేశాయని లెక్క తేలింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ మొదటిస్థానంలో, తెలంగాణ రెండోస్థానంలో నిలబడ్డాయి. ఏపీ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరంలో 305 రోజులపాటు స్పెషల్‌ డ్రాయింగ్‌ ఫెసిలిటీ, 283 రోజులు వేస్‌ అండ్‌ మీన్స్‌, 146 రోజులు ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకుందని 'ఇన్వెస్ట్‌మేంట్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ క్రెడిట్‌ రేటింగ్‌ ఇండియా లిమిటెడ్‌' అనే సంస్థ తాజాగా విడుదల చేసిన డాటా ద్వారా వెల్లడైంది. దేశంలో మరే రాష్ట్రమూ ఇన్ని రోజులు చేబదుళ్ల సౌకర్యాన్ని ఉపయోగించలేదు. ఏపీ తర్వాత రెండో స్థానంలో తెలంగాణ ఉంది. మూడో స్థానంలో మణిపూర్‌ నిలిచింది. ఈ సౌకర్యాలు ఎంత ఎక్కువగా ఉపయోగించుకుంటే ఆ రాష్ట్ర పరిస్థితి అంత ఆందోళనకరంగా ఉన్నట్టు ఆర్థికవేత్తల అంచనా.
      గత ఆర్థిక సంవత్సరం మొత్తం 17రాష్ట్రాలు ఎస్‌డీఎఫ్‌, 14 రాష్ట్రాలు వేస్‌ అండ్‌ మీన్స్‌, 9 రాష్ట్రాలు ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని వాడుకున్నాయి. అసోం, బీహార్‌, గుజరాత్‌, కర్నాటక, మధ్యప్రదేశ్‌, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లు దేనినీ ఉపయోగించుకోలేదు. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ కేవలం ఒక్కరోజు మాత్రమే ఎస్‌డీఎఫ్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నాయి. మొత్తం మూడు రకాల రుణ సౌకర్యాలను ఆరు రాష్ట్రాలు వాడుకున్నాయి. కన్సాలిడేటెడ్‌ సింకింగ్‌ ఫండ్‌లో ఏటా పెట్టే వార్షిక పెట్టుబడుల ఆధారంగా స్పెషల్‌ డ్రాయింగ్‌ ఫెసిలిటీ కింద అప్పు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి అప్పుపై రెపోరేటు కంటే 2శాతం తక్కువగా వడ్డీ వసూలు చేస్తారు. ఇదే సౌకర్యాన్ని గవర్నమెంటు సెక్యూరిటీ ఆధారంగా వాడుకుంటే 1శాతం మాత్రమే వడ్డీ విధిస్తారు. వేస్‌ అండ్‌ మీన్స్‌ కింద తీసుకునే అప్పు మూడు నెలల్లోపు కడితే రెపోరేటు ప్రకారం వడ్డీ వసూలు చేస్తారు. తిరిగి చెల్లించే సమయం అంతకు మించితే 1శాతం అదనంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
     ఈ రెండు సౌకర్యాలు పూర్తయిన తర్వాత కూడా ఆర్థిక అవసరాలు తీరకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఓవర్‌డ్రాఫ్ట్‌కు వెళ్తాయి. వేస్‌ అండ్‌ మీన్స్‌ కింద అర్హత ఉన్న మొత్తానికి సమానంగా తీసుకుంటే రెపోరేటు 2శాతం, 100శాతానికి మించి తీసుకుంటే 5శాతం వడ్డీ వసూలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం రోజువారీ అవసరాలకు సరిపోనప్పుడు ఇవి ఆర్‌బీఐ వద్ద స్వల్పకాలానికి ఈ మూడింటిలో ఏదైనా ఒక సౌకర్యం ద్వారా అప్పుచేస్తుంటాయి. ఈ సౌకర్యాలను అత్యధిక రోజులు ఉపయోగించుకున్న రాష్ట్రాలు వడ్డీ రూపంలో ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది.